Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  General News
ఏరువాక వచ్చి పాయెఏరన్న రాకపాయె

వర్షాలు ఆలస్యం కావడం, ఎగువ ప్రాంతం నుంచి నీరు రాకపోవడం వల్ల జూరాల ప్రాజెక్టు పరిధిలో ఖరీఫ్ సాగు అదును దాటి పోతోంది. దీంతో రైతులు అక్కడక్కడ ఉన్న వ్యవసాయ బోరుబావుల కింద కొద్ది మాత్రంగా నారు పోస్తున్నారు. ఆ మాత్రం అవకాశం లేని రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆకాశానికేసి ఎదురు చూస్తున్నారు. జూరాల పరిస్థితి ఇలా ఉంటే ఎగువ ఉన్న నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇందుకు తీసిపోలేదు. ఈ కారణంగా వర్షాలు వచ్చినా ఖరీఫ్ దిగుబడులు తగ్గుతాయని, రబీపై కూడా ఈ ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- జూరాలలో డెట్ స్టోరేజి దాటని జలాశయ నీటిమట్టం
- కర్ణాటక ప్రాజెక్టుల పరిస్థితి కూడా అధ్వానమే
- దిగుబడులు, రబీ ఆయకట్టుపై ప్రభావం


ధరూర్, టీ మీడియా : ఏరువాక వస్తే ఏరొస్తుందన్న నానుడి జూరాల ప్రాజెక్టు కృష్ణానది వద్ద నాలుగైదు ఏళ్లుగా గతి తప్పుతూ వస్తోంది. ఏరువాక వెళ్లి నెల రోజులు గడుస్తున్నా ఏరు జాడ మాత్రం కనుచూపు మేర కనిపించడం లేదు. అడుగంటిన కృష్ణమ్మ తిరిగి పరవళ్లు తొక్కే సమయం కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గత రబీ కష్టాలను, చేదు అనుభవాలను రైతులు మరిచిపోయేలా కొత్త ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుందని రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా వరుణ దేవుడు మాత్రం కనుకరించడం లేదు. ముఖ్యంగా కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రాజెక్టు అయిన జూరాలలో గతంలో మునుపెన్నడూ నీటి కొరత ఉండేది కాదు. కాలక్రమేణ ఎగువన జలచౌర్యం అధికం కావడం, వచ్చే కాస్త నీరు కర్ణాటక రైతుల చేతిలో బందీ అయి జూరాలకు నీటి కష్టాలు వస్తున్నాయి. ఈ పరిస్థితితోనే ఈ ఏడాది మార్చి నెల నుంచే ఇన్‌ఫ్లో తగ్గిపోయి ప్రాజెక్టు అడుగంటింది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడస్తున్నా వర్షాలు సంవృద్ధిగా లేకపోవడంతో ప్రాజెక్టు అడుగంటి చెరువును తలపిస్తోంది.

ఈ ఏడాది ఆలస్యమే
గడిచిన మూడేళ్లుగా ఆయకట్టుకు నీటి విడుదల ఆలస్యమవుతోంది. ఈ ప్రాజెక్టు నీటిమట్టం దృష్ట్యా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన ఏడాది గేట్ల మరమ్మత్తుల కోసం నీటిని దిగువకు వదిలి చేతులు కాల్చుకున్న అధికారులకు ఎట్టకేలకు భారీ వర్షాలు, ఎగువ నుంచి వరదలు ఏకకాలంలో రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకొని జూలై 22న నీటిని విడుదల చేశారు. కాని ప్రస్తుతం జలాశయం పరిస్థితుల్లో నీటి విడుదలకై అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 313.20 మీటర్ల స్థాయిలో ఉండగా, 3.147 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డెడ్ స్టోరేజిలో ఉన్న జూరాల ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల జరగాలంటే మరో 6నుంచి 7టీఎంసీల నీరు ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిసి జలాశయానికి చేరాలి. లేదా కర్ణాటక ప్రాజెక్టు నుంచి వరద వస్తే కాని ఆయకట్టుకు నీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొన్నది.

నారుకు నీరు కరువు...పత్యామ్నాయాలపై రైతుల దృష్టి
అడుగంటిన జలాశయం ద్వారా కనీసం నారుమడులు పెంచుకోవడానికే నీరు కరువైంది. ప్రాజెక్టు నీటిమట్టం 316.00 మీటర్ల స్థాయిలో ఉన్నా నారుమడులకు నీరు వదిలేవారమని పీజేపీ అధికారులు చెబుతున్నారు. కాని ప్రస్తుతం వరదలు వచ్చి జలాశయం నిండితే కాని నారుమడులు పెంచుకోవడానికి నీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ తరుణంలో జలాశయ పరిస్థితి దృష్ట్యా రైతులు ముందుచూపుతో కొన్ని చోట్ల ప్రత్యామ్నాయంగా మడులు పెంచుకుంటున్నారు. సమీపంలోని వ్యవసాయ, బోరు బావులు, నీటి వసతి ఉన్న బంధువుల వ్యవసాయ పొలాల దగ్గర మడులు సిద్ధం చేసుకుంటున్నారు. సాధారణంగా ఆయకట్టు రైతులు బీపీటీ-5204 సోన వరి వంగడాన్ని సాగు చేస్తారు. ఆయకట్టుకు నీరు వదిలిన వెంటనే దమ్ములు చేసి నాట్లు సకాలంలో వేసుకోవచ్చని రైతుల ఆలోచన. రేవులపల్లి, బీంపురం, పెద్దపాడు గ్రామాలతోపాటు, జలాశయం బ్యాక్ వాటర్ ఆధారితంగా నదీ తీర ప్రాంత ఆయకట్టు రైతులు నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు.

దిగుబడులపై ప్రభావం
ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా రైతులు మృగశిర, ఆరుద్ర కార్తెలలో నారుమడులు పెంచి జూలై 15 నుంచి ఆగస్టు మొదటి వరకు నాట్లు పూర్తయితే మంచి దిగుబడులు వస్తాయని రైతుల నమ్మకం. కాని ప్రస్తుతం జూరాల కింద నీటి విడుదలపై స్పష్టత లేదు. ఈ తరుణంలో జూలై 3వ, చివరి వారం వరకు జలాశయం పరిస్థితిలో మార్పు వచ్చి నీరు వదిలినా అప్పటికీ నారుమడులు పెంచి నాట్లు వేసే సమయానికి ఆగస్టు చివరి వారం వస్తుందని రైతులు చెబుతున్నారు. అప్పుడు నాట్లు అదును తప్పడంతో దోమపోటు, చలి పిడుగు ప్రభావంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని రైతుల ఆవేదన. దీంతోపాటుగా రబీ ఆయకట్టు సాగు ఆలస్యమవుతోంది.

కర్ణాటక ప్రాజెక్టులదీ అదే పరిస్థితి
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల పరిస్థితి దాదాపుగా జూరాల ప్రాజెక్టును తలపిస్తోంది. ఆల్మట్టి నీటిమట్టం 519.06 మీటర్ల పూర్తి స్థాయి నీటిమట్టం కాగా, ప్రస్తుతం 506.04మీటర్ల స్థాయిలో ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కావాలంటే మరో 42టీఎంసీల నీరు అవసరమవుతుంది. దీంతోపాటుగా దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుది అదే పరిస్థితి. 492.00 మీటర్లు పూర్థి స్థాయి కాగా 485.70 మీటర్ల స్థాయిలో నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్టుకు మరో 38 టీఎంసీల నీరు వస్తే కాని నిండని పరిస్థితి ఉన్నదని జూరాల అధికారులు తెలిపారు. ఈ పరిస్థితితోనే నారాయణపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. ఆ ప్రాజెక్టుల క్యాచ్‌మెట్ ఏరియాలో కూడా భారీ వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd