ఎవరిదీ పాపం?
- ముదురుతున్న ఎరువుల కొరత
- సకాలంలో పైరుకు అందని దుస్థితి
- పరిష్కారంలో యంత్రాంగం విఫలం
- దిగుబడులపై ప్రభావం
- తగ్గిపోతున్న సేంద్రియ ఎరువుల వాడకం
- రసాయనిక ఎరువులపైనే సాగు ఆధారం
- కేటాయింపుల్లో లోపించిన శాస్త్రీయత
- సాగు వివరాల సేకరణలోనే లోపాలు
గజ్వేల్, ఆగస్టు 19(టీమీడియా) :ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో సమూల మార్పుల వల్ల నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ఈ సమయంలో ఎరువులు అత్యవసరం. నాణ్యమైన విత్తనం, అవసరం మేరకు ఎరువులు, మేలైన యాజమాన్య పద్దతుల వల్లే ఊహించిన దిగుబడులు సాధ్యం. కానీ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో రైతుకు విత్తనం, ఎరువుల కొరత ఏళ్ల తరబడి పీడిస్తుంది. ప్రతి సీజన్‌లో ఎరువుల కొరత సమస్య పునరావృతమవుతున్నా పాలక, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తూనే ఉంది. సేంద్రీయ ఎరువుల వాడకం కనుమరుగై పోతుండగా, పెరుగుతున్న సాగు విస్తీర్ణం, మారుతున్న పంటల రకాల సాగుకు అనుగుణంగా ఎరువుల అవసరాలను అంచనా వేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. పర్యావాసనంగా రైతుకు కష్టాలతో పాటు దిగుబడులు తగ్గి, జాతీయోత్పత్తి, ఆదాయానికి నష్టం వాటిళ్లుతుంది.
వ్యవసాయ రంగం ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో కూడిన నూతన పద్దతుల వైపు పరుగులు తీస్తుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే యంత్ర పరికరాల వాడకం, సాంప్రదాయ పద్దతి పంటల స్థానంలో హైబ్రిడ్ రకాల సాగు, సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు 3వ పంట సాగువిస్తీర్ణం పెరగడం తెలిసిందే. ఈ పరిస్థితులకు అనుగుణంగా ఎరువుల వాడకం ఏటేటా పెరుగుతూ వస్తుంది. స్థానిక అవసరాలు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఎరువుల వాడకంపై శాస్త్రీయ పద్ధతుల అంచనాలు, కేటాయింపులు జరగకపోవడం ఎరువుల కొరతకు దారి తీస్తుంది. పర్యావసనంగా సేంద్రీయ ఎరువుల వాడకం కనుమరుగై పోతుండగా, రసాయనిక ఎరువుల వాడకంపై ఆధారపడక తప్పడం లేదు.
మ్యాన్ పవర్ రోజు రోజుకు ఖరీదైపోతుండడం కంపోస్టు ఎరువుల వాడకంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కూలీల ద్వారా జరిగే పనికన్నా యంత్రాల ద్వారా తక్కువ సమయంలో పూర్తి కావడమేగాకుండా ఖర్చు కలసి వస్తుంది. కంపోస్టు ఎరువుల తయారీ ప్రస్తుత పరిస్థితుల వల్ల ఖర్చు, సమయం కలసి రాకపోవడంతో వీటి వాడకానికి రైతులు ముందుకు రావడంలేదు. ఎకరం పొలానికి సరిపడ ఆరు ట్రాక్టర్ల కంపోస్టు ఎరువు తయారీ, వాడకం రైతుకు అనేక రోజుల శ్రమతో పాటు ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. అదే ఎకరానికి బస్తాకు బదులు మరో అర బస్తా మోతాదును పెంచి కాంప్లెక్స్ ఎరువును వాడి అప్పటికప్పుడు పని ముగించుకోవడం మామూలుగా మారింది. తద్వారా ధాన్యం నాణ్యత, భూసార పరిరక్షణ, తెగుళ్ల ప్రభావం, ధాతులోపం లాంటి సమస్యలేవి పట్టించుకోకుండా రైతు సాగు పద్దతులు కొనసాగించడం మామూలైంది.
సాంప్రదాయ రకాల కనుమరుగు
గతంలో సాంప్రదాయ లోకల్ రకాల పంటల సాగు ముమ్మరంగా జరిగేది. ముఖ్యంగా రసాయనిక ఎరువుల అవసరం లేకుండా సాగయ్యే ఆముదం, రాగి, జొన్న, ఉలువ, కంది, సజ్జ, పెసర, మినుము లాంటి అపరాల పంటల స్థానంలో అధిక ఎరువులు అవసరమయ్యే పత్తి, కూరగాయ వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న మొక్కజొన్న, వరి, పత్తి పంటలకు అధిక మొత్తంలో ఎరువులు అవసరపడుతున్నాయి. వీటితో పాటు కూరగాయల పంటల విస్తీర్ణం కూడా పెరగడంతో యేడాదికి 3 పంటలు సాగవుతోంది. కొన్ని హైబ్రిడ్ రకాల కూరగాయల పంటల సాగుకు పెద్ద మొత్తంలో ఎరువుల వాడకం తప్పడం లేదు. గతంలో కన్నా ప్రధాన పంటలైన మొక్కజొన్న, వరి, పత్తి పంటల సాగులో సైతం ఎరువుల వాడకం పెరిగింది.
సాగు సర్వేలో లోపించిన శాస్త్రీయత
ప్రతి సీజన్ సాగు విస్తీర్ణం సర్వేపై శాస్త్రీయత లోపించింది. సాగు వివరాలు క్షేత్రస్థాయిలో జరగడం లేదు. ఏయే పంటలు, ఏయే సమయంలో ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నవి, వాటికి అవసరమైన ఎరువుల మొత్తంపై పూర్తి స్థాయిలో అంచనాలు అవసరం. గత సిఫార్సులు, సరఫరాల ఆధారంగా కార్యాలయంలోనే లెక్కలు తేల్చి పూర్తి చేయడం మామూలైంది. గ్రామానికి వెళ్లి క్షేత్ర స్థాయిలో సర్వే జరిపిన దాఖలాలు లేవు. ఆదర్శరైతులు, వ్యవసాయ, రెవెన్యూ, అధికారులు గ్రామాల వారీగా పంటల సాగు వివరాలు, ఎరువుల అవసరాలను ముందుగానే అంచనా వేయడం అవసరం. ఆ ఆధారంగానే ఎరువుల ఇండెంట్ తయారు చేసి రైతుకు సకాలంలో ఎరువులు అందించడానికి వీలవుతోంది.
2007 ముందు జిల్లా సాగు విస్తీర్ణం మూడున్నర లక్షల హెక్టార్లు కాగా, ప్రస్తుతం నాలుగు లక్షల హెక్టార్లకు పెరిగింది. ప్రధాన పంటలైన మొక్కజొన్న, వరి సాగు విస్తీర్ణంలో పెద్దగా మార్పులేకపోగా తృణ ధాన్య పంటల సాగు స్థానంలో పత్తి సాగు పెరిగింది. పాతిక సంవత్సరాల క్రితం జిల్లాలో సాగులోకి వచ్చిన పత్తి 2007-08లో కేవలం 12వేల హెక్టార్ల లక్ష్యానికి 28,375 హెక్టార్లు సాగై, ప్రస్తుత 2012-13 ఖరీఫ్‌లో లక్ష హెక్టార్లకు చేరుకుంది. పై ఎరువుల 28,375 హెక్టార్ల సాగు కాగా ప్రస్తుతం లక్ష హెక్టార్లకు చేరుకుంది. పై ఎరువుల ఇండెంట్ అప్పటికి, ఇప్పటికీ సరఫరాలో పెద్ద మార్పులేకపోవడం గమనార్హం. పైగా ప్రతియేటా ఇండెంట్ ప్రకారం ఎరువులను తెప్పించడంలో స్థానిక పాలక, అధికార యంత్రాంగం విఫలమవుతున్నట్లు స్పష్టమవుతున్నది.
బ్లాక్ మార్కెట్‌లో ఎరువులు
జిల్లాలో ఎరువులు ప్రతిసారి బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. రెండు నెలలుగా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నా, ఎరువుల ధరల్లో క్రమ బద్దీకరణ జరగడం లేదు. ప్రస్తుతం రూ.281కి అమ్మాల్సిన యూరియా రూ.350 వరకు విక్రయాలు జరగడం దారుణం. డీలర్లు తమకు కేటాయించిన ఎరువులు అధికశాతం రహస్య ప్రాంతాలకు తరలించి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బిల్లులు తప్పని సరనే నిబంధన కట్టుదిట్టం చేసినప్పటికీ వసూళ్లలో మాత్రం మార్పు రాలేదు. ముఖ్యంగా మండల స్థాయి డీలర్లు రైతులనుంచి అధిక మొత్తంలో వసూలు చేయడం మామూలుగా మారింది.
ఎరువుల వాడకంలో లోపించిన అవగాహన
రైతు ధీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా అప్పటికప్పుడు ప్రయోజనం పొందే పద్దతుల వైపు మొగ్గుచూపుతున్నాడు. బడా వ్యాపారుల ఆధీనంలోకి సాగు భూములు వెళ్లడం, పర్యావసనంగా కౌలు సాగు విస్తీర్ణం పెరగడంతో కంపోస్టు ఎరువుల వాడకం తగ్గి, రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది. భూసార పరీక్షలు నిర్వహించకపోగా విచ్చలవిడిగా ఎరువుల వాడకం కొరతకు మరో కారణమైతే, రైతుల్లో ఎరువుల వాడకంపై అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుంది.
Other News