అడ్డుకునేందుకు సిద్ధమైన తెలంగాణ వాదులు
నిజామాబాద్, టీమీడియా : నేడు సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతుగా దీక్ష చేపట్టేందుకు వస్తున్న వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అడ్డుకునేందుకు తెలంగాణ ఉద్యమకారులు సిద్ధమయ్యారు. జిల్లాలోని టీఆర్‌ఎస్, జేఏసీ, ఉద్యమ సంఘాలు, పలు విద్యార్థి సంఘాల నాయకులు విజయమ్మ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా ఈ గడ్డ మీద అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ద్రోహి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసి తమ నైజాన్ని ఆ పార్టీ ప్రకటించిందని సమైక్యాంధ్రకు మద్దతిస్తున్న ఆ పార్టీ నాయకురాలు తెలంగాణ గడ్డపైకి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలోని అన్ని మండలాల నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిరిసిల్లకు తరలివెళ్లారు. మారు వేశాల్లో పోలీసుల కళ్లలో పడకుండా వారు ఈ పాటికే సిరిసిల్లకు చేరుకున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణ జాగృతి, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు సిరిసిల్లకు చేరుకున్నారు. ఆందోళన కారులు విజయమ్మను నిజామాబాద్ బార్డర్ నుంచే అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. బస్వాపూర్ నుంచి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నట్లుగా వినికిడి. కామారెడ్డి ప్రాంతంలో ఉద్యమ ఉధృతి తీవ్రంగా ఉండడంతో అడుగడుగునా విజయమ్మ కాన్వాయ్‌ను అడ్డుకోనున్నారు. భారీ పోలీసు బలగాలను మోహరించినప్పటికీ ఆందోళన కారులు పకడ్బందీ వ్యూహరచనలో ఉన్నట్లు తెలిసింది. విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశించిన దరిమిలా మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కదులుతున్నారు. మహబూబాబాద్‌లో వైఎస్ జగన్‌కు ఎదురైన పరాభావం ఇప్పడు కూడా ఎదురుకాక తప్పదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే వీసాతో రావాల్సి ఉంటుందని నాడు వైఎస్ అన్నారని ఇప్పడు విజయమ్మ ఏ వీసాతో వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె చేపడుతున్న దీక్షపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు.
Other News