అక్రమ నిల్వలపై ‘రెవెన్యూ’ దాడులు
-రూరల్‌లో మూడు దుకాణాలపై కేసులు
- రూ. 21లక్షల ఎరువు బస్తాల సీజ్
ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తల్లంపాడు, నర్సింహాపురంలోని 4ఎరువుల దుకాణాల యజమానులపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. అక్రమంగా ఎరువులు నిల్వ చేశారనే అనుమానంతో శుక్ర, శనివారాల్లో అధికారులు ఆయా దుకాణాలపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తల్లంపాడులోని సాయి ఫెర్టిలైజర్స్ దుకాణానికి చెందిన రూ.11,40,450ల విలువైన 1633 ఎరువుల బస్తాలను, శ్రీధర్ ఫెస్టిలైజర్స్‌కు చెందిన రూ.,57,60 విలువైన 1242బస్తాలను,అరవింద ఫెస్టిలైజర్స్‌కు చెందిన రూ.75,390 విలువైన 245బస్తాలను, నర్సింహాపురంలోని శైలజ ఫెస్టిసైడ్స్‌కు చెందిన రూ.62,040 విలువైన 220బస్తాలకు బిల్లులు, స్టాక్ రిజిష్టర్ సరిగా లేనందున వాటి అమ్మకాలను నిలుపు చేశారు. తిరిగి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకు వాటిని అమ్మవద్దని దుకాణాల యాజమానులను హెచ్చరించారు. దీంతోపాటు తల్లంపాడులోని ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 1233 ఎరువులను స్వాదీనం చేసుకొని 6(ఏ) కేసు నమోదు చేసినట్లు ఆర్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.
కూసుమంచి, టీ మీడియా: అక్రమ నిల్వలపై రెవెన్యూశాఖ జూలు విదిల్చింది.. దొడ్డిదారిన వ్యాపారం చేసే అక్రమార్కులపై నిఘా పెట్టిన అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.. అందులో భాగంగా కూసుమంచి మండలం పరిధిలోని జీళ్లచెరువు గ్రామంలో శనివారం అక్రమంగా నిల్వ ఉంచిన 667 ఎరువుల బస్తాలను పట్టుకున్నారు. నిల్ స్టాక్ చూపి అధికారులను పక్కదారి పట్టించడమే కాకుండా ఎరువులను పెద్దమొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచడంతో వాటిని సీజ్ చేశారు.
కూసుమంచి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న ఎరువుల దుకాణాల్లో మండల తహసీల్దార్ బీ.వీరయ్య, రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేశారు. దుకాణ యజమానుల నుంచి ఖరీప్‌లో విక్రయించే ఎరువుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. దీంతో మండలంలో ఉన్న 17 ఫెర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్స్ దుకాణాల్లో మొత్తం 21,302 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే జీళ్లచెరువు గ్రామంలో సీహెచ్.వీరభద్రం తనకు చెందిన శ్రీసాయి ఫెర్టిలైజర్స్ దుకాణంలో ఎరువులు లేవని నిల్ స్టాక్‌గా చూపించారు.
దీంతో అనుమానం వచ్చిన అధికారులు శనివారం ఆ దుకాణంలో ముమ్మరంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మెడికల్‌షాపు వెనకాల ఉన్న గదిలో సుమారు 200కుపైగా, ఆ వ్యాపారికి సంబంధించిన గోదాములో ఒక లారీ లోడు 477 ఎరువు బస్తాల నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని చూసిన రెవెన్యూ అధికారులు అవాక్కయ్యారు. నిల్ స్టాక్ చూపించిన వ్యాపారి వద్ద ఇన్ని ఎరువుల బస్తాలా.. అంటూ తహసీల్దార్, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీసాయి ఎరువుల దుకాణంలో నాలుగు కంపెనీలకు చెందిన 677 ఎరువుల బసాలను తహసీల్దార్ వీరయ్య స్వాధీనం చేసుకున్నారు. అందులో వివిధ కంపెనీలకు చెందిన యూరియా 4.6 మెట్రిక్ టన్నులు(92బస్తాలు), డీఏపీ 19.6(392 బస్తాలు), 20:20:0- 9.45 మెట్రిక్ టన్నులు(19 బస్తాలు), 20:20:0 కేపీఆర్ కంపెనీకి చెందిన 0.02 మెట్రిక్ టన్నులు(4బస్తాలు)లను అక్రమంగా నిల్వ ఉంచినట్లుగా గుర్తించి దుకాణాన్ని సీజ్ చేశారు.
ఎరువుల దుకాణాన్ని పరిశీలించిన జేడీఏ
జీళ్లచెరువు గ్రామంలోని శ్రీసాయి ఎరువుల దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 677 ఎరువుల బస్తాలను పట్టుకున్న సమాచారం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ హేమమహేశ్వరరావు ఆ దుకాణాన్ని పరిశీలించారు. అక్రమంగా నిల్వ ఉన్న ఎరువుల బస్తాలను ఆయన పరిశీలించారు. అనంతరం దుకాణ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసు నమోదు చేసిన ఏడీఏ..
జీళ్లచెరువు గ్రామంలోని శ్రీసాయి ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉన్న ఎరువులను గుర్తించి పట్టుకున్న అనంతరం వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఎన్.బాలకృష్ణ చౌదరి, మండల వ్యవసాయాధికారి ఆరుణజ్యోతి, టెక్నికల్ ఏవో రమేష్‌లు వాటిని పంచానామా చేశారు. అక్రమ నిల్వలపై దుకాణదారుడు వీరభవూదంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనపై 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. త్వరలోఆయనను జేసీ కోర్టుకు హాజరు పర్చనున్నట్లు వ్యవసాయ శాఖాధికారులు తెలిపారు. ఎరువులు ఉన్న రెండు గోదాములను సీజ్ చేసి స్థానిక వీఆర్‌ఓ కృష్ణాడ్డికి అప్పగించారు.
Other News