Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  General News
వ్యవసాయం..‘వ్యయ’భారం

మహబూబ్‌నగర్, టీ మీడియా ప్రతినిధి : వ్యవసాయం రైతులకు శాపంగా మారింది. జిల్లాలో మూడేళ్లుగా వర్షాలు సవృద్ధిగా కురవక సాగు చేసిన అరకొర పంటలు ఎండిపోవడం, భారీగా పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోవడంతో అన్నదాతలు అప్పులపాలయ్యారు. పెరిగిన పెట్టుబడులు, ఎరువులు, విత్తనాల ధరలతో సాగు చేయాలం రైతులు జంకుతున్నారు. మూడేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆరుగాలం కష్టపడి పది మందికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు నేడు ఆ అన్నమే కరువైంది. వరుస కరువుతో జిల్లా రైతాంగం కుదేలైంది. ఈ ఏడాది వర్షాలు సవృద్ధిగా కురిసినా సాగు చేయలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు.

సాగుకు అవసరమయ్యే అన్నింటి ధరలు ఆకాశంలో ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు, కూలీ ధరలు రెండింతలు పెరిగాయి. ఇంత వ్యయాన్ని ఓర్చి పంటలు సాగు చేసినా చివరికి చేతికి వస్తాయనే నమ్మకంలేదు. అయినా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్న రైతాంగానికి సాగు చేయడం తప్పని పరిస్థితిగా మారింది. జిల్లాలో ఏటా రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. గత ఏడాది పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు మంజూరై నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా చాలా మంది రైతులకు అందలేదు. ఇప్పటివరకు రూ.125 కోట్లు ట్రెజరీ నుంచి విత్‌డ్రా చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు బ్యాంకుల్లో ఖాతాలు తెరవక పోవడంతో ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయలేదని అధికారులు చెబుతున్నారు.

బ్యాంకుల్లో జీరో ఖాతా తెరవాలని ప్రభుత్వం సూచిస్తే అందుకు బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. నేటికీ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందక పోవడంతో ప్రస్తుత ఖరీఫ్‌లో సాగుకు అయ్యే ఖర్చు చేతిలో లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఉన్న కాస్త పెట్టుబడితో సాగు చేద్దామన్నా పెరిగిన ధరలు రైతులను భయవూబాంతులకు గురిచేస్తున్నాయి. గత ఏడాది ఎకరా పంట సాగుకు రూ.15 నుంచి 20 వేల వరకు ఖర్చు అయ్యింది. ఈ ఏడాది పెరిగిన ధరలతో రూ.20 నుంచి 25 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇంత పెట్టుబడి పెట్టి సాగు చేసినా ప్రకృతి కరుణించక పోతే పంట చేతికి రావడం కష్టమే అవుతుంది. ఈ పరిస్థితిలో రైతులకు వ్యవసాయం భారంగా మారింది.

వ్యవసాయంపై ‘ఉపాధి’ భారం

పేదలకు వంద రోజులు పనికల్పించి వలసలను నివారించేందుకు ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం రైతులు పాలిట శాపమైంది. కూలీలకు ప్రభుత్వమే పని కల్పించడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత ఏర్పడి వ్యవసాయం భారంగా మారింది. ప్రభుత్వం ఉపాధి కూలీలకు రోజుకు రూ.130 నుంచి 150 వరకు అందజేస్తోంది. ఈ కూలికే అలవాటు పడిన కూలీలు ఇతర పనులపై దృష్టి పెట్టడం లేదు. దీంతో కూలీలు అధికంగా అవసరమయ్యే వ్యవసాయానికి కూలీల కొరత తీవ్ర మైంది. ఒకవేళ కూలీలు వచ్చినా ఉపాధి పథకంలో ఇచ్చిన విధంగా కూలి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రైతులు కూడా ఇదే విధంగా కూలి ఇస్తే సాగు మొత్తం కూలీలకే సరిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఉపాధి పథకం మంచిదే అయినా ఆ కూలీలను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వ్యవసాయ పనులకు కూడా కూలీల కొరత తీరుతుంది.

అటు కూలీలకు పని దొరకడం. ఇటు వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని రైతులు భావిస్తున్నారు. కూలీల భారం కొంత తగ్గినా సాగుకు కొంత మేరకు ఖర్చు తగ్గుతుందని రైతులు అంటున్నారు. విత్తన, ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రభుత్వం ఉపాధి కూలీలను వ్యవసాయ పనులు ఉప యోగపడే విధంగా చర్యలు తీసుకుంటే రైతులపై కొంత భారం తగ్గించే అవకాశముంది. లేకుంటే వ్యవసాయం చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd