Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  General News
‘ఉపాధి’కి తూట్లు

- ఇబ్బందుల్లో కూలీలు
- పట్టించుకోని పాలకులు
- డబ్బుల చెల్లింపులో స్వచ్ఛంద సంస్థల ఇష్టారాజ్యం


మహబూబ్‌నగర్, టీ మీడియా : రెక్కాడితే గానీ డొక్కాడని కష్టజీవులు రోడ్డున పడ్డారు. నెలల తరబడి కూలి చేసినా ఇప్పటికీ కూలి డబ్బులు రాక పోవడంతో ఇబ్బందులకు గురౌతున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 2005లో ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో నిర్లక్ష్యంగా సాగుతోంది. బడా నాయకుల అండదండలతో మధ్యలోనే నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. జిల్లాలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కూలి చేస్తున్న వారికి డబ్బులు సకాలంలో అందడం లేదు. కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కూలీ డబ్బులు స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడంతో పంపిణీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పనిలో ప్రమాదాలకు గురైన వారికి డబ్బులు చెల్లించాల్సి ఉండగా, ఎక్కడా చెల్లించిన దాఖలాలు లేవు. పనులు జరుగుతున్న చోట వెంటనే తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ తనిఖీలు నిర్వహించడం లేదు. పని పూర్తయిన కొన్నాళ్ళకు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి కింది స్థాయి ఉద్యోగులను బదిలీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, కూలి పనులు జరగకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

జిల్లాలో ప్రతి రోజూ రెండు లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా అనేక చోట్ల నెలల తరబడి కూలీ పనులు జరుగడం లేదు. కొన్ని చోట్ల నెలల తరబడి డబ్బులు రాకపోవడంతో కూలీలు అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పుడు, అప్పుడు అంటూ కాలం వెల్లదీస్తున్నారు.

కనీస సౌకర్యాలు కరువు
జిల్లాలో ఉపాధి హామీ పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. పనిముట్లకు డబ్బులు చెల్లించడం లేదు. నీడ, తాగునీరు, ప్రథమ చికిత్స లాంటి సౌకర్యాలకు నోచుకోవడంలేదు.

చేసిన పనికి డబ్బులు రాలేదు పని చేసి నెలలు గుడుస్తున్నా ఇప్పటికీ కూలి చెల్లించడం లేదు. జిల్లాలో స్మార్ట్ కార్డు సిస్టమ్, బ్యాంకుల ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉండగా, స్వచ్ఛంద సంస్థలు కోరమాండల్, ఫిరోస్కు, జీరోమాస్‌లాంటి స్వచ్ఛంద సంస్థలు కూలీలకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా నెలలు గడిచినా ఇప్పటికీ చెల్లించడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లా అధికారుల వద్దకు వచ్చి చెప్పినా ప్రయోజనంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. జీరో మాస్ ద్వారా జిల్లాలోని 292 గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. అధికారులు మాత్రం మే నెల 9 నుంచి మాత్రమే చెల్లించలేదని చెబుతున్నా, రెండు నెలల నుంచి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు. ఎండల్లో కష్టపడి పనిచేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ డబ్బులు రాలేదు, ఎలా బతికేది ఎవ్వరికి చెప్పినా పట్టించుకోవడం లేదని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన పలువురు కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. నెలల తరబడి కూలి డబ్బులు రాకపోవడంతో బిజినేపల్లి మండలం మమ్మాయపల్లి గ్రామానికి చెంది న వందలాది మంది కలెక్టర్ పురుషోత్తంరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మాగనూర్ మండలంలోని పలు గ్రామాల కూలీలు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పనిలో ప్రమాదాలకు గురైన వారికి ముందుగా మీరే ఆసుపత్రిలో చూయించుకుని బిల్లులు చెల్లిస్తే డబ్బులు ఇస్తామని చెబుతున్న అధికారులు, అనంతరం సాకులు చూపుతూ చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి.

స్వచ్ఛంద సంస్థల ఇష్టారాజ్యం
జిల్లాలో ఉపాధి హామీ పనులకు ఫినో, జీరో మాస్, కోరమండల్ అనే స్వచ్ఛంద సంస్థలు చెల్లించే విధంగా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. డబ్బులు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జీరో మాస్ ద్వారా మూడు నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd