Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Medak>>  General News
తవ్వకాల్లో ఆలయ ఆనవాళ్లు

మెదక్, జూన్ 28 (టీ మీడియా): ఈద్గా పునర్నిర్మాణంలో భాగంగా తవ్వకాలు జరుపుతున్న క్రమంలో కాకతీయుల నాటి పురాతన దేవాలయ గజస్తంభం బయల్పడింది. మెదక్ పట్టణంలోని పురాతన ఈద్గా పునర్నిర్మాణానికి ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావులు నిధులు మంజూరు చేశారు. ఈద్గా నిర్మాణంలో భాగంగా తవ్వకాలు జరుపుతున్న క్రమంలో మూడు రోజుల క్రితం కాకతీయుల కాలం నాటి ఆరుఫీట్ల గజస్తంభం బయల్పడింది. దీంతో తవ్వకాలు జరిపిన కూలీలు సాంప్రదాయబద్దంగా బొట్లు పెట్టి పూజలు నిర్వహించి అక్కడే పూడ్చివేశారు. ఈ విషయం గమనించిన కొందరు పిల్లలు నవాబ్‌పేటవాసులకు తెలియజేశారు. దీంతో నవాబ్‌పేటకు చెందిన ఒక వర్గం యువకులు గురువారం ఉదయం జేసీబీతో గజస్తంభాన్ని బయటకు తీయించారు. ఇక్కడ బయల్పడిన లక్ష్మీదేవి ప్రతిమతో కూడిన రాతి తోరణంకు కాకతీయుల చిహ్నమైన ఏనుగులు ఉన్నాయి.

దీనిని బట్టి అప్పటో నైజాం పరిపాలనకు ముందు ఔరంగజేబు సామ్రాజ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో హిందూ దేవాలయం ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. దీని మూలాలే నేడు తవ్వకాల్లో బయల్పడిన విగ్రహాలు అని చెబుతున్నారు. ఈద్గాకు సంబంధించిన స్థలంలో కాకుండా పై భాగాన హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముని పాదాలు ఉన్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఆ స్థలంలోనే కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయి. ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణం కోసం తవ్విన స్థలానికి కొద్ది దూరంలో మరొక రాతి శిల్పం బయల్పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష్మీదేవి పత్రిమ గల రాతి తోరణానికి స్థానికులు పాలాభిషేకం నిర్వహించి పూజలు చేశారు. మహిళలు తండోపతండాలుగా తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ గోద్రు, సీఐలు రామకృష్ణ, విజయ్‌కుమార్, ఎస్‌ఐ భరత్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని భారీ బందోబస్తు నిర్వహించారు. ఆర్డీవో వనజాదేవి సంఘటనా స్థలానికి చేరుకొని తవ్వకాల్లో బయల్పడిన లక్ష్మీదేవి ప్రతిమతో కూడిన రాతి తోరణాన్ని పరిశీలించారు. అనంతరం స్థానికులు ఆర్డీవోతో మరిన్ని విగ్రహాలు ఈ స్థలంలో ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే మరో వర్గం వారు మాట్లాడుతూ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలను పెట్టారని చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆర్డీవో వనజాదేవి, డీఎస్పీ గోద్రులు చాకచక్యంగా వ్యవహరించి అందరినీ బయటకు పంపించి ఇరువర్గాల ముఖ్యనేతలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇరువర్గాలు సమన్వయం కోల్పోవద్దని అధికారులు సూచించారు.
పురావస్తు శాఖతో దర్యాప్తు చేస్తాం

ఈ ప్రాంతంలో బయటపడిన క్ష్మీదేవి ప్రతిమతో కూడిన రాతి తోరణం స్థానంలో స్థానికులు చెబుతున్నట్టు పురావస్తు శాఖతో దర్యాప్తు జరిపించి మరిన్ని తవ్వకాలను జరిపిస్తామని మెదక్ ఆర్డీవో వనజాదేవి విలేకరులకు తెలిపారు. అప్పటి వరకు ఇక్కడ బయటపడ్డ రాతి తోరణాన్ని సమీప దేవాలయానికి తరలిస్తామని తెలిపారు.

ఆర్డీవోను అడ్డుకున్న స్థానికులు నవాబ్‌పేట మాజీ కౌన్సిలర్ సునీతాడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవోను స్థానికులు ఘొరావ్ చేశారు. తవ్వకాల్లో బయల్పడిన రాతి తోరణాన్ని దేవాలయానికి కాకుండా ఆర్డీవో కార్యాలయానికి తరలించాలని నిర్ణయించడంతో స్థానికులు అడ్డుచెప్పారు. దీంతో నవాబ్‌పేట ప్రాంతంలోని గట్టమ్మ దేవాలయానికి రాతి తోరణాన్ని తరలించడంతో వివాదానికి తెరపడింది.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd