విత్తన విపత్తు
గజ్వేల్, జూన్ 13(టీమీడియా) : ఖరీఫ్ సాగుకు విత్తన సమస్య రైతుకు కొరకరాని కొయ్యగా మారింది. సబ్సిడీలో కోత విధించడమేగాకుండా విత్తనాలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖ పేరున్న కంపెనీల ఉత్పత్తులు సబ్సిడీపై సరఫరాకు దూరంగా ఉండగా, కొత్తకొత్త కంపెనీల ఉత్పత్తులు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. నామమావూతంగా విత్తనాలపై సబ్సిడీ పదింతలు చేసినప్పటికీ అవసరం మేరకు అందుబాటులో ఉంచకుండా రైతులను ప్రైవేట్ వ్యాపారులవైపు నెట్టుతుంది. దీంతో డిమాండ్ రకాలు బ్లాకు అమ్మకాలు జరుగుతుండగా, పేద, సన్న, చిన్నకారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకుండా పోయాయి.
ఖరీఫ్‌లో జిల్లాలో మొక్కజొన్న, వరి, పత్తి పంటల సాగు విస్తారంగా సాగుతుంది. ఈ మూడు పంటల సాగుకూడా తొలకరి సాగుకు విత్తనాలను నాటడం తెలిసిందే. ఇప్పటికే వరినాళ్లు పోసుకోవడం పనులు కొనసాగుతుండగా, మొక్కజొన్న, పత్తి సాగుకోసం దుక్కులను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఇంకా ఎక్కడ సాగుకు అనుకూలంగా వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు నాటే పనులు ప్రారంభం కాలేదు. బోర్లు, బావుల వద్ద సన్నరకం వరినార్ల పెంపకం పనులు జరుగుతున్నాయి. పత్తి, మొక్కజొన్న సాగు ఏర్పాట్లలో రైతులు తలమునకలయ్యారు. ఖరీఫ్‌లో జిల్లాలో సాగయ్యే సుమారు లక్ష ఎకరాల వరి సాగుకు 750 మెట్రిక్ టన్నుల వరి విత్తనాలు అవసరముంటుంది. ఏపీ సీడ్‌తో పాటు వివిధ ప్రైవేట్ కంపెనీల విత్తనాల సరఫరా జరుగుతుంది. ఏపీ సీడ్స్ స్టాకు కొరత బాగా ఉండడంతో, ప్రైవేట్ కంపెనీల విత్తనాలపై రైతులు ఆధారపడక తప్పలేదు. బీపీటీ 5204, ఎంటీయూ 1010, సురేఖ, ఐఆర్ 64 తదితర రకాలతో పాటు హైబ్రిడ్ రకాల విత్తన అమ్మకాలు బాగా జరుగుతున్నాయి.
మామూలు రకాలైతే ఎకరాకు 25 నుంచి 30 కిలోలు, రీసెర్చ్ రకాలైతే 10 కిలోలు, హైబ్రిడ్ రకాలైతే 2 నుంచి 3 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. మామూలు రకాలైన సన్నరకం 25 కిలోల బ్యాగు విత్తనాల ధర రూ. 550, దొడ్డువి 30 కిలోల బ్యాగు ధర రూ. 500 వసూలు చేస్తుండగా, రీసెర్చ్ బస్తాపై రూ. 300ల నుంచి రూ. 400, హైబ్రిడ్ 3 కిలోల బస్తాకు రూ. 500 నుంచి రూ. 700లు వసూలు చేస్తున్నారు.
మొక్కజొన్నపై తగ్గిన సబ్సిడీ
మొక్కజొన్న సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యే మెదక్ జిల్లా రైతుకు సబ్సిడీ తగ్గించడంతో మరింత విత్తన భారం పెరగనుంది. గత సంవత్సరం కిలో విత్తనంపై రూ. 25 సబ్సిడీ ఉండగా, ఈ సారి రూ. 13 తగ్గించి కిలోపై 12 రూపాయలు వర్తింప జేస్తున్నారు. తద్వారా 5 కిలోల బ్యాగుపై రైతుకు 60 రూపాయలు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. ఈ సబ్సిడీ కోసం మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయాధికారి దృవీకరణతో క్యూలో నిలబడి విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పైగా ప్రధాన మొక్కజొన్న కంపెనీ అయిన పయనీర్, మోన్‌శాంటో రకాలు సబ్సిడీపై ఇవ్వకపోవడంతో అనేకమంది రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికీ పలు మండలాల్లో మొక్కజొన్న విత్తన విక్రయ కేంద్రాలు ప్రారంభం కాకపోగా, మరికొన్ని మండలాల్లో రెండు, మూడు కంపెనీలకు చెందిన రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
బ్లాక్‌లోనే పత్తి విత్తనాలు
జిల్లాలో పత్తి విత్తనాల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. గత వారం రోజులుగా విజిపూన్స్, వ్యవసాయశాఖ అధికార బృందాలు ఆకస్మిక దాడులు జరిపి విత్తన దుకాణ తనిఖీ, శాంపిల్స్ సేకరణ లాంటి చర్యలు చేపట్టినా చీకటి వ్యాపారం మాత్రం అదుపులోకి రాలేదు. మైకో ఎమ్మార్సీ 7351తో పాటు అదే కంపెనీకి చెందిన మరికొన్ని రకాలు ఇంకా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ. 950 కాగా, ఆయా కంపెనీల బ్రాండ్‌లను బట్టి రూ. 1500ల నుంచి రూ. 2600ల వరకు విక్రయిస్తున్నారు. కొంతమంది రైతులకు ఎమ్మార్పీ ప్రకారం బిల్లులు ఇస్తుండగా, మరికొందరికి బిల్లులు ఇవ్వకుండా బినామీ పేర్లపై డీలర్లు బిల్లులు చేస్తున్నారు.
నామమావూతంగా రాయితీలు
ప్రభుత్వం విత్తనాలపై నామమావూతపు సబ్సిడీని పరిమితం చేసింది. ఇప్పటికే కాంప్లెక్స్ ఎరువులపై సబ్సిడీ బాగా తగ్గించగా, విత్తనాలపై ఇచ్చే కొద్దిపాటి సబ్సిడీని కూడా ఎత్తివేసే ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఎకరా వరి విత్తనంపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తుండగా, కేవలం ఏపీ సీడ్స్‌కు చెందిన బీపీటీ, ఎంటీయూ 1010 రకాలకు మాత్రమే వర్తింపజేసింది. ఈ విత్తనాల స్టాకు ఎక్కడా సరిగ్గా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ రకాలను కొనుగోలు చేయకతప్పలేదు. మొక్కజొన్న విత్తనాలపై సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం తగ్గించింది. 5 కిలోల బ్యాగుపై కేవలం 60రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తుండగా ఎకరా సాగుచేసే రైతుకు రూ. 0వరకు సబ్సిడీ పొందే వీలుంది. ఈ క్రమంలో అనేకమంది రైతులు సబ్సిడీపై ఆసక్తి చూపడం లేదు. పత్తి విత్తనాలు ఎమ్మార్పీ ధరలకు అమ్మకుండ అధిక మొత్తంలో వసూలు రైతుకు రాయితీలు వర్తించడం కాదు కదా అసలు రేటుకు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
Other News