Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>> Nalgonda >>  General News
రైతులకు రుణాలిచ్చి ఆదుకోవాలి

నల్లగొండ, జూన్ 13 (టీ మీడియా): ఖరీఫ్‌లో విరివిగా పంట రుణాలను అందించి బ్యాంకర్లు రైతులను ఆదుకోవాలని కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు కోరారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్ష కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఖరీఫ్‌లో 934 కోట్ల పంట రుణాల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 125 కోట్లు బ్యాంకులు పంట రుణాలు అందించినట్లు ఆయన తెలిపారు. రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పించకుండా పంట రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. వ్యవసాయ శాఖలో టోల్‌ఫ్రీ నెంబర్‌తో ప్రత్యేక అధికారిని నియమించి ఖరీఫ్‌లో పంట రుణాలు పొందడంలో రైతులకు, బ్యాంకర్లకు సహకరించాలని వ్యవసాయ శాఖ జేడీని కలెక్టర్ ఆదేశించారు. పంట రుణాల మంజూరులో రైతులకు ఏర్పడే ఇబ్బందులు పరిష్కరించాలన్నారు. బ్యాంకర్ల పని తీరు, ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్‌లో సాధించిన ప్రగతిని నెల నెలా సమీక్షిస్తామని పేర్కొన్నారు.

పథకాల గ్రౌండింగ్ విషయంలో జాప్యం చేయరాదని బ్యాంకర్లకు సూచించారు. ఈ ఏడాది వ్యవసాయ టర్ము లోన్ల కింద 420 కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్ధారించినందున పశు సంవర్ధకం, పౌల్ట్రి, ఈము పక్షుల పెంపకం, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలపై 420 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టు రూపొందించి నూరు శాతం నిధులను సద్వినియోగ పరచాలని బ్యాంకర్లను, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గొర్రెల పెంపకందారుల కమ్యూనిటీ బ్యాంకులు విరివిగా రుణ సౌకర్యం అందించి ఆదుకోవాలన్నారు. జిల్లాలో కంట్రోలింగ్ అధికారులు కనీసం అయిదు యూనిట్లకు తక్కువ కాకుండా గొర్రెల పెంపకందారులకు రుణ సౌకర్యం అందించాలన్నారు. ఈ ఏడాది మహిళా గ్రూప్‌లకు 933 కోట్ల మేరకు బ్యాంకు లింకేజి రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటి వరకు 53 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన 910 గ్రూప్‌లకు రుణ సౌకర్యం అందించాలని బ్యాంకర్లను కోరారు. అర్హులైన గ్రూప్‌లకు ప్రతి నెల బ్యాంకులు అందించే రుణ సౌకర్యంపై సమీక్షిస్తామని కలెక్టర్ అన్నారు. బ్యాంకు మిత్రల సేవలను సద్వినియోగపరుచుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. కరువు పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ ఇన్‌పుట్ సబ్సిడీ కింద 129 కోట్లు విడుదల చేసినందున జీరో బ్యాలెన్స్‌తో రైతులకు అకౌంట్లు ప్రారంభించాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్‌కు అర్హులైన లబ్ధిదారులను ఉమ్మడి గుర్తింపు శిబిరాలు నిర్వహించి ఎంపిక చేయాలని కోరారు. 2012-13 వార్షిక రుణ ప్రణాళిక, సాధించిన ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్షికమంలో ఎస్.బి.ఐ ఏజీఎం శంకర్‌రావు, ఎస్.బి.హెచ్ ఏజీఎం హేమసుందర్, ఆంద్ర బ్యాంకు ఏజీఎం నాగరాజు, ఆర్.బి.ఐ ఏజీఎం సుశీలారే, గ్రామీణ బ్యాంకు ఆర్‌ఎం. నర్సింహా, జిల్లా సహకార బ్యాంకు జీఎం భాస్కర్‌రావు, నాబార్డు ఏజీఎం వీరశంకర్, జిల్లా లీడ్ బ్యాంకు అధికారి జేమ్స్, డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌డ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd