రాతమారని చేనేత
విదేశీ వస్త్రాలను తగులబెడుతున్న వేళ... గాంధీ తిప్పిన రాట్నం సాక్షిగా... నిజాం కాలంలో నిగనిగలాడిన బట్టల మెరుపులు... హైదరాబాద్ సంస్థానంలో, అందులోనూ దుబ్బాక ప్రాంతంలో తళుక్కుమన్న చేనేతల బతుకులు ఇప్పుడు చితికిపోతున్నాయి. ప్రపంచీకరణ దూసుకొచ్చింది. పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చింది. రెడీమేడ్ దుస్తులు మార్కెట్లోకి వచ్చేశాయి. కులవృత్తిని మానుకోలేక, ప్రత్యామ్నాయం చూపే దారిలేక ఆగమయ్యారు. అప్పుల భారం పెరిగిపోయింది. తినడానికి తిండిలేక, చేయడానికి పనులు లేక పస్తులున్నారు. బతుకు మీదే విరక్తి పుట్టింది. నేసిన బట్టే ఉరితాడయ్యింది... బట్టల రంగుల్లో కలిపే విషపదార్థమే దిక్కయ్యింది... అలా 200 మంది వరకు చేనేతలు ఈ లోకాన్నే వీడిపోయారు. దుబ్బాక ప్రాంతంలో చేనేతల బతుకులు బుగ్గిపాలయ్యాయి. చేనేత వృత్తిలో తెలంగాణకు తలమానికంగా తమ సత్తాను చాటిన చేనేతల కుటుంబాలు ఇప్పుడు దుర్భర జీవితాన్ని గడుపుతున్నాయి. ఒకప్పుడు సుమారు 1600 మగ్గాలతో నాలుగువేల మందికిపైగా కార్మికులు బతుకీడ్చిన దుబ్బాక ప్రాంతంలో ఇప్పుడు 300 మగ్గాలకు మించని దుస్థితి నెలకొంది.
(దుబ్బాక/దుబ్బాక రూరల్, టీమీడియా) దుబ్బాక నేతన్నలకు చేతి నిండా పని, కడుపు నిండా తిండి కల్పిస్తామన్న సర్కారు మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. దుబ్బాక ప్రాంత చేనేత నేతన్న ఏండ్ల తరబడి వెంటాడుతున్న అప్పులను మాఫీ చేయడంలో సర్కార్ పూర్తిగా విఫలం అయింది. ఫలితంగా దుబ్బాక నేతన్నల కష్టాలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. సర్కార్ ప్రకటించిన రుణమాఫీ కేవలం 24 మందికే పరిమితమే, నేతన్నల కన్నీళ్లు తుడవలేని పరిస్ధితి నెలకొంది. దుబ్బాక చేనేత కార్మికులకు సర్కారు ఇళ్లు కట్టిస్తామని సుమారు వందమందికి హౌసింగ్ కార్పొరేషన్ పేరుతో రుణాలను అందించి ఒక కాంట్రాక్టర్ అప్పనంగా అప్పగించింది. కాంట్రాక్టర్,అధికారుల అవినీతి, అక్రమార్కుల మూలంగా కట్టిన ఇంటిలో కాలుపెట్టక ముందే శిథిలాలుగా మారాయి. కూలుతున్న ఇంటిలో చేనేత కార్మికులు అడుగుకూడపెట్టలేదు. 193 నుంచి ఆ గృహాలపై పేరుకొని పోయిన రుణాలు చేనేత కార్మికుడికి బ్యాంకుల అప్పు పుట్టనివ్వడంలేదు. తాము అనుభవించని అప్పులపై చేనేత కార్మికుల కష్టాల గూడును పేర్చుకున్నారు. ఎన్నిసార్లు మొత్తుకున్నా సర్కార్ స్పందించకపోవడంతో తమకు సంబంధం లేని అప్పుల భారం మోయలేక కొంత మంది చేనేత కార్మికులు ఆత్మహత్య లు కూడా చేసుకున్నారు. అంతేగాక లూమ్‌లెస్ వీ వర్స్ కింద దుబ్బాకలోని కార్మికులకు మెగ్గం, నూలు, అందించడానికి సుమారు 16 వేల రుపాయాలను అప్పుగా అందించారు.
సుమారు 160 మంది కార్మికుల అప్పులు డీసీసీబీలో పేరుకొని పోయాయి. మళ్లీ అప్పుల పుట్టకపోవడంతో క్షీణించిన సొసైటీలో పని దొరకక మరికొందరు ఆత్మహత్యలే శరణ్యమనుకున్నారు. వీటికి తోడు 110 మంది కార్మికులకు వర్కింగ్ కాపిటిల్ కింద 5 వేల చొప్పున సహాయం అందించారు. వీరికి కూడా సర్కార్ రూణమాఫీలో మొండి చేయి చూపింది. ప్రభుత్వం చేనేత సంఘంలో పని కల్పించాలనే ఉద్దేశ్యంలో డీఆర్‌డీవై కింద సుమారు పది లక్షల రూపాయాలను అప్పుగా ఇచ్చింది. వాటిని కూడా మాఫీ చేయకపోవడంలో సంఘం-సొసైటీ చతికిలపడింది. అప్పులతో పోరాటం చేస్తున్న సంఘం కార్మికులకు పని కల్పించలేని పరిస్థితి దాపురించింది. పదిలక్షలలోను సుమారు 3లక్ష రూపాయాలను ఎలాగోలా చెల్లించిన సొసైటీకి మిగతా అప్పులు పుట్టకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆప్కో ద్వారా రావాల్సిన మూడు లక్షల రూపాయాలు బకాయి అలాగే పేరుకొని పోయింది. దీంతో మగ్గాలు నడపడానికి సొసైటీ చేతిలో కనీసం నూలు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దుబ్బాక చేనేత సహకార సంఘంలో సుమారు 9 వందల మంది నేతన్నలు వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు.
మూలనపడిన క్లస్టర్.....
సమష్టి నిర్వహణతో చేనేతలకు భాగస్వామ్యం చేస్తూ పని కల్పించాలనే ఉద్దేశ్యంతో సర్కార్ ఏర్పాటు చేసిన క్లస్టర్ పథకం కూడా మూలన పడింది. క్లస్టర్ ద్వారా ఒక్కోక్కరికి 33 వేల రూపాయాల చొప్పున పావలా వడ్డీకి అందించాలనే ప్రభుత్వ నిబంధన తప్పునిసరిగా చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినప్పుటికీ వాటిని అమలు పరుచలేకపోయారు.వీటికి 10సార్లుగా చేనేత గ్రూపులకు మూడు లక్షల 20 వేల వరకు కనీస రుణ సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. నాబార్డు నిబంధనలకు కూడా తుంగలో తొక్కారు. ఇందుకు ప్రభుత్వం నుంచి 6 లక్షల 52 వేల రూపాయాలు సీడ్‌మనీగా బ్యాంకుకు ప్రభుత్వం అందించినప్పుటికీ ,వాటిని కార్మికులకు అందించడంలో విఫలమయ్యారు.
బ్యాంకులోనే మురిగిపోతున్న నిధులపై మాత్రం అధికారుల నిర్లక్ష్యంగా మూలంగా కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. పాలకమండలి నిర్లక్ష్యంగా మూలంగా చేనేత పరిస్థితి ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. దీంతో నేతన్న పని దొరకక వారు రోడ్డు పాలవుతున్నారు. దుబ్బాక సొసైటీలో 23 మందికి మాత్రమే నామ మాత్రంగా సొసైటీని కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కులవృత్తినే నమ్ముకొన్ని బతుకుతున్న కార్మికులకు ప్రభుత్వం పని లేని పరిస్థితి ఏర్పడి పునరావృతమమ్యే ప్రమాదముంది. వీరి అప్పులను మాఫీ చేస్తామని అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, హామీ నెరవెర్చకపోవడంతో నేత కార్మికులకు సమస్యలు తప్పడం లేదు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి ఈ సమస్యలను పట్టించుకోవాల్సిందిగా కార్మికులు కోరుతున్నారు.
కేంద్ర మంత్రిని కలిసి విన్నవించా
చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. కొద్ది నెలల క్రితం కేంద్ర జౌళి శాఖమంత్రి ఆనంద్‌శర్మను కలిసి విన్నవించాం. ఇప్పటికే పాలకులు పట్టించుకోని కారణంగా ఎంతో మంది చేనేతలు చనిపోయారని వివరించాను. చేనేత కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందించారు. అంత్యోదయ కార్డులు, క్రెడిట్ కార్డులు తదితర సదుపాయలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కొన్ని నెరవేరినప్పటికీ చేనేతల బతుకులు బాగుపడాలంటే ప్యాకేజీ ప్రకటించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపించాల్సిన అవసరముంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేతలను ఆదుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాను. -ఎంపీ విజయశాంతి,
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి
చేనేతల బతుకులు చితికిపోవడానికి కారణం పాలకులే. వారి విషయంలో ఏ మాత్రం పట్టించుకోకపోవడం, వారికి చేయూతనందించకపోవడంతోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరెన్నో కుటుంబాలు దుర్భర జీవితాలు గడుపుతున్నాయి. మైక్రో సర్వే నిర్వహించి ప్రతీ చేనేత కుటుంబం బాగుపడేలా వారికి ధీమాను ఇవ్వాలన్నారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు ప్రభుత్వం డిపాజిట్ చేసి, ఏ కుటుంబం ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కుకుంటుందనే విషయాన్ని బట్టి వారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలి. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులందరికీ అంత్యోదయ కార్డులు, క్రెడిట్‌కార్డులు అందించి ఆదుకోవాలి.
-సోలిపేట రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
చేనేత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం
చేనేత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. కేవలం చేనేత కార్మికులపై సానుభూతి చూపిస్తూ ఓట్లను దండుకోవాలనే ప్రయత్నం చేయడమే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకున్న పరిస్థితులే ఉండవు. అధికార పార్టీలు మొసలికన్నీళ్లు కార్చడమే తప్ప చేనేతలను ఏ మాత్రం ఆదుకున్న పరిస్థితుల్లేవు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాల్సిన అవసరముంది. -బిళ్ల ప్రసాద్, తెలంగాణ చేనేత సంఘం అధ్యక్షులు
Other News