Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  General News
అప్పుల ఊబిలో అన్నదాత

రంగాడ్డి జిల్లా/ మేడ్చల్/ మంచాల ( టీ మీడియా): అన్నదాతకు ఆది నుంచి అన్నీ కష్టాలే. గత ఖరీఫ్‌లో కరువు కాటుకు గురైన రైతన్న ఇప్పటి వరకు కోలుకోలేదు. వరుసగా దెబ్బ మీద దెబ్బ పడటంతో నిండా అప్పుల పాలవుతున్నాడు. ప్రకృతి సహకరించక.. సర్కారు ఆపన్నహస్తాన్ని అందివ్వక.. ప్రాణాలు కోల్పోతున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి నెల గడుస్తోంది. ఇటీవలే కొద్దిపాటి వర్షాలు కురియడంతో దుక్కిదున్ని సాగుకు సమయాత్తమవుతున్నా.. విత్తనాలు అందక.. ఎరువుల ధరలు పెరిగి విలవిలాడుతున్నాడు. వేడినీళ్లకు చన్నీళ్లుగా ఇన్‌పుట్ సబ్సిడీ అయినా వస్తుందని భావించిన అన్నదాతకు నిరాశే మిగిలింది. ప్రజాపథంలో ప్రతీ చోట చెక్కులతో ఆశలు చూపి కనికట్టు చేసిన ప్రజావూపతినిధులు.. అవి వారికి చేరవేసే విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదు.

మొత్తం జిల్లాకు రూ. 61.93 కోట్లు విడుదల కాగా.. ఇప్పటి వరకు రైతుల ఖాతాలకు చేరింది మాత్రం రూ. 20 కోట్లే. సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ బ్యాంకర్లు తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఖాతాలు తెరిచే విషయంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు వ్యవసాయాధికారులు. కలెక్టర్ ఈ విషయంతో ఈ నెల 12 జరిగిన సమావేశంతో తీవ్రంగా మండిపడినా.. ఐదుగురు వ్యవసాయాధికారులకు చార్జిమెమోలు జారీ చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఖరీప్ పంట రుణాలు జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ.401 కోట్లు అవసరమని తేల్చగా.. అందులో ప్రభుత్వాన్నుంచి క్లియన్స్ దొరికింది మాత్రం రూ. 130 కోట్లకే. అయినా అవి చేతికందేదెప్పుడు..? అని రైతన్న తీవ్ర నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నాడు.

జిల్లాలో ఇదీ పరిస్థితి గతేడు ఖరీఫ్ పంట జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. సాధారణ ఖరీఫ్ విస్తీర్ణం 1,84,410 హెక్టార్లుండగా, గత యేడు ఖరీఫ్ విస్తీర్ణం 1,79,141 హెక్టార్ల మేర పండించారు. దాదాపు 4వేల హెక్టార్ల పై చిలుకు విస్తీర్ణం తగ్గింది. కరువు వల్ల నష్టపోయింది 1,25,135 హెక్టార్లు.. అంటే దాదాపు తొంభై శాతానికి పైగా పంటలు నష్టపోయాయి. పంట నష్టపోయిన 2,82,364 మంది రైతులకు గాను రూ. 61.93 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించింది. ఇప్పటి వరకు వ్యవసాయాధికారులు ట్రెజరీ నుంచి రూ.42.58 కోట్లు డ్రా చేశారు. ఈ మొత్తం ద్వారా 1,93,354 మంది రైతులకు పరిహారాన్ని అందించాలి. వీటి నుంచి బ్యాంకులకు అందించింది ఇప్పటి వరకు రూ. 34 కోట్లు. అయితే బ్యాంకులు రైతుల ఖాతాలో జమ చేసింది మాత్రం రూ. 20 కోట్లు. దాదాపు ఇంకా లక్ష మందికి పైగా పరిహారం అందాల్సి ఉండగా.. అర్హులైన రైతుల్లో 30శాతం మేర ఖాతాలే తెరవక పోవడం గమనార్హం. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, మర్పల్లిలో అత్యధికంగా ఖాతాలు తెరవలేదు. సాంకేతికలోపాలు కారణాలుగా బ్యాంకర్లు చెబుతున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసుకునేందుకు ఇటు ఇన్‌పుట్ సబ్సిడీ అందక.. అటు పంటరుణాలు ఇవ్వక రైతన్న నిండా అప్పులపాలవుతున్నాడు. బయట అప్పులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు. మరోపక్క సరిపడా విత్తనాలు అందక, ఎరువుల ధరలు పెరిగిపోయి రైతాంగానికి మరింత భారాన్ని పెంచింది. దీనికి తోడు వరుణుడు మురిపించి.. తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో రైతులకు ఈసారి ఖరీఫ్ సాగు కూడా కడగండ్లనే మిగల్చనున్నట్లు తెలుస్తోంది.

