క్వారీలో మందుపాతర పేలి కార్మికుడి మృతి
తూప్రాన్, జూన్23(టీమీడియా): తూప్రాన్ మండలం ఘనపూర్ శివారులోని శనివారం మధ్యాహ్నం క్వారీ వద్ద మందుపాత పేలి కార్మికుడు మృతి చెందారు. రాళ్లను పేల్చడానికి అమర్చిన మందు పాతరలను పరీక్షిస్తుండగా జరిగిన ఘటనలో లింగాడ్డిపేట గ్రామానికి చెందిన కొలనుపాక బాబుగౌడ్(26) అనే కార్మికుడు మృత్యువాతపడ్డాడు. ఘనపూర్ శివారులోని సాహితి స్టోన్ క్రషర్స్‌కు సంబంధించిన క్వారీలో రాళ్లను పేల్చేపనిని రాఘవేంద్ర ట్రెడర్స్ అనే ఏజెన్సీవారు కాంట్రాక్టు తీసుకున్నారు. ఎప్పటిలాగానే క్వారీలో శనివారం రాళ్లను పేల్చడానికి రాళ్లకు రంధ్రాలు చేసి అందులో మందుపాతరలను అమర్చారు. వాటిని పేల్చేముందు బాబుగౌడ్ పరీక్షిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక మందు పాతర పేలింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపవూతికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈ సంఘటనపై ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు కంకర మిషన్ నిర్వాహకుల అశ్రద్ధవల్లే బాబు చనిపోయాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని క్రషర్‌మిషన్ కార్యాలయం ముందుంచి ఆందోళన చేపట్టారు. దీంతో ఆర్థిక సాయం చేయడానికి క్రషర్‌మిషన్ నిర్వాహకులు అంగీకరించారు. మృతుడికి భార్య భవాణి, 8 నెలల అక్షిత, దీక్షిత అనే కవల పిల్లలున్నారు.
ఈ సంఘటనతో లింగాడ్డిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు బాబుగౌడ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపవూతికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు. ఇటీవలే డివిజనల్ స్థాయి పోలీసు అధికారుల బృందం తూప్రాన్ మండల పరిధిలో ఉన్న అన్ని కంకర మిషన్లపై ఆకస్మిక దాడులు జరిపి రాళ్ల పేల్చివేతపై తనిఖీలు నిర్వహించారు. పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించి నెల రోజులైనా గడవకముందే కంకర మిషన్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. రెండున్నర సంవత్సరాల క్రితం లింగారెడ్డిపేట శివారులోని క్వారీలో జిలెటిన్ స్టిక్స్ పేలిన సంఘటనలో ముగ్గురు కార్మికులు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే.
Other News