పిల్లలు అభివృద్ధి చెందాలి
మహబూబ్‌నగర్ రూరల్, టీ న్యూస్ : పిల్లలు చెడు దారిలో కాకుండా మంచి దారిలో నడిచేలా చూడాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులు, సమాజంపై ఉందని జిల్లా కలెక్టర్ ఎం.పురుషోత్తంరెడ్డి అన్నారు. బాలల ఆదరణ, సంరక్షణ చట్టం 2000పై వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. చిన్నపిల్లలు చెడు అలవాట్ల వైపు, నేరాల వైపు మళ్లకుండా మంచి బుద్ధితో అభివృద్ధి చెందాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, పిల్లల పెంపకం ఆరోగ్య సంరక్షణ కోసం తల్లిదండ్రులతో పాటు ఐసీడీఎస్ వైద్యశాఖ అధికారులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి సరైన పౌష్టికాహారం అందించాలని, పుట్టిన ప్రతి ఒక్కరికీ విద్యను అందించాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రాథమిక విద్యను పూర్తి చేసిన వారందరినీ విద్యా పక్షోత్సవాల్లో భాగంగా బడులలో చేర్పించాలని ఆదేశించారు. అన్ని గ్రామాలు తిరిగి బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. జిల్లాలో ఆడ, మగ అనే వివక్ష పెరిగిపోతుందని, వివక్షను చూపించకుండా అందరూ చదువుకునేలా చూడాలని ఆయన కోరారు. బాలికల విద్య కోసం ప్రత్యేకించి కేజీబీవీలను ఏర్పాటు చేశారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆడ, మగ నిష్పత్తుల్లో తేడాలు రావడం రాబోయే రోజుల్లో ప్రమాదానికి సంకేతమని అన్నారు. అనాథ పిల్లల కోసం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఎనుగొండలో అనాధాశ్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శేషగిరిరావు మాట్లాడుతూ బాలల ఆదరణ, సంరక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని, 2000 సంవత్సరంలో చేసిన జువెనైల్ జస్టీస్ చట్టం ప్రకారం బాలలను పరిరక్షించడానికి ప్రత్యేక కమిటీలు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక చట్టాలు అనేకం ఉన్నాయన్నారు. అనంతరం ఐసీడీఎస్ పీడీ మోహన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రాజేశ్వర్‌రావు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓలు, ఎస్‌వీఎస్ ఆసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్, జువెనైల్ వెల్ఫేర్ విభాగం డీడీ డాక్టర్ పి.సుకుమార్, ప్రోగ్రాం ప్రతినిధి శ్రీరాం, నాగలక్ష్మీ, నబీసాహెబ్ పాల్గొన్నారు.
Other News