అన్నదాతకేదీ ఆసరా..?
మంచాల (టీ మీడియా): మండలంలోని పలుక్షిగామాల్లో తొలకరి వర్షాలకు రైతులు దుక్కులు దున్ని సాగుకు సన్నద్ధమయ్యారు. ఖరీఫ్ సాగు కోసం విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులకు రుణాలు సకాలంలో ఇప్పిస్తామని ప్రభుత్వం ఒక పక్క గొప్పలు చెబుతున్నా కొందరికి మాత్రమే రుణాలు అందటంతో మరికొందరు రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమై మూడు వారాలు గడుస్తోంది. దుక్కులు దున్ని విత్తనాల కోసం వ్యాపారుల వద్దకు, బ్యాంకుల్లో రుణాల కోసం పైరవీకారుల వద్దకు రైతులు తిరుగుతున్నారు. తొలకరి వర్షాలు కురవటంతో కొంత మంది రైతులు అప్పుసప్పు చేసి విత్తనాలు, ఎరువులు, ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేసి విత్తుతున్నారు. ఖరీఫ్‌కు ముందే రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచకపోవటంతో ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో ఎమ్మార్పీ ధరలకంటే అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. మండలంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రభుత్వం ఆముదం, జొన్న, కందులు, పెసర్లు తక్కువగా పంపిణీ చేయటంతో రెండు రోజులకే విత్తనాలు అయిపోవటంతో విత్తనాల కోసం రైతులు ఎదురుచూడక తప్పలేదు. రబీలో రైతులు సాగుచేసిన పంట మొత్తం నష్టపోవటంతో రైతులకు నష్టపరిహారాన్ని అందజేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది కానీ నేటికి ఒక్కపైసా కూడా రైతులకు నష్టపరిహారం రాకపోవటంతో ఖరీఫ్‌కు మళ్ళీ అప్పు చేయవల్సిన పరిస్థితి ఏర్పడింది.
పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందజేయనున్నట్లు చెప్పి మూడు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క రైతుకు కూడా పైసా పరిహారం అందలేదు. పరిహారం వస్తే దానితో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేద్దామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. మంచాల మండలంలోని 18 గ్రామపంచాయతీల్లో రైతులు రబీ సాగుచేసుకున్న పంటలు పూర్తిగా చేతికి రాకుండానే నష్టపోయారు. ప్రభుత్వం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంటనష్టం అంచనాను ఉన్నతస్థాయి అధికారులకు నివేదిక అందించినా నేటికి ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం రాలేదు.

చెల్లని చెక్కులే..
మేడ్చల్ (టీ మీడియా): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపథం కార్యక్షికమంలో రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు పంటనష్ట పరిహారం అందించనుందని, నిధులు మంజూరయ్యాయని చెప్పడంతో రైతుల్లో ఆనందం వెల్లుబికింది. ప్రతీ గ్రామంలో పంటనష్ట పరిహారం అందిస్తున్నామంటూ చెక్కులు (నకలు) పంపిణీ చేసి రైతులకు ఆశలు కల్పించిన ప్రజావూపతినిధులు, అధికారులు నేటికీ ఆ నష్ట పరిహారం అందించలేక పోయారు. నేటికి ఆ పంట నష్టపరిహారం అందకపోవడంతో రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. మండలంలో మొత్తం 1850 రైతులకు చెందిన పంటలు నష్టపోయాయని వరికి హెక్టారుకు రూ.5 వేలు, మొక్క జొన్నకు రూ.6 వేల చొప్పున చెల్లించేందుకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించడంతో రూ.44.42 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు మంజూరయ్యాయని చెప్పిన అధికారులు బ్యాంకు అకౌంట్‌లు ప్రారంభించిన రైతులకు నేటికి నష్టపరిహారం అందించలేక పోయారు. ప్రతి రోజు రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి అకౌంట్‌లలో డబ్బులు జమ అయ్యాయ అని కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఖరీప్ పంట నష్టపోయిన రైతులు నేడు నష్టల బాటలో నడుస్తుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని వాపోతున్నాడు. ప్రజావూపథం నిర్వహించిన ప్రతీ గ్రామంలో పంటనష్టపరిహారం పేరుతో చెక్కులు పంపిణీ చేసినా రైతులకు నేటికి నష్టపరిహరం అందలేదు.

నేడు మండల కేంద్రంలో ఇదే అంశంపై రైతులు, రైతు సంఘాల నాయకులు ధర్నా చేపట్టనున్నారు.
వ్యవసాయ, బ్యాంకర్లతో నేడు కలెక్టర్ వి. శేషాద్రి ఖరీఫ్ పంటరుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఇదే నెల 12న జరిగిన సమీక్షలో కలెక్టర్ వ్యవసాయాధికారుల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగి నేటితో పదహారు రోజులు గడుస్తున్నా.. పెద్దగా ఫలితం లేకుండా పోయింది. నెలాఖరులోగా ఖరీఫ్ పంటరుణాలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. అదీ జరగలేదు.

జాడే లేని జీరో ఆకౌంట్..
డబ్బులు లేకుండా ఏ బ్యాంకులోనూ రైతులు అకౌంట్‌లు తెరుచుకోలేక పోయారని తెలిసింది. పంట నష్టపరిహారం పొందాల్సిన రైతులు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు అకౌంట్‌లు ప్రారంభించాలని అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఎంత తిరిగినా ఏ బ్యాంకు వారు కూడా అకౌంట్‌లు తెరువలేదని తెలిసింది. జీరో బ్యాలన్స్ అకౌంట్‌లు తెరువాలంటూ తమకు ఆదేశాలు రాలేదని చెప్పడంతో రైతులు ఏమి చేయలేక డబ్బులు చెల్లించి అకౌంట్‌లు తెరువాల్సి వచ్చింది.
83శాతం మంది రైతులకు అకౌంట్‌లు అందించాం శైలజ. వ్యవసాయాధికారి, మేడ్చల్
ఇప్పటికి 83 శాతం మంది రైతుల అకౌంట్‌లు ప్రారంభించి నివేదిక జిల్లా అధికారులకు పంపించాం. అకౌంట్‌లు కొత్తగా ప్రారంభించాల్సి రావడంతో కొంత ఆలస్యం, ఇబ్బంది ఏర్పండింది. కొన్ని బ్యాంకుల్లో అకౌంట్‌లు తెరిచిన రైతులకు నష్టపరిహారం అందాయి. మిగతా రైతులకు కూడా అందుతున్నాయి. త్వరలో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తాం.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd