పట్టుదలతో ముందుకు
హంగూ ఆర్భాటాలు లేవు...ప్రచార హోరు, ఫీజుల జోరు లేదు...ఉన్నదల్లా అనుభవం... చిత్తశుద్ధి... పట్టుదల... ఇవే అస్త్రాలుగా శిఖరాలు అధిరోహించి తామేమిటో నిరూపించుకున్నాయి సర్కారీ స్కూళ్లు. ప్రైవేటు బడాయికి జడవకుండా లక్ష్యం దిశగా దూసుకుపోయాయి. అరకొర సౌకర్యాలున్నా అడ్డంకిగా భావించకుండా ఫలితాల కోసం తపించారు. విద్యార్థుల పట్టుదలకు అధ్యాపకుల సహకారం తోడై వందశాతం ఫలితాలు సాధించిన జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రైవేటుకు సవాల్ విసురుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫలితాల్లో రికార్డు స్థాయిలో జిల్లాలోని 97 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించి సంచలనం సృష్టించాయి. ప్రైవేటుకు దీటుగా మార్కులు సాధించి పలువురు విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. వారిని అభినందించి ప్రోత్సహించడానికి జిల్లా కలెక్టర్ ముందుకు వచ్చారు. మిగతా వారికి స్ఫూర్తినివ్వడానికి ఇది ఉపయోగపడనున్నది.
టీ మీడియా ప్రతినిధి, సంగాడ్డి: విద్యార్థుల పట్టుదలకు అధ్యాపకుల సహకారం తోడై వందశాతం ఫలితాలు సాధించిన జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రైవేటుకు సవాల్ విసురుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫలితాల్లో రికార్డు స్థాయిలో జిల్లాలోని 97 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించి సంచలనం సృష్టించాయి. వారిని అభినందించి ప్రోత్సహించడానికి కలెక్టర్ ముందుకు వచ్చారు. రెండు దశాబ్ధాలుగా జిల్లాలో ప్రైవేటు పాఠశాలల హవా పెరగడంతో ప్రభుత్వ బడులు ఆదరణ కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. వివిధ రకాల బోధన పద్ధతులతో మార్కుల స్థాయిని గరిష్ట స్థానానికి పెంచుకున్న ప్రైవేటు పాఠశాలలు వటవృక్షాల్లా పెరిగాయి. సంప్రదాయ బోధనకు అలవాటు పడ్డ సర్కారు పంతుళ్లు ముంచుకొస్తున్న ముప్పును గ్రహించే లోగా ప్రైవేటు విద్యా సంస్థలు జిల్లాలోని సింహభాగాన్ని కమ్మేశాయి. ప్రైవేటుతో పోటీ పడలేక చతికిల పడ్డ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ భూతం మరింత కుంగదీసింది. రాష్ట్ర రాజధానికి పొరుగున ఉన్న జిల్లా కావడంతో కార్పొరేట్ వ్యవస్థ మరింత తలకెక్కింది. ప్రైవేటు హడావుడికి హడలిపోయిన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు చితికిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక తగ్గింది. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్న విద్యార్థుల సంఖ్య పదులకు పడిపోయింది. అర్హత, అనుభవం లేని సిబ్బందితో నడుస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న హడావుడికి అవి రెండూ పుష్కలంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కుదేలవడంతో జిల్లాలోని విద్యా రంగ నిపుణులు, అధికారులు ఆలోచనలో పడ్డరు. ప్రభుత్వ విద్యను కాపాడుకోవడానికి ప్రణాళికల రచించారు. పట్టుదల గల సిబ్బంది ముందుకొచ్చారు. సౌకర్యాల లేమి అనే సాకులతో తప్పించుకుంటూ వచ్చిన ఉపాధ్యాయులూ బాధ్యత గుర్తు చేసుకున్నారు. మంచి మార్కులు సాధించాలన్న విద్యార్థుల ఆసక్తిని గమనించారు. ఇటు ఉపాధ్యాయులు, అటు ఉపాధ్యాయులు ఉమ్మడిగా కృషి చేశారు. జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం వారికి అండగా నిలిచి ప్రోత్సహించింది. ప్రత్యేక తరగతులు నిర్వహించారు. విద్యార్థులను తీర్చి దిద్దారు. మంచి ఫలితాలు సాధించారు. ఒకటి కాదు, రెండు కాదు... జిల్లాలోని 97 పాఠశాలల్లో పదో తరగతి రాసిన విద్యార్థులంతా పాసయ్యారు. ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు ఏ పట్టణ ప్రాంతాలకో చెందినవో కాదు. ఎలాంటి అదనపు సౌకర్యాలూ లేకుండానే ఉత్తమ ఫలితాలు సాధించారు.
జిల్లాలో మొత్తం 503 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుండగా వాటిలో 25 ప్రభుత్వ, 47 జిల్లా, మండల పరిషత్తు ఆధీనంలో నడుస్తున్నాయి. మరో 4 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. వీటిలో 97 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలోని 237 ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు గాను 5 పాఠశాలలు మాత్రమే వందశాతం ఉత్తీర్ణత పొందాయి. వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలల్లో నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 126 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. అందోల్ నియోజకవర్గంలోని మారు మూల ప్రాంతమైన రాయికోడ్ జడ్పీ హైస్కూల్‌లో 124 మంది విద్యార్థులకు గాను అందరూ ఉత్తీర్ణత పొందారు. మనూరు లాంటి వెనుకబడిన ప్రాంతంలో 103 మంది పరీక్ష రాసి అందరూ పాసు కావడం విశేషం. రేగోడ్‌లో 9 మంది హాజరవగా అందరూ పాసయ్యారు. ప్రైవేటు విద్య అందుబాటులో లేని, ఫీజుల మోత భరించలేని పేదలకు వరవూపసాదాలైన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఫలితాల్లోనూ రికార్డులు సృష్టిస్తూ ఉనికిని చాటుకుంటున్నాయి. ఈ ఫలితాలు ఒక్కరోజులో వచ్చినవి కావని ఫలితాలను గమనిస్తే అవగతమవుతుంది. రెండు మూడేళ్లుగా విద్యార్థులకు ప్రణాళిక బద్దంగా అందిస్తున్న బోధనతో ఆయా పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. సిబ్బంది కొరత, ఫర్నిచర్ లేమి, శిథిల భవనాల్లో చదువుకున్న విద్యార్థులు సాధించిన విజయమిది. వచ్చే ఏడు జిల్లాలోని అన్ని పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పటిష్ట ప్రణాళికతో మంచి ఫలితాలు సాధించిన పాఠశాలలను, విద్యార్థులు, సిబ్బందిని అభినందించడానికి కలెక్టర్ సురేశ్‌కుమార్, డీఈఓ రమేశ్ గురువారం సంగాడ్డిలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Other News