అన్నదాత ఆగ్రహం
సీడ్‌పత్తి పంట పూత, సుంకునకు నోచుకోకపోవడంతో నడిగడ్డ రైతులు గురువారం జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. సీడ్ కంపెనీల ఆర్గనైజర్లపై చర్యలు తీసుకొని, తమకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తమకు పరిహారం చెల్లించే వరకు ఆందోళన విరమించేదిలేదని కూర్చున్నారు. కాని పోలీసులు దురుసుగా ప్రవర్తించి రైతులను చెదరగొట్టారు. మూడు గంటలపాటు సాగిన రాస్తారోకోతో జాతీయ రహదారి స్తంభించింది. వందలాది మంది రైతులు ఆందోళనలో పాల్గొన్నారు.
- జాతీయ రహదారి దిగ్బంధం
- ఆర్గనైజర్లను అరెస్టు చేయాలని సీడ్‌పత్తి రైతుల ధర్నా
- 3గంటలకుపైగా సాగిన ధర్నా, భారీగా స్తంభించిన ట్రాఫిక్
- లాఠీలు ఝులిపించిన పోలీసులు, రాళ్లు రువ్విన రైతులు
- ఎర్రవల్లి చౌరస్తాలో ఉద్రిక్తం
ఇటిక్యాల, టీ మీడియా : సీడ్‌పత్తి పంటలో పూత, సుంకు(పుప్పొడి) రావడంలేదని రైతులు గురువారం అఖిలపక్షం పిలుపు మేరకు ఎర్రవల్లి చౌరస్తాలోని 44వ జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా దాదాపు 500 మంది రైతులు ఉదయం 10గంటల నుంచే ఎర్రవల్లికి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. వీరికి మద్దతుగా పీసీసీ ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, వైఎస్సార్ పార్టీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, బంగిలక్ష్మణ్, జేఏసీ నాయకులు మధుసూదన్‌బాబు, దండోరా నాయకులు ప్రసాద్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. రాస్తారోకోలో నాయకులు, రైతులు మాట్లాడుతూ సీడ్‌పత్తి నకిలీ విత్తనాలు అంటగట్టిన ఆర్గనైజర్లను అరెస్టు చేయాలని, నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గంటగంటకు రైతుల సంఖ్య పెరిగి ధర్నా కార్యక్రమం ఉధృతమైంది. వీరిని ఉత్సాహపరుస్తూ జక్కల కిష్టన్న బృందం ఆటపాటలతో రైతుల కష్టాలు వివరించింది. ఒక దశలో పోలీసులు రైతులను తోసుకుంటూ జేఏసీ నాయకులను అరెస్టు చేసి జీపులో కూర్చోబెట్టినా మూకుమ్మడిగా పోలీస్ వాహనం టైర్లలో గాలి తీసివేసి వాహవాన్ని అడ్డగించి నాయకులను విడిపించి తీసుకెళ్లి రోడ్డుపై కూర్చొబెట్టారు. వీరిని అదుపులో పెట్టడానికి గద్వాల, ధరూర్, ఇటిక్యాల, కోదండాపురం పోలీస్‌స్టేషన్‌లకు చెందిన ఎస్‌ఐలు, పదో బెటాలియన్‌కు చెందిన పోలీస్ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా రైతులు ధర్నా కార్యక్రమాన్ని విరమించలేదు. ఆర్డీఓ వచ్చి తమ సమస్యలకు పరిష్కారం చూపేంతవరకు ఆందోళన విరమించేది లేదని మొండికేశారు. అగ్రికల్చర్ ఏడీఎ చంద్రశేఖర్‌రెడ్డి, ఇటిక్యాల తహశీల్దార్ బెంజిమన్ తదితరులు వచ్చి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వాతావరణం చల్లబడిన తరువాత సుంకు వస్తుందని ఎంతగా నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది.
గద్వాల సీఐ నర్సింహులు, అలంపూర్ సీఐ మహంకాళి అక్కడికి చేరుకుని రైతులపై లాఠీచార్జి చేసి రోడ్డుపై నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి ధర్నాను భగ్నం చేశారు. అసహనంతో ఉన్న రైతులు తమకు అందుబాటులో ఉన్న రాళ్లను పోలీసులపై రువ్వారు. ఉదయం నుంచి తాము రాస్తారోకో చేస్తున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 3గంటలకుపైగా సాగిన రాస్తారోకోతో అటు, ఇటు 10కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Other News