Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>> Nalgonda >>  General News
ప్రభుత్వ పాఠ్య పుస్తకాల బ్లాక్ దందా

ఏళ్లుగా సాగుతున్నా..
పట్టించుకోని అధికారులు
నల్లగొండలో ఐదుగురు
వ్యాపారులదే హవా
ప్రభుత్వ ముద్రణాలయం,
విజయవాడ నుంచి
అక్రమంగా సరఫరా
అధిక ధరలకు విక్రయి
స్తున్న ప్రైవేటు పాఠశాలలు
పేద విద్యార్థులకు ఇప్పటికీ
అందని పుస్తకాలు


(టీమీడియా ప్రతినిధి, నల్లగొండ) :మందు మాఫియా... ఇసుక మాఫియా.. ఇప్పుడు పుస్తక మాఫియా... ప్రతిదీ పక్కదారి... ఈజీగా డబ్బు సంపాదన. రాజకీయనాయకుల అండ...అధికారుల సహకారం.. అందరూ కలిసి ప్రభుత్వ సొమ్మును ఫలహారంగా పంచుకుంటున్నారు. పేదోడికి దక్కాల్సిన ప్రతి వస్తువు, పథకాలను పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను నల్లబజారుకు తరలించి అధిక ధరలతో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందాలో ఐదుగురు వ్యాపారులు తమ హవాను కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా సాగే దందా బహిరంగ రహస్యమైనా.. ఎవరూ పట్టించుకోవటం లేదు.. ఉన్నత స్థాయి అండ.. స్థానిక అధికారుల సహకారంలో పుస్తక దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ప్రైవేటు స్కూళ్లు, దుకాణాల వారు కుమ్మక్కై.. అధిక ధరలతో విద్యార్థులను దోచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రం పుస్తకాలందక అవస్థలు పడుతున్నారు.

జిల్లాలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాల దందా పెద్ద ఎత్తున సాగుతోంది. జిల్లా కేంద్రంలో ఐదుగురు వ్యాపారులు సిండికేటై గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల అక్రమ వ్యాపారం చేస్తున్నారు. నల్లగొండలో బూరుగు మల్లయ్య వద్ద రూ.లక్ష విలువ చేసే పాఠ్య పుస్తకాలు విద్యాశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈయన వద్దకు ఒక లోడు పుస్తకాలు రాగా.. మిగతా నిల్వలు ఎక్కడా దాచారో ఇంకా చిక్క అధికారులు దాడులకు వస్తున్నారని ముందుగానే తెలిసి సదరు వ్యాపారి.. పరారైనట్లు తెలిసింది. సదరు వ్యాపారిపై రెండేళ్ల క్రితం అక్రమపుస్తకాల విక్రయం కేసు నమోదైంది. ఏళ్లుగా దందా నడుస్తున్నా.. పోలీసులు, విద్యాశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవటం అనుమానాలకు తావిస్తోంది. మరో నలుగురు వ్యాపారుల వద్ద భారీగా పాఠ్య పుస్తకాల అక్రమ నిల్వలున్నట్లు సమాచారం.

జిల్లా కేంద్రంలోని మూడు దుకాణాల్లో ప్రభుత్వ పాఠ్య పుస్తకాల దందా జోరుగా సాగుతోంది. అయిదుగురు వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి.. ప్రైవేటు పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. వీరి మధ్య విభేదాలు రావటంతోనే.. ఇందులోని వారే పాఠ్య పుస్తకాల అక్రమ బాగోతం బయటకు లీక్ చేసినట్లు సమాచారం. అయిదుగురు వ్యాపారుల్లో నుంచి మరొకరు పుస్తక దుకాణాల సంఘానికి నాయకుడిగా కావాలని ప్రయత్నిస్తున్నారు. సదరు వ్యాపారి రూ.3-4లక్షల విలువైన పుస్తకాలను సూర్యాపేటకు ఒకే రోజు తరలించటం గమనార్హం. దొంగ పుస్తకాలు విక్రయిస్తే దుకాణం సీజ్ చేయాలి. విద్యాశాఖ, పోలీసులతో సత్సంబంధాల వల్లనే ఎక్కడా దాడులు, కేసులు నమోదు చేయటం లేదని తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కోసం డీడీ కడితే.. కొంత మార్జిన్ ఇచ్చి సరఫరా చేస్తారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరల ప్రకారం విక్రయించేందుకు వీలుంది.

