పల్లెటూరి పరిశోధకుడు
తక్కువ ఖర్చుతో కొత్త ఆవిష్కరణలుచెరువులో గుర్రపుడెక్క తొలగించే యంత్రం తయారీ మత్స్యకారుల కష్టం చూడలేకనే రూపకల్పన పేదరికాన్ని ఎదిరించి విజేతగా నిలుస్తున్న నర్సింహ
(టీ మీడియా, భూదాన్‌పోచంపల్లి):ప్రతిభ ఉన్నప్పటికీ... పేదరికం అతన్ని ఉన్నత చదువుకు దూరం చేసింది. కష్టపడేతత్వం మాత్రం అతని లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తుచేస్తూనే వచ్చింది. అందుకే ఆ యువకుడు గ్రామీణ పరిశోధకుడిగా ఎదుగుతున్నాడు. తక్కువ ఖర్చుతో కొత్త యంత్రాలను ఆవిష్కరిస్తున్నాడు. తోటి కార్మికుల కష్టం.. అవస్థలు చూడలేక చెరువులో గుర్రపుడెక్కను తొలగించే యంత్రం తయారుచేశాడు. మరెన్నో ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. పేదరికాన్ని ఎదిరించి లక్ష్యం బాటలో విజేతగా నిలుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు గోదాసు నర్సింహ.
భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని ముక్తాపూర్ గ్రామానికి చెందిన గోదాసు అంజయ్య, సత్తమ్మ కుమారుడు నర్సింహ్మ. చిన్నతనం సైన్స్ అంటే ఆసక్తి. ప్రతిదీ శాస్త్రీయంగా ఆలోచిస్తుండేవాడు. పాఠ్యాంశాల్లో వచ్చే వస్తువులను తనకు అందుబాటులో ఉండే అట్టముక్కలు, రేకుడబ్బాలతో తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. అతని ప్రతిభను చూసి చాలామంది పెద్దయ్యా మంచి అంటుం అవే మాటలు అతనిలో బలంగా నాటుకుపోయాయి. కాగా, తన వయస్సులోనే తల్లిదండడులు చనిపోయారు. దీంతో అన్న కిష్టయ్య వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పాలిటెక్నిక్.. ఈసీఈలో చేరి మెకానికల్ ఇంజనీర్ చేయాలనుకున్నా.. ఆయన ఆర్ధిక లేమి కారణంగా సివిల్ ఇంజనీర్ కోర్సు ఉపకార వేతనంతో చదువు పూర్తి చేశాడు. పైచదువులు చదువాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ స్థోమత లేక చదువుకు పుల్‌స్టాప్ పెట్టాడు. ముక్తాపూర్‌లో ఉంటూ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆ తర్వాత 2006 నుంచి గ్రామంలోనే అజయ్ ఎడ్యుకేషనల్ అకాడమీ స్థాపించి పేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో ఏడో తరగతి వరకు విద్యనందిస్తున్నాడు.
యంత్ర రూపకల్పన మత్స్య కార్మిక కుటుంబానికి చెందిన నర్సింహ్మకు ఊరి చేపలు పట్టే మత్స్యకార్మిక సంఘంలో సభ్యత్వం ఉంది. చేపలు పట్టే సమయానికి చెరువు గుర్రపుడెక్క ఆకుతో నిండిపోయేది. చేపలు పట్టడానికి వీల్లేకుండా తయారయ్యేది. 50 మంది మత్స్యకారులు రెండు నెలల పాటు కష్టపడి దాన్ని తొలగించాల్సి వచ్చేది. వంతులవారీగా నర్సింహ్మ కూడా పది రోజులు పని చేసేవాడు. చెరువులో దిగడం వల్ల చర్మం దురద పెట్టేది. గుర్రపుడెక్కపై ఉండే పింజర పాములబారిన పడి మత్స్యకార్మికులు అస్వస్థతకు లోనయ్యేవారు. ఈ ఘటనలను నర్సింహ్మను ఎంతగానో కలిచివేశాయి. తనకున్న సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాడు. అదే కసితో గుర్రపుడెక్కను కత్తిరించే యత్రాన్ని తయారుచేశాడు. ఈ యంత్రం తయారీకి రూ.60 వేలు అవసరం. కానీ నర్సింహ్మ దగ్గర అంత డబ్బు లేదు. తోటి మత్స్య కార్మికుల సాయంతో 6 నెలలపాటు కష్టపడి యంత్రాన్ని రూపొందించాడు.
పని విధానం నర్సింహ్మ తయారుచేసిన యంత్రం మెదట చెరువు ఒడ్డున మాత్రమే పని చేసేది. ఇప్పుడు చెరువులోకి దిగి మధ్యలో ఉన్న గుర్రపుడెక్కనూ తొలగించగలదు. అందుకోసం బోటింగ్ విధానాన్ని జోడించాడు మరి..! చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించాలంటే సాధారణంగా 50 మంది 2 నెలల పాటు కష్టపడాల్సి ఉంటుంది. నర్సింహ్మ తయారుచేసిన యంత్రం ద్వారా ఐదుగురి సాయంతో పది రోజుల్లోనే తొలగించొచ్చు. సమయం.. డబ్బు అవుతుంది. ఇందులో 5 హార్స్ పవర్ మోటారుతోపాటు, గుర్రపుడెక్కను కత్తిరించేందుకు 30 కట్టర్లను అమర్చాడు. గేర్‌బాక్స్, కన్వేయర్ బెల్టుతో ఉన్న ఈ యంత్రం ద్వారా చెరువులోని ఆకు రోలింగ్ అవుతూ ముందుకు వస్తుంది. దీన్ని వెనుక భాగంలో అమర్చిన బాక్సులోని కట్టర్ కత్తిరించి పక్కకు నెట్టేస్తుంది. పక్కనే ఉండే నెట్‌లో ఆ ముక్కలన్నీ పడడంతో ఒక్కసారిగా గుర్రపు డెక్క తొలగించేందుకు సులువుగా ఉంటుంది.
నాబార్డు ఆర్ధిక సాయం తాను చేసిన యంత్రం ద్వారా హైదరాబాద్‌లోని టోలిచౌకీ, హయత్‌నగర్ చెరువుల్లోని గుర్రపుడెక్క ఆకును తొలగించాడు నర్సింహ్మ. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను సులభ పద్ధతిలో తీర్చేందుకు ఔత్సాహిక ఇన్నోవేటర్లకు (నూతన యంత్రా ల రూపకల్పన చేసిన వ్యక్తులు) ఆర్ధిక సాయం అందించేందుకు రాష్ట్రంలోని పల్లె సృజన స్వచ్చంద సంస్థ ఓ సర్వే నిర్వహించింది. జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి ఈ సర్వేలో 12 మంది గుర్తించారు. అందులో నర్సింహ్మ ఒకరు. దీంతో ఆయనకు ప్రోత్సాహకంగా నాబార్డు రూ.2.30 లక్షల ఆర్ధిక సాయం అందజేసింది. ఇటీవలే నాబార్డు రాష్ట్ర చీఫ్ మేనేజర్ మోహనయ్య ముక్తాపూర్ చెరువులో ఈ యంత్రం పని తీరును పరిశీలించారు. నర్సింహ్మ కృషిని అభినందించారు.
మరిన్ని యంత్రాలకు రూపకల్పన అవకాశమిచ్చి, ఆర్ధిక తోడ్పాటునందిస్తే తక్కువ ఖర్చుతో మరిన్ని యంత్రాలను రూపొందిస్తానని నర్సింహ్మ ధీమా వ్యకంచేస్తున్నాడు. గుర్రపుడెక్క ఆకును తొలగించే యంత్రంతోపాటు నీటిని తోడే యంత్రాన్ని కూడా తయారు చేసినట్లు తెలిపాడు. భవిష్యత్తులో కాలుష్య రహిత సోలార్ కారు, వరికోత మిషన్ తయారు చేయాలన్నదే తన లక్ష్యమని ‘టీన్యూస్’కు వివరించాడు.
Other News