Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  General News
‘ఉపకార’ యాతన

- అవసరం రూ.47.26 కోట్లు
-విడుదల రూ.25.39 కోట్లు
-ఇబ్బందుల్లో విద్యార్థులు


మహబూబ్‌నగర్ అర్బన్, టీ మీడియా : ఉపకారవేతన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అధికారుల నిర్లక్ష్యం.. నిధుల కొరత వల్ల విద్యార్థులకు ఉపకార వేతనాలు, పీజు రీయంబర్స్‌మెంట్ సకాలంలో అందడం లేదు. విద్యాసంవత్సరం పూర్తై మరో విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంకా ప్రభుత్వం సగం నిధులు కూడా మంజూరు చేయలేదు. కళాశాలల యాజమాన్యాల నుంచి విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉపకార వేతనాలకు విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించేందుకు సహాయ సంక్షేమశాఖల అధికారులు, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లనే వెరిఫికేషన్ అధికారులుగా నియమించినప్పటికీ కళాశాలల ప్రిన్సిపాళ్ల నిర్లక్ష్యం కారణంగా వెరిఫికేషన్ కూడా సకాలంలో పూర్తి కాలేదు. ఇంకా చాలా మంది విద్యార్థుల దరఖాస్తులు కళాశాలల్లోనే ఉండటం గమనార్హం. ఫీజులు అందక ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న చాలా మంది విద్యార్థులు యాజమాన్యాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించేందుకు రూ. 47.26 కోట్లు అవసరమని కమిషనర్ కార్యాలయానికి ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపితే కేవలం రూ.25.39 కోట్లు విడుదల చేశారు. చాలీచాలని నిధులు రావడంతో గత విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలే విద్యార్థులకు పూర్తి స్థాయిలో చెల్లించని పరిస్థితి ఉన్నది.

వివిధ శాఖల పరిస్థితి ఇలా..
2011-12 విద్యాసంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిల్లో ఆయా వర్గాలకు చెందిన సుమారు 90 వేల మందికి పైగా విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 21 వేల మంది కొత్త, పాత విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి వందశాతం ఉపకార వేతనాలు మంజూరు చేశామని అధికారులు చెబుతున్నా ఇంకా అందని వారికి చెల్లించేందుకు ఉపకార వేతనాలకు రూ.5.5 కోట్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు రూ.3.37 కోట్లు అవసరమని కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపగా ఉపకార వేతనాలకు రూ.5కోట్లు, ఫీజురీయంబర్స్‌మెంట్ చెల్లించేందుకు రూ.3 లక్షలు మాత్రమే మంజూరు అయ్యాయి.

బీసీ సంక్షేమ శాఖ పరిధిలో దరఖాస్తు చేసుకున్న బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాల చెల్లింపునకు రూ.1.05 కోట్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లింపునకు రూ. 1.99 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా రెండింటికీ కలిపి రూ.19.56 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. దీంతో 75 శాతం మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజులు మంజూరు చేశారు. అవికూడా కోశాగారంలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

గిరిజన సంక్షేమశాఖ పరిధిలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఉపకార వేతనాల చెల్లింపునకు రూ.6లక్షలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించేందుకు రూ.55 లక్షలు అవసరమని ప్రతిపాదనలు పంపగా ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించేందుకు రూ.39 లక్షలు, ఉపకార వేతనాలకు రూ.6లక్షలు మంజూరు అయ్యాయి. ఈ శాఖ పరిధిలో ఇంకా 11 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించాల్సి ఉన్నది. 317 దరఖాస్తులు ఇంకా కళాశాలల్లోనే మూలుగుతుండటం గమనార్హం. ఈవిధంగా అన్ని శాఖల్లో నిధుల కొరత వల్ల విద్యార్థులు సకాలంలో ఉపకార వేతనాలు, ఫీజులు చెల్లించడం లేదు. చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా ఫీజులు చెల్లిస్తేనే ధృవపత్రాలు తిరిగి ఇస్తామని కళాశాలల యాజమాన్యాలు చెబుతుండటంతో తప్పని పరిస్థితుల్లో ఆయా శాఖల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉన్న నిధులతోనైనా ఉపకార వేతనాలు మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇంకా నెల రోజుల్లో 2012-13 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉపకారవేతన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది. నిధుల కొరత వల్లే కొంత ఆలస్యం జరుగుతోందని, ప్రస్తుతం విడుదలైన నిధులతో విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ ఆన్‌లైన్‌లో మంజూరు చేసినట్లు ఆయా
సంక్షేమ శాఖల అధికారులు వెల్లడించారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd