Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  General News
ఊపందుకున్న వ్యవసాయపనులు

యాచారం, జూలై 22 (టీ మీడియా): మండలంలో రెండేళ్లుగా సరిపడ వర్షాలు లేక వ్యవసాయపనులు అంతంత మాత్రంగానే కొనసాగాయి. నిరాశతో ఉన్న రైతన్నకు శుక్రవారం సాయంత్రం నుంచి రెండు రోజులుగా కురిసిన వర్షానికి రైతులు ఒక్క సారిగా ఊపిరిపీల్చుకున్నారు. రెండు నెలల క్రితం పూర్తిగా వర్షాదార పంటలైన పత్తి, జొన్న, మొక్కజొన్న, ఆముదంలాంటి పంటలకే రైతులు అధిక ప్రాధాన్యతనిచ్చారు. వరిసాగు మాత్రం నీరులేక అంతంత మాత్రంగానే చేపట్టారు. రెండురోజుల క్రితం కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయపనుల్లో జోరుగా నిమగ్నమయ్యారు. బీడు భూములుగా ఉన్న వ్యవసాయపొలాలను ట్రాక్టర్ల ద్వారా దున్నించి కరిగట్లు సిద్ధం చేస్తున్నారు. వరినాట్ల కోసం సిద్ధం చేసిన వరితుకాన్ని ఆదివారం మహిళలు పొలాల్లో నాట్లు వేశారు. మండల పరిధిలోని తక్కళ్ళపల్లి, కొత్తపల్లి, మేడిపల్లి, నందివనపర్తి తదితర గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఆరుతడి పంటలైన టమాట, మిరప, కొత్తిమీర, పుదీనలాంటి నార్లువేసి వ్యవసాయానికి సన్నద్ధమవుతున్నారు. కరువులో పనులులేక కూలీలు కేవలం ఉపాధి హామీ పథకంపైనే ఆధారపడి జీవనం కొనసాగించేవారు, కాని వర్షాలు కురవటంతో కూలీలకు సైతం చేతినిండ పనులు దొరకుతున్నాయి. కూలీలకు రోజుకు రూ.130 నుంచి రూ.160వరకు డిమాండ్ పలుకుతోంది. మరో రెండు నెలల్లో భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు పెరగాలని రైతులు కోరుకుంటున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd