Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  General News
ఆగని ‘హింస’

రంగాడ్డి జిల్లా (టీ మీడియా): వరకట్న దాహానికి కొందరు.. కామాంధుల దుశ్చర్యలకు మరికొందరు.. ఇలా అతివలపై ఆకృత్యాలు అన్ని చోట్లా జరగుతున్నాయి. సమాజం దినదినాభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలోనూ మహిళలపై హింస ఆగడం లేదు. పైగా పెరిగిపోతూ ఉంది. ఇటీవల జాతీయ నేర నమోదు సంస్థ నివేదికల్లో వెల్లడైన నగ్నసత్యాలివి. ఏపీ ఇందులో రెండో స్థానంలో ఉండటం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

దేశంలోకెల్లా ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలోనే గృహహింస కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని కేంద్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ తీరథ్ ఇటీవలే రాజ్యసభలో వెల్లడించారు. 2007-10 మధ్య దేశవ్యాప్తంగా 26, 808 కేసులకు 9, 600 కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో వాటి సంఖ్య 5, 393గా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 1019 కేసులు నమోదయ్యాయి.
గృహహింస చట్టం మహిళలకో వరం. గృహ హింసకు గురవుతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. పెరిగిన నాగరికత అక్షరాస్యత నేపథ్యంలోనూ మహిళలపై దాడులు నిత్యకృత్యంగానే మారుతున్నాయి. అయితే ఈ చట్టం ప్రవేశపెట్టి ఏడేళ్లవుతున్నా.. పురుషాధిక్య సమాజంలో పెద్దగా మార్పు తీసుకురాలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే బాధిత మహిళలకు మాత్రం ఆసరాగా ఉంటోంది. కడవరకు పోరాడే వారికి భరోసానిస్తోంది. ఆఖరకు భరణాన్నిప్పించి వారిని ఆర్థికంగా కాపాడుతోంది. అంతకుముందు దంపతులకు చేస్తున్న కౌన్సెలింగ్ వల్ల కూడా చాలా మంది మళ్లీ ఒకటవుతున్నారు. రాజీపడి సంసారం చేస్తున్నారు. ఇక్కడ రాజీ పడేది మహిళే సామాజిక కట్టుబాట్లు... సంప్రదాయాల ముసుగులో భర్త పెడుతున్న అరాచకాలను భరిస్తూ.. ఒక దశలో బయటకు వచ్చి ఈ చట్టాన్ని ఆశ్రయించినా.. కౌన్సెలింగ్ ద్వారా ఒక్కటైనా.. ఆమెకు వేధింపులు తప్పడంలేదు.

చట్టాన్ని వినియోగించుకోలేక..
గృహ హింస చట్టాన్ని కేవలం విద్యావంతులై మహిళలు మాత్రమే వినియోగించుకుంటన్నారనే విషయం బహిర్గతమైంది. గ్రామీణ ప్రాంత మహిళలు తమ భర్తల చేతిలో హింసకు గురవుతున్నా బయటకు రావడం లేదు. వారి గ్రామ స్థాయిలోనే వాటిని పరిష్కరించుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ‘రాజీ’ కాపురాలు చేస్తున్నారు. దీంతో పట్టణ పరిధి నుంచి గృహ హింస కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయితే విద్యావంతులైన భర్తలు భార్యలను అనుమానించడం, వరకట్నం కోసం వేధించడం, సూటిపోటి మాటలతో మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం లాంటి కేసులు కూడానమోదుకావడం గమనార్హం. జిల్లాకు చెందిన ఓ ఐపీఎస్ భార్య కూడా గృహహింసను ఆశ్రయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరి కేసు ఇంకా కోర్టులో కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఇటీవలే ఓ ఐఏఎస్ భార్య కూడా గృహహింస చట్టాన్ని ఆశ్రయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విద్యావంతులై ఉండి.. అదీ ఓ ఉన్నతస్థానంలో ఉన్న వారు కూడా భార్యలను వేధించడం సర్వసాధారణమేననే విషయం వెలుగుచూస్తోంది. అయితే వీరే కాకుండా చాలా మంది బాధితులు హింసను భరిస్తున్నా.. వెలుగులోకి రావడం లేదనేది బహిరంగ రహస్యం.

చట్టం.. లొసుగుల మయం..
ఈ చట్టంలోని లొసుగులు కూడా మహిళలకు పూర్తిగా రక్షణ నివ్వడం లేదని తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన ఆరు నెలల్లో కేసును పరిష్కరించి తీర్పు వెలువరించాల్సి ఉండగా ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ ఉండటంతో మహిళలు మరింత మానసిక వేదనకు లోనవుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 780 కేసులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. దీంతో భర్తలు బాగానే ఉంటున్నా.. భార్యలు మాత్రం తమ సంతానం తీర్పు కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో మొదట ఫిర్యాదు చేసిన బాధిత మహిళ ఇష్టవూపకారం భర్తను కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. కౌన్సెలింగ్ ద్వారా ఇద్దరిలో నెలకొన్న మనస్పర్థలు తొలగించడం.. వేధింపులకు పాల్పడటం వల్ల కుటుంబంపై పడే ప్రభావం, పిల్లల భవిష్యత్తు గురించి వివరించి వారిని కలిపే ప్రయత్నం చేస్తారు. అయినా వారిలో రాజీ కుదరకపోతే డొమొస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్టు (డీఐఆర్) నమోదు చేసి సంబంధిత కోర్డుకు సమర్పిస్తారు. డీవీ యాక్ట్‌కు సంబంధించి జిల్లాలో మొత్తం 14 కోర్టులున్నాయి. మేడ్చల్, రాజేంవూదనగర్, పరిగి, హయత్‌నగర్‌తో పాటు ఎల్బీనగర్ కోర్టు భవనాల సముదాయాల్లో మిగిలిన కోర్టులున్నాయి. ఈ కోర్టుల్లో కేసుల్లో కూడా కాంప్రమైజ్‌కే అధిక ప్రాధన్యతనిస్తారు. అదీ వీలుకాకపోతే భర్త జీతాన్ని బట్టి భరణం(మెయింటెనెన్స్)ను ఇప్పిస్తారు. ఒకవేళ సంతానం ఉంటే ఇన్‌టైమ్ ఆర్డర్ (కేసు ముగిసే వరకు పిల్లలు తల్లివద్దే ఉండేలా) ఇస్తారు. నివాసం ఉంటే ఇంటిలో భాగాన్ని కూడా భార్యకు వచ్చేలా చూస్తారు. కొన్నికేసులకు ప్రొటెక్షన్ ఆర్డర్ (పీవో)తోపాటు మెయింటెనెన్స్, రెసిడెన్స్ అవకాశం కల్పిస్తూ తీర్పునిస్తారు.

పట్టణాలే అధికం..
గృహ హింస కేసులు ఎక్కువగా నమోదవుతున్నది పట్టణాల నుంచేనని కేసులను బట్టి తెలుస్తోంది. జిల్లాలో బోరబండ, బాలానగర్, జీడిమెట్ల, మల్కాజిగిరి, మియాపూర్ లాంటి నగర ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. వికారాబాద్, పరిగి, చేవెళ్ల లాంటి చోట్ల కూడా కేసులు నమోదవుతున్నా.. తక్కువ శాతంలోనే ఎన్‌ఆర్‌ఐ కేసులు జిల్లాలో నమోదైనవి 14 ఉండటం గమనార్హం. వీటితో పాటు ఐసీడీఎస్‌కార్యాలయానికి నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులొస్తూనే ఉన్నాయి. అయితే పల్లెల్లో హింసే లేదని అనుకోవద్దు. అక్కడ నిరక్షరాస్యత అధికంగా ఉండటం.. చిన్నపాటి గొడవలు జరిగినా బయటకు చెప్పకపోవడం.. ఒక్కసారి బయట పడితే.. కుటుంబ పరువు బజారున పడుతుందనే భావన నెలకొని ఉండటం తదితర కారణాల వల్ల ఇవి వెలుగులోకి రావడమే లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. తమ రక్షణ కోసం ఈ చట్టమొకటి ఉన్నదనే విషయమే వారికి తెలియకపోవటం.

కలిపేందుకే ప్రాధాన్యం..
- ఇందిర, ఐసీడీఎస్ పీడీ

గృహహింస కేసుల్లో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ నిర్వహించి వారిని కలిపేందుకు ప్రాధన్యతనిస్తాం. డీఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా కోర్డులో ఇదే అంశానికి ప్రాధాన్యతనిస్తారు. అది వీలుకాకపోతేనే మిగతా రక్షణ చర్యలు చేపడతారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd