బదిలీల గడబిడ...
ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు విద్యాశాఖ జారీచేసిన మార్గదర్శకాలపై దుమారం రేగుతోంది. ఎక్కువ మంది టీచర్లకు బదిలీల అర్హత లేకుండా మార్గదర్శకాలను లోపభూయిష్టంగా రూపొందించారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. వాటిని మార్చాలంటూ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఉపాధ్యాయుల నుంచి ఇంతగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సర్కార్ మాత్రం వెనక్కితగ్గేది లేదని చెబుతోంది. బదిలీల మార్గదర్శకాల సవరింపునకు ససేమిరా అంటోంది. దీంతో కౌన్సెలింగ్‌కు ముందే బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. అయితే, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల డిమాండ్లను, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయిలో అర్హులైన టీచర్ల బదిలీలకు అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ స్తున్నాయి.
(టీ మీడియా ప్రతినిధి, రంగాడ్డిజిల్లా): కౌన్సెలింగ్‌కు ముందే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. విద్యాశాఖ జారీచేసిన బదిలీల మార్గదర్శకాలు వివాదాస్పదమవడమే ఇందుకు కారణం. ఎక్కువ మంది టీచర్లకు బదిలీల అర్హత లేకుండా మార్గదర్శకాలను లోపబూయిష్టంగా రూపొందించారనేది ప్రధాన ఆరోపణ. బదిలీల మార్గదర్శకాల్లో లోసుగులను అన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల డిమాండ్లను, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పూర్తిస్థాయిలో అర్హులైన టీచర్ల బదిలీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈమేరకు మార్గదర్శకాలను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాయి.
అయితే ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా, ప్రభుత్వం మాత్రం బదిలీల మార్గదర్శకాల సవరింపుకు ససేమిరా అంటోంది. దీంతో బదిలీలకు అర్హతను కోల్పోతామని చాలామంది సీనియర్ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ జాబితాలో గత జనవరిలో ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా మంజూరైన పోస్టుల్లోకి తాత్కాలిక ప్రాతిపదికన పోస్టింగ్ పొందిన టీచర్లతో పాటు నియమిత సర్వీసు కాలం కన్నా ముందే ఉన్నత పాఠశాలల్లో నుంచి అర్థాంతరంగా బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్లు ఉన్నారు. మరోవైపు ఇటీవల కాలంలో పదోన్నతి పొందిన టీచర్లకు, నెలవారీ ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు తాత్కలిక పద్ధతిన పోస్టింగ్ ఇవ్వకపోవడం కూడా తాజా బదిలీల్లో సీనియార్టీ ఉన్న టీచర్లు నష్టపోయే పరిస్థితి తలెత్తింది.
దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నా, టీచర్ల బదిలీల మార్గదర్శకాల సవరింపుకు విద్యాశాఖ సానుకూలంగా స్పందించే దాఖలాలైతే కనిపించడంలేదు. దాంతో నిర్ణీత షెడ్యూల్ మేరకు టీచర్ల బదిలీల ప్రక్రియ మందుకు జరిగే అవకాశాలున్నాయి. ఆ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో వివిధ కేటగిరిల్లో 1650 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. అయితే, బదిలీల కౌన్సెలింగ్‌కు వచ్చేసరికి నియామకాల మార్గదర్శకాలను అనుసరించి నగరానికి సమీపంలో ఉన్న కేటగిరి 1, 2 స్కూల్ పోస్టులను బ్లాక్ చేసే అవకాశం లేకపోలేదు. అన్ని కేటగిరిల్లో కలిపి ఇలాంటి పోస్టుల సంఖ్య అధికంగానే ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంచనాకు వస్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తే గనుక తాజా బదిలీల్లో జిల్లావ్యాప్తంగా 500లోపే టీచర్లకు మాత్రమే స్థానచలనం కలిగే అవకాశం ఉంటుందని ఓ ఉపాధ్యాయ సంఘానికి చెందిన కీలక నేత ‘టీ మీడియా’తో స్పష్టం చేయడం గమనార్హం. బదిలీ అయ్యే వారిలో అత్యధికంగా ఒకేచోట ఎనిమిదేళ్ల సర్వీసును పూర్తిచేసుకున్న వారే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండేళ్ల సర్వీసును దాటిన టీచర్లు కూడా దరఖాస్తు చేసుకునే వీలున్నా, తమకు అనుకూలత ఉన్న పోస్టుల్లోకి వచ్చే ఛాన్స్ దొరికితేనే వారు బదిలీలకు ఆసక్తి చూపించే పరిస్థితి ఉంటుంది.
బదిలీల్లో నష్టపోతున్నది వీరే...
బదిలీల మార్గదర్శకాల్లో లోపాల వల్ల తాజా బదిలీల్లో ప్రధానంగా మూడు కేటగిరిల్లోని టీచర్లు నష్టపోతున్నారు. పోస్టుల్లోకి జనవరిలో ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టుల్లోకి పదోన్నతులు పొందిన జూనియర్ టీచర్లకు నగరానికి సమీపంలో ఖాళీగాఉన్న కేటగిరి 2, 3 కేటగిరిల స్కూల్ పోస్టుల్లో నియమించారు. వాస్తవానికి వీరికి ఆయా పోస్టుల్లో తాత్కలిక ప్రాతిపదికన పోస్టింగ్ ఇచ్చిఉన్నట్టయితే, తాజా బదిలీల్లో వాటిని ఖాళీగా చూపించే అవకాశం ఉండేది. కానీ విద్యాశాఖ అధికారులు ఆ మేరకు అప్పట్లో చర్యలు తీసుకోలేదు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులు కేటగిరి 1, 2 పరిధిలోని పోస్టులను నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టుల్లోకి గత జనవరిలో తాత్కలిక ప్రాతిపదికన బదిలీ అయిన ఉపాధ్యాయులు కూడా ఆయా పోస్టులను యథాతథంగా ఖాళీలుగా చూపించాలని కోరుతున్నారు.
అలాగే, నియమిత కాలం కంటే ముందుగానే క్రమబద్ధీకరణలో తమను బదిలీ చేసిన స్కూళ్లకు జనవరి 1 తర్వాత మళ్లీ అవే పోస్టులను మంజూరు చేయడంతో ఫిజికల్ టీచర్లు ఆ మేరకు పాత స్కూళ్లలోని సర్వీసును నష్టపోనున్నారు. దీంతో పాత సర్వీసుకు అవకాశం కల్పిస్తూ నష్టపోయిన కాలానికి ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లను ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలా చేసినట్లయితే తాజా బదిలీల్లో వారికి సీనియారిటి పరంగా ప్రయోజనం చేకూరుతుంది. అయితే, సాధారణ బదిలీల మార్గదర్శకాల్లో సర్వీసును నష్టపోతున్న పైన పేర్కొన్న రెండు కేటగిరీల ఉపాధ్యాయుల డిమాండ్లను పట్టించుకున్న దాఖాలాల్లేవు. ఇక గెజిటెడ్ హెడ్‌మాస్టర్లుగా పదోన్నతి పొంది ఇతర జిల్లాలో పనిచేస్తున్న వారిని సొంత జిల్లాలకు పంపాల్సి ఉన్నా, ఆమేరకు మార్గదర్శకాలు వెలువడలేదు.
ఉమ్మడి సర్వీసు నిబంధనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను జిల్లా, మండల పరిషత్ పాఠశాలలకు, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలలకు బదిలీకి అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీన్ని కూడా తాజా బదిలీల మార్గదర్శకాల్లో ప్రస్తావించలేదు. ఇలా వివిధ అంశాల్లో మార్గదర్శకాల్లో లొసుగులు ఉండటంతో అర్హులైన వెయ్యిమంది సీనియర్ ఉపాధ్యాయులు బదిలీలకు అవకాశం లేకుండాపోతోందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీ మాణిక్‌డ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయ వర్గాల్లో టెన్షన్..!
తమకు నష్టం కలుగకుండా మార్గదర్శకాలను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నా, ఇప్పటివరకు సానుకూల స్పందన రాలేదు. ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు నిర్వహించడానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు మొదటినుంచి విముఖంగా ఉన్నారని, అందుకే బదిలీల సంఖ్యను బాగా కుదించే ఉద్ధేశంతోనే లోపబూయిష్టమైన మార్గదర్శకాలను జారీచేశారని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. అయితే బదిలీల మార్గదర్శకాల సవరింపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఉపాధ్యాయవర్గాల్లో టెన్షన్ అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు నిర్ణీత షెడ్యూల్ మేరకు విద్యాశాఖ అధికారులు బదిలీలకు ప్రక్రియను ప్రారంభించడం, మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు బదిలీల మార్గదర్శకాలను సవరించాలని ఆందోళన బాట పట్టనున్నాయి. ఇప్పటికే యూటీఎఫ్ దీనిపై ఆందోళన చేపట్టగా, సోమవారం టీయూటీఎఫ్ ఆందోళనకు సమాయాత్తమవుతోంది. మరోవైపు ఈ నెల 26న ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జాక్టో) జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది.
ఇంతజరుగుతున్నా షెడ్యూల్ మేరకే టీచర్ల బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో బదిలీల మార్గదర్శకాలను సవరించేందుకు విద్యాశాఖ సిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఒకవేళ అడహక్ పోస్టింగ్‌ల అంశంలో మార్గదర్శకాలను సవరిస్తే ఆ కేటగిరిలో తాజా బదిలీల్లో లబ్ధి పొందే టీచర్లు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో మొత్తం బదిలీల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని బదిలీ మార్గదర్శకాలను యథాతథంగా అమలుపర్చాలని విద్యాశాఖ పట్టుదలగా ఉన్నట్లు తెలిసింది. కాగా శనివారం బదిలీల మార్గదర్శకాలపై వస్తున్న విమర్శలపై విద్యాశాఖ మంత్రి పార్థసారధి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డైరెక్టర్ శివశంకర్‌లతో చర్చించారు. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలను సవరించే అవకాశం లేకపోలేదనే ప్రచారం ఉపాధ్యాయ వర్గాల్లో ఊపందుకుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై బదిలీల రేసులో ఉన్న ఉపాధ్యాయులకు టెన్షన్ పట్టుకుంది.
Other News