పింఛన్లు ఇప్పించండి సారూ...
- గ్రీవెన్స్‌లో బాధితుల మొర
- విజ్ఞప్తులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్
కలెక్టరేట్,ఆగస్టు 6 (టీమీడియా): పింఛన్లు రద్దు చేసిండ్రు ఇప్పించండి సారు.. అంటూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు వినతులు వెల్లువలా వచ్చాయి. సమస్యలతో వచ్చాం.. పరిష్కరించండి అంటూ బాధితులు తమ గోడు వినిపించారు. ఎక్కువ పింఛన్లు ఇప్పించాలని, భూములకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వచ్చాయి. బాధితుల నుంచి జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్న నేరుగా విజ్ఞప్తులు స్వీకరించి, అక్కడే ఉన్న అధికారితో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
సర్టిఫికెట్లు ఇప్పించండి
వికలాంగులం మాకు సదరమ్ క్యాంపు ఏర్పాటు చేసి వికలాంగా ధృవీకరణ పత్రాలు ఇప్పించాలని మద్దూరు మండలం బెక్కండిగ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గ్రామానికి చెందిన కుంద్రి పార్వతమ్మ, మల్లం సుగుణ, మయ్యోజు వల్లెమ్మ, మేడిచెల్ల వజ్రవ్వ పింఛన్ రావడం లేదని వాపోయారు. వృద్ధులం, వికలాంగులమైన మమ్మల్ని ఆదుకొని న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు.
వేతన స్కేలు అమలు చేయాలి
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సుమారు 20వేల మందికి ప్రభుత్వ ఉపాధ్యాయల మాదిరిగా వేతన స్కేలు అమలు చేయాలని ప్రిస్టా జిల్లా అధ్యక్షుడు బిరుదురాజు శ్రీధర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. జిల్లాలో వివిధ పేర్లతో సుమారు రెండు వేల పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించుటలో యాజమాన్యాలు విఫలం అయ్యాయి. విద్యార్థుల నుంచి పన్నెండు నెలలు వసూలు చేస్తున్న యాజమాన్యాలు ఉపాద్యాయులకు మాత్రం ఇవ్వడం లేదు. ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ 12నెలల వేతనాన్ని బ్యాంకుల ద్వారా అందజేస్తూ, సర్వీస్ బుక్స్ వెంటనే తెరవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు గురించి...
నిరుపేద వితంతువును. నాకు ఎలాంటి స్థిరాస్తులు లేవు. ఉన్న కొద్ది స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాను. హౌసింగ్ అదికారులచే విచారించి ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఇళ్లు మంజూరు చేయించి నిరుపేద వితంతువును ఆదుకోవాలని హన్మకొండ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన వేటూరి సుజాత సోమవారం గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించింది.
గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించుట...
చదువుకుంటాను ఏదైనా రెసిడెన్షియల్ పాఠశాలలో సీటు ఇప్పించండి అంటూ పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామానికి చెందిన ఊళ్ళరావు వంశీ కృష్ణ తండ్రి సాంబయ్య గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేశారు. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే ఉందని, ఒక కూతురు రక్త సంబంధిత వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉన్న ఒక్క కుమారున్ని ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేదు. కావున నిరుపేద విద్యార్థికి చేయూతనిచ్చి ఆదుకోగలరు.
పింఛన్ ఇప్పించుట గురించి...
ప్రమాదవశాత్తు కుడికాలు తీసివేశారు. సుమారు ఐదు సంవత్సరాల క్రితం బావి పూడిక తీస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో కాలు పూర్తిగా తొలగించారు. వైద్యాధికారులు కూడా వందశాతం వికలాంగత కలిగి ఉన్నట్లు ధృవీకరణ సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛన్ కోసం సంవత్సరన్నర కాలంగా తిరుగుతున్నప్పటికీ ఇంత వరకు పింఛన్ మంజూరు కాలేదని పర్వతగిరి మండలం ఏనుగల్లు (గడ్డపారతండా)కు చెందిన భూక్య ధర్మ విజ్ఞప్తి చేశారు.
కులాంతర వివాహితులకు ప్రోత్సాహకాలు అందజేయాలి
జిల్లా వ్యాప్తంగా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రోత్సాహకాలు అందజేయాలని కుల మతాంతర వివాహితుల సంక్షేమ సంఘం జిల్లాకమిటీ సోమవారం గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల్లో సుమారు 700మందికి ప్రోత్సాహక బహుమతులు అందాల్సి ఉంది. అలాగే కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు జీవో నెం.371 ప్రకారం ఇళ్ళ స్థలాలను అందరికి మంజూరు చేయాలి. అలాగే జీవోనెం.3ఘైపకారం ప్రతి జంటకు రూ.50వేలు అందజేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
Other News