Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  General News
ఆ నలుగురు

-ఇసుక తరలింపులో రి(కి)ంగ్ మాస్టర్లు
-అధికారులకు అందుతున్న మామూళ్లు
-పోలీసులు, రెవెన్యూ శాఖలో వారిదే చెల్లు
-రాజకీయ అండతో ఇసుక మాఫియా

కల్వకుర్తి, టీ మీడియా :వంగూరు మండలం డిండిచింతపల్లి గ్రామ సమీపంలో దుందుభీ వాగు విశాలంగా పారుతుంటుంది. డిండి ప్రాజెక్టు వెనుక భాగాన డిండిచింతపల్లి గ్రామంతో పాటు, మరికొన్ని గ్రామాలుంటాయి. డిండి ప్రాజెక్టులో నిండుగా నీరు ఉంటే.. చింతపల్లి వరకు వెనుక జలాలుంటాయి. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గితే... దాదాపు 10మీటర్ల ఎత్తున ఇసుక ఉంటుంది. ఆ ఇసుకకు హైద్రాబాద్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇసుక సన్నగా, రాళ్లు లేకుండా నాణ్యతతో ఉంటుంది. జల్లి పట్టాల్సిన అవసరం లేదు. ఇంత వరకు చుట్టు పక్కల గ్రామాల వారు తమ నిర్మాణ అవసరాల నిమిత్తం ట్రాక్టర్లతో ఇసుకను తెచ్చుకునేవారు. ఇది రాను రాను వ్యాపారంగా మారింది. ప్రభుత్వం వాల్టా చట్టం ఆధారంగా ఇసుకపై నిషేధం విధించడంతో ఇసుక సరఫరాపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి డిండిచింతపల్లి గ్రామంలో ట్రాక్టర్లు కలిగిన కొంత మందికి ఇది వరంగా మారింది. ఆ గ్రామానికి చెందిన వారే కొందరు తమ ట్రాక్టర్లలో ఇసుకను నింపుకొని కల్వకుర్తి, తదితర గ్రామాల్లో విక్రయించేవారు. అలా తరలించిన వారిలో ఆ నలుగురు కూడా ఉన్నారు. కొంచెం ఆర్థికంగా బలోపేతం కాగానే రాజకీయ అండ ఏర్పరుచుకున్న ఆ నలుగురు ప్రస్తుతం ఇసుక మాఫియాను శాసించేస్థాయికి వచ్చారు. పోలీసులు, రెవెన్యూ శాఖతో వారికి సత్ససంబంధాలు మెండుగా ఉన్నాయి.

హైద్రాబాద్‌కు తరలించేందుకు ఇసుక డంప్‌లు
రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్న ఆ నలుగురు ఇప్పుడు హైద్రాబాద్ ఇసుక మాఫియాతో చేతులు కలిపారు. వాగు నుంచి ఇసుక తీసి వ్యవసాయ పొలాల్లో డంప్‌లు పోసి లారీలకు ఎక్కించారు. ఇది దాదాపుగా నాలుగు, ఐదు నెలలుగా జోరుగా సాగుతోంది. ఆ నలుగురితో స్నేహంగా మెదిలే మరికొంతమంది ఇసుకను డంప్‌లు పోయడం, లారీలకు ఎక్కించడం పరిపాటిగా మారింది. ఒక్కో లారీ నిండా ఇసుక నింపితే.. ట్రాక్టర్ వారికి రూ.12వేల నుంచి రూ.14వేల వరకు గిట్టుతాయి. రూ.3వేల వరకు ఖర్చులు పోయినా రూ.10వేల వరకు ఖచ్చితంగా మిగులుతాయి. ఈ మధ్య కాలంలో గ్రామంలో కొందరు రైతులు ఇసుక తరలడాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆ నలుగురు రంగంలోకి దిగి ఇసుక మాఫియాతో రైతులను బెదిరింపజేశారు. దీంతో రైతులు ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వెనుకంజ వేశారు. ఈ సంఘటన గ్రామంలో కొంచెం ఉద్రిక్తతను రేకెత్తించింది. దీంతో తమకెందుకులే అన్నట్లు ఉండడంతో పోలీసులు సైతం ఇదే తరుణమని ఇసుకను రవాణాను అడ్డుకోవడాన్ని వదిలేశారు.

