Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
దర్జాగా దగా.. నిద్రిస్తున్న నిఘా..!

కలెక్టరేట్, టీ మీడియా :రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నా ఆచరణ సాధ్యం కావడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పౌరసరఫరా వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు జీపీఎస్ (గ్లోబల్ ప్రాసెసింగ్ సిస్టమ్)ను ప్రయోగాత్మకంగా నల్గొండ, కృష్ణ, నెల్లూరు, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి ద్వారా రేషన్ సరుకుల లారీ ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి బయల్దేరి చౌకధరల దుకాణానికి చేరేవరకు రికార్డవుతుంది. ఇందుకు సంబంధించిన డివైస్ సెట్‌లు జిల్లాకు వచ్చాయి. బర్‌వూటానిక్స్ ఇండియా లిమిటెడ్ తయారు చేసిన ఈ డివైస్‌లను ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బిగించారు.

తొలినాళ్లలో సరుకుల లోడ్‌తో బయల్దేరే లారీల్లో వీటిని అమర్చుతూ పర్యవేక్షణ కొనసాగింది. తర్వాత సాంకేతిక కారణాలతో సక్రమంగా పనిచేయడం లేదు. డివైస్ సిస్టం-1లో పౌరసరఫరా గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్ల వరకు, స్టేజీ- 2లో ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపుల వరకు రేషన్ సరఫరాను సక్రమంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 20 ఎంఎల్‌ఎస్ పాయింట్‌లతో పాటు సరుకులు తీసుకెళ్లే లారీలలో పరికరాలను ఏర్పాటు చేశారు. పౌరసరఫరాలలో బియ్యం ట్రాన్స్‌పోర్టు జరుగుతున్న సమయంలో ఆన్‌లైన్ ద్వారా పక్కదారి పట్టకుండా కంప్యూటర్‌లో సిగ్నల్స్ ఆధారంగా కనిపెట్టవచ్చు. సిస్టం అమలుతో రేషన్ బియ్యం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తినా అది ఎంతో కాలం నిలవలేక పోయింది. అక్రమార్కులు యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటవేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నా కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతున్నాయి.

ఆగని అక్రమాలు.. ఈ ఏడాది 30 కేసులు
ఈ ఏడాది మొదలుకొని పౌరసరఫరా శాఖ అధికారులు రేషన్ షాపులపై దాడులు నిర్వహించి 30 కేసులు నమోదు చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 333.88 క్వింటాళ్ల బియ్యం, చక్కెర 14.17 క్వింటాళ్లు, పామోలిన్ 1789 ప్యాకెట్లు, కిరోసిన్ 2,194 లీటర్లు, కందిపప్పు 0.71 క్వింటాళ్ళు పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో నెలకు 10వేల 389 క్వింటాళ్ళ బియ్యం కోటా పౌరసరఫరాకు మంజూరు అవుతుంది. కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని అధికారుల కళ్లు గప్పి పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. జీపీఎస్ సిస్టం పరికరాల్లో సాంకేతిక లోపాలు తలెత్తి నిరుపయోగంగా మారాయి. జిల్లా ఉన్నతాధికారులు జీపీఎస్ సిస్టం లు వినియోగంలోకి తెస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రచార లోపంలో ‘ఎస్‌ఎంఎస్’
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్‌ఎంఎస్ విధానం ఆదిలోనే అభాసుపాలైనట్లయింది. ఈ విధానంలో ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి ఎన్ని క్వింటాళ్ల బియ్యం సరఫరా అయింది. రేషన్ డీలర్లకు ఎన్ని క్వింటాళ్లు చేరాయి. అనే అంశాలను సంబంధిత తహశీల్దార్లకు ఎస్‌ఎంఎస్ చేస్తారు. షాపులకు చేరిన సరుకులు ఏమేరకు పంపిణీ చేశారనే విషయాన్ని ముందుగా డీలర్ సూచించిన లబ్ధిదారులు నిర్ణీత నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. ఈ విధానం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఎవరూ ఎస్‌ఎంఎస్‌లు పంపడం లేదని సమాచారం. దీంతో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. నిరుపేదలకు అందాల్సిన చౌక బియ్యం సరిహద్దులు దాటుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి రేషన్ అక్రమాలకు కళ్లెం వేయని పక్షంలో లక్ష్యం నీరుగారే అవకాశముంది.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd