బత్తాయి బీమా..రైతుకేదీ ధీమా!
పచారం లేదు.. పరిహారమూ రాదు
-వేలల్లో రైతులుంటే ప్రీమియం కడుతోంది వందల్లోనే..!
-బీమా కంపెనీదారులకే లబ్ధి
-వర్తించే మండలాలకు చెల్లింపుల్లో మొండిచేయి
- వేరుకుళ్లును చేర్చాలంటున్న రైతులు
టీమీడియా ప్రతినిధి, నల్లగొండ:వాతావరణ బీమా.. బత్తాయి రైతుకు ధీమా ఇవ్వడం లేదు.. ప్రచారం లేదు.. పరిహారం రాదు.. ప్రీమియం చెల్లింపులో అసలు అన్నదాతకు అవగాహన కల్పించే నాథుడే లేడు. వేలాది మంది రైతులుంటే.. ఒక్క వంతు కూడా బీమా చేయడం లేదు.. చేసిన వారికి తిరిగి చెల్లింపులూ అంతంత మాత్రమే.. జాబితాలోని మండలాలకు సక్రమంగా వర్తించకపోగా.. అసలు లబ్ది ఇన్సూరెన్స్ కంపెనీలకే దక్కుతోంది. వాతావరణ బీమా వర్షం హెచ్చుతగ్గులు.. ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఆధారంగా పరిగణలోకి తీసుకోవడంతో రైతుకు పెద్దగా ఒరిగేదేం లేకుండా పోతోంది.. మంగు, వేరుకుళ్లుతో బత్తాయి చెట్లు చనిపోతుండగా.. వీటిని పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది.
జిల్లాలో 40వేల మంది రైతులు సుమారు 3లక్షల ఎకరాల్లో బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, మంగు, వేరుకుళ్లుతో చెట్లు చనిపోయి రైతుకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో రైతుల పోరాట ఫలితంగా ప్రభుత్వం 2010 నుంచి ప్రయోగాత్మకంగా జిల్లాలో వాతావరణ బీమాను అమలు చేస్తోంది. దిగుబడితో సంబంధం లేకుండా అల్ప, అధిక వర్షపాతం.. అధిక, అల్ప ఉష్ణోక్షిగత.. గాలిలో తేమ ఆధారంగా బీమా పథకాన్ని జిల్లాలోని 26మండలాలకు వర్తింపజేస్తూ వ్యవసాయ బీమా సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. అనుముల, చండూరు, చింతపల్లి, చిట్యాల, చౌటుప్పల్, దేవరకొండ, గుర్రంపోడు, కట్టంగూరు, కేతేపల్లి, మర్రిగూడ, మునుగోడు, కనగల్, నకిరేకల్, నల్లగొండ, నాంపల్లి, నారాయణపురం, నార్కట్‌పల్లి, నిడమనూరు, పెద్దఅడిశర్లపల్లి, పెద్దవూర, రామన్నపేట, శాలిగౌరారం, తిప్పర్తి, త్రిపురారం, వలిగొండ, వేములపల్లి మండలాలు బీమా పరిధిలో ఉన్నాయి. వాస్తవానికి జిల్లాలో సుమారు 35 మండలాల్లో బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు. అన్ని మండలాలకూ బీమా వర్తించకపోవడంతో బత్తాయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
బీమా ప్రీమియంలో 50శాతం రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా.. రైతు వాటా కింద ఎకరాకు రూ.792 చెల్లించాలి. 2010-11లో 311మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించగా.. 21మందికి చెందిన 64ఎకరాలకు మాత్రమే బీమా పరిహారం మంజూరైంది. ఇందుకు సంబంధించి రూ.3.27లక్షలు వచ్చింది. 2011-2012కు సంబంధించి 35మంది రైతులకు 143ఎకరాలకు బీమా ప్రీమియం చెల్లించినట్లు ఉద్యానవన శాఖ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి బ్యాంకర్లు రుణాలు తీసుకునే రైతులకు తెలియకుండానే బీమా ప్రీమియం చెల్లించి.. కోత పెడుతున్నారు. దీంతో బక్కచిక్కిన రైతులకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. పైగా రైతుకు భారంగా మారింది. అసలు బీమా ఉందనే విషయంపై చాలామందికి అవగాహనే లేదు. క్షేత్ర స్థాయిలో ప్రచారం పూర్తిగా కరువైంది. కాగా, ఉద్యానవన శాఖ సిబ్బంది కొరతను సాకుగా చూపుతోంది. 2011-12కు సంబంధించిన పరిహారం ఇంకా రాలేదు. ఈ నెల చివరలో వచ్చే అవకాశాలున్నాయి. రైతుకు బీమా పరిహారం రైతులకు లబ్ది చేకూరుతుందని పెడితే.. అడుగడుగునా పరిహాసం చేస్తోంది. కొందరు రైతులు ప్రీమియం చెల్లించినా.. అనుకూలంగా లేని బీమా నిబంధనలు, అధికారుల నిర్లక్ష్యంతో న్యాయం జరగడం లేదు.
మరోవైపు.. విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఏర్పాటుచేసిన ఆటోమెటిక్ మీటర్ల ద్వారా వాతావరణ పరిస్థితి తెలుసుకుని బీమా పరిహారం చెల్లిస్తున్నారు. మండలంలో ఒక చోట వర్షం కురిస్తే.. మరో చోట కురవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సబ్ స్టేషనులోని మీటర్లను ప్రామాణికంగా తీసుకోవడంతో రైతుకు అన్యాయం జరుగుతోంది. మండలం, సబ్ స్టేషన్ యూనిట్‌గా కాకుండా.. గ్రామం యూనిట్‌గా తీసుకుంటే రైతుకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే జిల్లాలోని మిగతా మండలాలన్నింటికీ బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి. వాస్తవానికి వాతావరణ పరిస్థితులకు సంబంధం లేకుండా రైతు పరిస్థితి ఆధారంగా బీమా చెల్లించాల్సిన అవసరముంది. బత్తాయి ఎక్కువగా మంగు, వేరుకుళ్లు, నీటి ఎద్దడితో దెబ్బతింటోంది. మంగు సోకి కాయ నాణ్యత కోల్పోవడంతో ధర 10శాతం కూడా రావడం లేదు. దీంతో నాలుగేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా 25-30వేల ఎకరాల్లో మంగు, వేరుకుళ్లు వచ్చి చెట్లు నాశనమవుతున్నాయి. వీటిని బీమాలోకి చేర్చితేనే రైతుకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం, భీమా కంపెనీలు మాత్రం వర్షాలు, ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఆధారంగా బీమా చెల్లింపు పరిగణలోకి తీసుకుంటున్నారు. బీమా ప్రీమియం చెల్లింపులు, క్లెయిమ్ వివరాలకు సంబంధించి కూడా అధికారులకు పూర్తిగా సమాచారం ఉండడం లేదు. బీమా కంపెనీలపైనే ఆధారపడుతున్నారు. వర్షం లేక చనిపోయిన చెట్లకు బీమా వర్తించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Other News