పుట్టగొడుగుల్లా ఇసుక ట్రాక్టర్లు
ఇప్పటి వరకు గ్రామంలో 30నుంచి 4కైటాక్టర్లు ఉంటే రైతులు అడ్డు చెప్పకపోవడంతో వాటి సంఖ్య 80కి చేరుకుంది. ఆ నలుగురు, మరి కొందరికి సంబంధించిన వారి ఇసుక ట్రాక్టర్ల యాజమానుల డ్రైవర్లు కొత్తగా ట్రాక్టర్లు తెచ్చుకున్నారు. కొందరు కొనుగోలు చేస్తే...ఇంకొందరు లీజ్‌కు తెచ్చుకున్నారు. రెండు నెలలు ట్రాక్టర్ డబ్బులు తీర్చేయవచ్చనే ఉద్దేశంతో తెచ్చుకున్న ట్రాక్టర్లతో వారం రోజుల పాటు విపరీతంగా వాగు నుంచి ఇసుకను తోడారు.

అకస్మాత్తుగా ఆగిన ఇసుక అక్రమ రవాణా
నాలుగు రోజులుగా ఇసుక అక్రమ రవాణా ఆగిపోయింది. వాగులోకి ట్రాక్టర్లు వెళ్లడం లేదు. హైద్రాబాద్ నుంచి లారీలు రావడం నిలిచిపోయాయి. అందరు ఆశ్చర్యపోయారు. అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారేమో, అందుకే ఇసుక రవాణా ఆగిపోయిందని అనుకున్నారు. అసలు విషయం అది కాదు.. అందరు విచ్చలవిడిగా ఇసుకను తోడి లారీలకు అందిస్తే ఐదారు నెలల్లో వాగు ఖాళీ అయిపోతుందని, ఆ తర్వాత తమ బతుకేందని భావించిన ఆ నలుగురు తమ పరపతిని ఉపయోగించారు. ఇసుక లారీలు వాగు వద్దకు రావద్దని హుకుం జారీ చేశారు.

తాము పోసిన డంప్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీసుకుపోవాలని, లేని పక్షంలో లారీలను పోలీసులకు అప్పగిస్తామని బెదిరిం చారు. పోలీసులకు కూడా తమవి కాకుండా వేరే ట్రాక్టర్లు, లారీలు వచ్చిన పట్టుకొని సీజ్ చేయాలని చెప్పారట. గ్రామంలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి వాగులోకి ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. అధికారులు మాత్రం తాము చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. గట్టి నిఘా పెట్టడంతో లారీలు రావడంలేదని పత్రిక ప్రకటనలు ఇస్తున్నారు.

ఎవరాగిన... ఆ నలుగురు ఆపర
ప్రస్తుతం డిండిచింతపల్లి దుందుభీ వాగు నుంచి ఆ నలుగురు యథేచ్ఛగా ఇసుకను తీస్తున్నారు. కల్వకుర్తికి ఇసుకను నేరుగా తరలిస్తున్నారు. ప్రస్తుతం లారీలు రాకపోవడంతో ఇసుకను డంప్‌లుగా పోయకుండా వాగు నుంచి నేరుగా కల్వకుర్తికి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈ విషయమై కొందరు యువకులు ఆ నలుగురిలో ఒకరికి చెందిన ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులపై ఒత్తిడి తెచ్చి పట్టించారు. అప్పటికే అందులో ఉన్న ఇసుకను ఖాళీ చేశాక, కాలి ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. రాత్రి అయ్యేలోపే వదిలేశారు. ఈ విషయమై పోలీసులను అడిగితే... అబ్బే అదేంలేదంటూ... నీళ్ళు నమిలారు. ప్రస్తుతం డిండిచింతపల్లి వ్యవసాయ పొలాల్లో ఆనలుగురికి చెందిన డంప్‌లు చాలా ఉన్నాయి.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd