Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  General News
ప్రాజెక్టు ఆయకట్టుపై నీలి నీడలు

ధరూర్, టీ మీడియా: గతేడాది జూలై 22న జూరాల ప్రాజెక్టునుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. కొంత ఆలస్యమైనప్పటికీ రైతులు ఆయకట్టుకు నీరు వదలడంతో ముమ్మరంగా ఖరీఫ్ సేద్యాన్ని ప్రారంభించి మంచి దిగుబడులు పొందారు. కాని ఈ సంవత్సరం జూలై 22 గడిచినా జలాశయానికి ఇన్‌ఫ్లో లేదు. దీంతో నీటి విడుదలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. గతేడాది జూరాల గేట్ల మరమ్మతుల కోసమంటూ ప్రాజెక్టులోని నీటిని వదిలి ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి అధికారులు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ వెంటనే వర్షాలు సమృద్ధిగా కురిసి భారీగా వరదలు వచ్చి ప్రాజెక్టులోకి నీరు చేరడంతో నీటిని వదిలి అధికారులు విమర్శలనుంచి బయటపడ్డారు. కాని ఈ ఏడాది జూరాల ప్రాజెక్టు పరిస్థితి దృష్ట్యా మరొక పది రోజులు గడిస్తే కాని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు. స్థానిక వర్షాలు సైతం కురవకపోవడంతో ప్రాజెక్టులో ఒక మీటర్ నీటి మట్టం కూడా పెరగలేదు. రెండు మూడు రోజులుగా ఎగువన ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో ప్రారంభమైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు.

కర్ణాటక వైపు ఎదురుచూపులు
కర్ణాకటలోనూ మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర కరువు, వర్షాభావ పరిస్థితులతో కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు సైతం వట్టిపోయాయి. ఈ తరుణంలో కర్ణాటక సైతం మహారాష్ట్రలో కురిసే భారీ వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా డెడ్‌స్టోరేజీలోకి వెళ్లడం ఆ ప్రాంత నీటి పారుదల శాఖ అధికారులను, రైతులను కలవర పెట్టింది. జూరాల ఆయకట్టుకు రబీ సీజన్‌లో నీటి కొరత ఏర్పడి కనీసం 5టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను తమ పరిస్థితే ఇబ్బందికరంగా ఉందంటూ బుట్టదాఖలు చేసింది. రెండు ప్రాజెక్టులకు కలిపి సుమారు 100 టీఎంసీల నీరు అవసరమున్నట్లు ఆ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితితో గత 15రోజుల క్రితం ఆల్మట్టికి స్వల్ప ఇన్‌ఫ్లోలు ప్రారంభమై మందగించగా, తిరిగి మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు తిరిగి రెండు రోజులుగా వరద ఉధృతి పెరిగినట్లు పేజీపీ అధికారులకు సమాచారం అందింది. ఇదే ఉధృతి అదే స్థాయిలో కొనసాగితే మరో పక్షం రోజుల వరకు రెండు ప్రాజెక్టులు నిండడానికే సరిపోయే పరిస్థితి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 313.45మీటర్ల స్థాయిలో ఉంది. స్థానికంగా భారీ వర్షాలు కురిసి ఈ రెండు, మూడు రోజుల్లో జలాశయం నీటిమట్టం గణనీయంగా పెరిగితే కనీసం నారుమడులకు నీరు వదిలే యోచనలో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక జలాశయాల్లో జలకళ త్వరగా సంతరించుకుని కర్ణాటక బంధనాలు తెంచుకుని కృష్ణమ్మ ఆంధ్ర వైపు బిరబిరా తరలిరావాలని ఆయకట్టు రైతులు ఆకాంక్షిస్తున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd