తొలకరి పలకరింపు
- జిల్లాను తాకిన రుతుపవనాలు
- అక్కడక్కడా కురిసిన ఓ మోస్తరు వర్షం
- అదును కోసం ఎదురుచూస్తున్న రైతులు
- ఇక విత్తనాలు వేయడంలో రైతన్న బిజీబిజీ
తొలకరి పలకరించింది. పుడమితల్ల పులకరించింది. వానల కోసం ఎదురుచూస్తున్న రైతన్న మోములో మురిపం కనిపించింది. జిల్లాలో సగం భాగం మాత్రమే ఓ మోస్తరు వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించడం మూలంగా ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్మి ఉంది. పొలాలు చదును చేసుకున్న రైతులు వరుణుడి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుండగా ఈ జల్లులు కురిశాయి. ఇక నేటినుంచి రైతులు విత్తనాలు వేసే పనిలో బిజీబిజీ అయిపోతాడు. రుతుపవనాలైతే వచ్చాయికాని, ఎంత వరకు భారీ వానలు కురిసేందుకు దోహదపడతాయి.. పంటల సాగుకు ఉపయోగపడతాయో చూడాల్సిందే.
మహబూబ్‌నగర్, టీ మీడియా ప్రతినిధి :తొలకరి పలకరించడంతో పుడమితల్లి పులకరించింది. ఇంతకాలం ఎదురు చూస్తున్న రుతుపవనాలు ఆదివారం జిల్లాను తాకాయి. 15 రోజుల క్రితం కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు ఇంత ఆలస్యంగా జిల్లాకు చేరుకున్నాయి. దీంతో జిల్లాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిశాయి. జిల్లాలో జిల్లా కేంద్రంతోపాటు నారాయణపేట, గద్వాల, వనపర్తి, దేవరకద్ర, షాద్‌నగర్, జడ్చర్ల తదితర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడింది. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపించిందే తప్ప వర్షం కురియలేదు. వర్షం రాకతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. జూన్ మొదటి వారంలో వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ పంటలకు అనువుగా ఉంటుంది. రోహిణి, మృగశిర కార్తేల్లో విత్తనాలు విత్తితే పంటలకు తెగుళ్లు సోకవని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో పంటల దిగుబడి కూడా అధికంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. జూన్ మొదటి వారంలో జిల్లాలో 20 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాలి. నిన్నటి వరకు మిల్లీమీటర్ కూడానమోదు కానందున ఖరీఫ్ పంటల సాగు ప్రశ్నార్థకమైంది. ఇప్పటికే విత్తనాలు విత్తేందుకు అదును దాటిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో విత్తనాలు ఆలస్యంగా విత్తుకుంటే పంటకు తెగుళ్లు అధికంగా సోకి ఖర్చు అధికమవుతుంది.
ఇంత ఖర్చు చేసి పంటలను కాపాడినా దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. వర్షాలు కురవక పోవడంతో రైతులు నేటివరకు కూడా నారుమళ్లు పోసుకోలేదు. జిల్లా భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. దీంతో రైతులు బోరు బావుల కింద కూడా నారుమళ్లు పోసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇది వరకే వ్యవసాయ శాఖ జిల్లాలో 13,500 క్వింటాళ్ల బీపీటీ రకం వరి విత్తనాలను సరఫరా చేసింది. 25 కేజీల బస్తాకు రూ. 550ఉంటే అందులో రూ.150 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఈ మేరకు రైతులు ఈ విత్తనాలకు తీసుకెళ్లి నిలువ ఉంచుకున్నారు. వర్షాలు మొదలైతేనే నారుమళ్ల పోసేందుకు సమాయత్తమవుతారు. అన్ని పంటలకు గానూ జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే వేల మెట్రిక్ టన్నులు ఎరువుల డీలర్ల వద్ద పంపిణీ చేస్తున్నారు. మిగతా 27 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు గోదాముల్లో నిలువ ఉంచారు. సకాలం వర్షాలు కురిస్తే జిల్లా మొత్తం7.25 లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పత్తి పంటను 3.50 లక్షల హెక్టార్లలో సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వరిని 1.50 లక్షల హెక్టార్లలో సాగు చేయనున్నారు. 50 వేల హెక్టార్లలో జొన్న, 90 వేల హెక్టార్లలో ఆముదం పంటను సాగు చేయనున్నారు. విత్తనాలు, ఎరువులు ఈ ఖరీఫ్‌కు సరిపడా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సకాలంలో విత్తనాలు విత్తేందుకు ఇంకా వారం పది రోజుల సమయం మాత్రమే ఉందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటు న్నారు. రుతుపవనాల తీవ్రత అధికంగా ఉంటే జిల్లాలో రెండు మూడు రోజుల్లో విత్తనాలు విత్తడం పూర్తి అవుతుంది. ఈ సమయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకు రైతన్నల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Other News