అక్రమ తవ్వకాలు
-మైనింగ్ అధికారుల దాడులు
-అనుమతి లేకుండా నాపరాతిని తరలిస్తున్న లారీల సీజ్
-గనుల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్న వారిపై కేసు
బషీరాబాద్, జూన్ 13 (టీ మీడియా): ఎలాంటి అనుమతులు లేకుండా గనుల్లో తవ్వకాలు జరుపుతూ అక్రమంగా నాపరాతిని తరలిస్తున్న వారిపై తాండూరు మైనింగ్ శాఖాధికారులు బుధవారం దాడులు జరిపారు. మండల పరిధిలోని కొర్విచేడ్, క్యాద్గిరా గ్రామాల్లోని నాపరాతి గనుల్లో కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతుండటంతో వారి వివరాలను స్థానిక తహసీల్దార్ మైనింగ్ అధికారులకు అందించారు. దీంతో వారు దాడులు జరిపారు. క్యాద్గిరాలో అనుమతులు లేకుండా నాపరాతిని తరలిస్తున్న రెండు లారీలను సీజ్ చేసి బషీరాబాద్ పోలీసులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు లీజు పేరుతో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే రెవెన్యూ, మైనింగ్ శాఖకు చెందిన సర్వేయర్లతో సర్వే చేయించి లీజుకు తీసుకున్న వారి నాపరాతి గనుల్లో హద్దురాళ్లను పాతిస్తామన్నారు. కొర్విచేడ్‌లోని నాపరాతి గనుల్లో 19 మంది అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి రావడంతో దాడులు చేశామన్నారు. 19 మందిలో ఒకరు పట్టుబడ్డారని అన్నారు. దాడులు నిర్వహించిన అధికారులు గనుల్లో ఉన్న కటింగ్ మిషన్లను తీసుకెళ్లారు. త్వరలో కొర్విచేడ్‌లోని నాపరాతి గనుల్లో హద్దులు నిర్ణయిస్తామన్నారు.
Other News