జిల్లా కేంద్రానికి చెందిన ఐదుగురు వ్యాపారులు ఇతర జిల్లాల విద్యాశాఖ అధికారులు, అకాడమీలోని ఇద్దరు ఉన్నతాధికారులతో ఉన్న సంబంధాలతో నేరుగా లోడులు ఇక్కడికి రప్పిస్తున్నట్లు సమాచారం. రెగ్యులర్‌గా కోస్తా, సీమ జిల్లాల నుంచి పుస్తకాలు భారీగా సరఫరా అవుతోంది. ప్రస్తుతం వరంగల్ నుంచి లోడు వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారిస్తేగానీ.. విషయం తేలదు. విజయవాడకు చెందిన ఓ పబ్లిషర్స్ వద్ద ముద్రించిన పుస్తకాలు భారీగా వస్తున్నారు. ఇవి ఏ మాత్రం ప్రభుత్వ పుస్తకాలను తీసిపోకపోగా.. ధరలో తేడా ఉంటుంది.

గతంలో పుస్తక దుకాణ యజమానులంతా సిండికేటుగా ఏర్పడి.. డిస్కౌంటు ధరలతో విద్యార్థుల తల్లిదంవూడులు, ఆయా ప్రైవేటు పాఠశాలలకు పుస్తకాలు విక్రయించాలని నిర్ణయించారు. దుకాణాల ముందు వివిధ పాఠశాలలకు సంబంధించిన పుస్తకాల జాబితా బహిరంగంగా ప్రదర్శించారు. ఉచితంగా వచ్చే ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు విక్రయించలేమని.. అధికారులు, విద్యార్థి సంఘాలతో ఇబ్బందులు ఉంటాయని పుస్తకాల దుకాణాల వారు తేల్చి చెప్పటంతో అయిదుగురు వ్యాపారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో 50 శాతం లాభాలు కురిపించే ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు విక్రయించటం కష్టమని భావించిన బడా వ్యాపారులు.. దుకాణాల సిండికేటును విడగొట్టారు.

ప్రైవేటు పాఠశాలలు, పుస్తక వ్యాపారులు కలిసి విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. తమ వద్దనే విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేయాలని నిబంధన పెడుతున్నారు. పుస్తక దుకాణాల వారు పబ్లిషర్స్ అట్టలు, ఎమ్మార్పీ ధరలు మార్పు చేసి.. సంబంధిత పాఠశాలల పేర్లతో ముద్రిస్తున్నారు. వాస్తవానికి 60శాతం లాభాలుండగా.. మరో 40శాతం అదనంగా ధర వేస్తున్నారు. వచ్చిన లాభాలు పుస్తక దుకాణాల వారు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పంచుకుంటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఓ వ్యాపారి ప్రైవేటు పాఠశాలలకు అనధికారిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ.. ఏటా రూ.కోట్ల పుస్తక దందా చేస్తున్నారు. పుస్తక వ్యాపారులు వాణిజ్య పన్నుల శాఖ అధికారులను తమకు అనుకూలంగా మలుచుకోవటం గమనార్హం.

పాఠ్య పుస్తకాల దందా ఇంత సాగుతున్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మాత్రం ఇప్పటికీ పుస్తకాలు పూర్తి స్థాయిలో అందలేదు. జిల్లాకు 26,11,360 పుస్తకాలు రావాల్సి ఉండగా.. 15,96,460పుస్తకాలే వచ్చాయి. మరో 10,14,900పుస్తకాలు ఇంకా సరఫరా కావాల్సి ఉంది. 12,18,304పుస్తకాలే మండలాలకు చేరగా.. మరో 3,78,156పుస్తకాలు డిపోల్లోనే ఉండటం గమనార్హం. ఒకటో తరగతి ఇంగ్లీషు, అయిదో తరగతి తెలుగు, తొమ్మిదో తరగతి తెలుగు, సాంఘీక శాస్త్రం ఇప్పటికీ రాలేదు. పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా.. ఇప్పటికీ సగం పుస్తకాలు అందక పోవటం మన అధికారులు, ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd