ఎవరి దారెటు?
జూన్ 15... ఉపఎన్నికల ఫలితాలు పార్టీలకే కాదు..
ప్రజావూపతినిధులు, నాయకులకు కీలకంగా మారాయి. రాజకీయ భవితవ్యం నిర్ణయించుకునేందుకు సుముహూర్తం.. పార్టీ మారాలా.. వద్దా అనే విషయం తేల్చుకునేందుకు ఆఖరి గడువు.. అంతర్గతంగా తర్జనభర్జనలు.. బయట సన్నిహితులతో సుదీర్ఘ చర్చలు, సమాలోచనలు.. రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేని స్థితి.. ఉద్యమ తీవ్రతతో కాంగ్రెస్, టీడీపీ క్యాడర్‌లో తీవ్ర నిరాశ.. నాయకుల్లో నిస్తేజం.. జిల్లాను లీడ్‌చేసే నాయకుడు లేకపోవడం.. ఉత్తేజ పరిచే పరిస్థితులు కరువవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి.. ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరితే తిరుగులేదని భావిస్తున్నా.. ఉప ఫలితాల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు.
(టీన్యూస్ ప్రతినిధి, నల్లగొండ) జూన్ 15న వచ్చే ఉపఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా రాజకీయాల్లో తీవ్రమార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీమాంవూధలో 17 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ, తెలంగాణలో పరకాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15న ఉప ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలు అన్ని రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఇప్పటికే సీమాంవూధలో జగన్, తెలంగాణలో టీఆర్‌ఎస్ ముందుకు దూసుకుపోతుండగా .. ఉప ఫలితాల ఆధారంగా తమ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవాలని జిల్లాలోని కాంగ్రెస్, టీడీపీ కీలక నాయకులు భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, వైఎస్సార్‌సీపీతో రాష్ట్రంలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడటంతో రెండు పార్టీలకు సంబంధించిన కొందరు ముఖ్య నాయకులు పార్టీలు వీడేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ ఉద్యమ వేడితో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఇప్పటికే చతికిల పడగా క్యాడర్, నాయకుల్లో నిరాశ, నిస్తేజం అలుముకుంది. కనీసం దిశానిర్దేశం చేసే పరిస్థితి లేకుండా పోవటంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కాంగ్రెస్, టీడీపీ ముఖ్య నాయకులు వ్యవహరిస్తున్నారు.తెలంగాణ ఉద్యమ తీవ్రత, వరుస ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయాలతో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మించి ప్రత్యామ్నాయం లేదనే భావన జిల్లా కాంగ్రెస్, టీడీపీ వర్గాల్లో నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీమంత్రి కోమటిడ్డి వెంకటడ్డి అధికార పార్టీలోనే విపక్ష పాత్ర పోషిస్తున్నారు. సీఎంపై తిరుగుబాటు జెండా ఎగుర వేసి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతో ఆయన పార్టీలో ఉండరనే వాదన వినిపించింది. ఇప్పటికీ తెలంగాణ వాదాన్ని వినిపిస్తూనే.. వై.ఎస్. తన రాజకీయ గురువంటూ ప్రతిచోటా చెబుతున్నారు. ఈ నెల 15 తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెబుతున్న ఆయన.. టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారా.. వైస్సార్‌సీపీలో చేరతారా.. అనేది జూన్ 15 తర్వాతే తేలనుంది.
తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే మాత్రం జిల్లాలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్‌కు చెందిన మరో ముఖ్య నేత త్వరలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. టీడీపీ జిల్లాలో రెండు వర్గాలుగా విడిపోవటంతో.. పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్షికమాలకు కూడా కొందరు దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉమామాధవడ్డి, వేనేపల్లి చందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక పాటు మరికొందరు నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో కుదరక.. అంటీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మోత్కుపల్లి వ్యతిరేక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారా.. లేదనేది సందిగ్ధంలో పడింది.
ఉప ఎన్నికల్లో ఫలితాలు వైఎస్సార్‌సీపీ వైపుఏకపక్షంగా వచ్చి.. పరకాలలో గెలిస్తే వెళ్లాలనే యోచనతో కొందరు ఉన్నారు. పార్టీ అధినేత జగన్ జైలులో ఉండటంతో వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే బెంగ కూడా లేకపోలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తండ్డి జగన్ నామం జపిస్తున్నారు. దివంగత సీఎం వై.ఎస్.కు బద్ద వ్యతిరేకిగా ఉన్న ఉప్పునూతల.. గత కొన్ని రోజులుగా ఆయన జగన్‌కు.. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయటంలో ఆయన పార్టీ మారే ఆలోచన ఉందా.. లేదానేది స్పష్టత లేదు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి తేరా చిన్నపడ్డి వైఎస్సార్‌సీపీలో చేరతారని గతంలోనే ప్రచారం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌లో చేరటమే ముఖ్యమని.. ప్రత్యేక ఉద్యమ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు సులువవుతుందనేది కాంగ్రెస్, టీడీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీలో చేరితే ఎలా ఉంటుందనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. ఏది ఏమైనా.. జూన్ 15 ఉప ఫలితాల తర్వాత జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు తప్పవని తెలుస్తోంది.
Other News