150 క్వింటాళ్ల చౌక బియ్యం పట్టివేత
ఖమ్మంరూరల్,జూన్13(టీమీడి యా):పేదలకందాల్సిన చౌక బియ్యం పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్న వైనమిది. ఒకటి రెండు క్వింటాళ్లు కాదు.. ఏకంగా లారీకి సరిపోయేన్ని బియ్యం బస్తాలు తరలింపునకు పయనమయ్యాయి. అయి తే పాపం పండి అధికారులకు సమాచా రం అందడంతో ఆ లారీ ప్రయాణంలోనే పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా మరిపెడ బంగ్లా సమీపంలోని ఓ గ్రామంలో చౌక ధరల బియ్యాన్ని అక్రమ బియ్యం వ్యాపారులు లారీలోకి లోడ్ చేశారు. డ్రైవర్‌ని లారీ ఎక్కించి ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించగానే ఫోన్ చేయమని చెప్పారు. ఖమ్మం వెళ్లగానే ఎటు వెళ్లాల్సిందీ చెబుతామని డ్రైవర్‌కు వివరించారు. అయితే లారీ పయనమైన కొద్ది సేపటికి అంటే.. ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించగానే ఖమ్మం ఆర్డీవో వాసం వెంక ఫోన్ ద్వారా ఓ విశ్వసనీయ సమాచారం అందింది. రేషన్ బియ్యంతో లోడైన లారీ ఖమ్మంలోకి ప్రవేశించిందనేది ఆ సమాచారంలోని సారాంశం.
దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన ఖమ్మం రూరల్ తహసీల్దారు కిషోర్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్, కిషోర్‌కుమార్, సర్వేయర్ మస్తాన్‌రావు, వీఆర్వో గురుమూర్తిలతో కూడిన బృంద సభ్యులు తిరుమలాయపాలెం నుంచి ఖమ్మం పట్టణ శివారు ప్రాంతం వరకు నిఘా వేశారు. దీంతో వరంగల్ క్రాస్‌రోడ్డు వద్దకు లారీ చేరుకోగానే మాటు వేసిన అధికారులు పట్టుకుని ఖమ్మం రూరల్ తహసీల్దారు కార్యాలయానికి తరలించారు.
ప్లాస్టిక్ సంచుల్లో నింపి.. సాధారణంగా రేషన్ బియ్యం గోనె బస్తాల్లో సరఫరా అవుతుంది. అయితే ఈ బియ్యాన్ని తెలివిగా ప్లాస్టిక్ సంచుల్లో నింపి తరలిస్తున్నారు. లారీ పట్టుబడిన విషయం తెలుసుకున్న ఆర్డీవో వాసం వెంక అక్కడికి చేరుకుని దగ్గరుండి పంచనామా నిర్వహించారు. కలెక్టర్ సిద్దార్థాజైన్‌కు ఫోన్‌లో సమాచారం చేరవేయడంతో పాటు జిల్లా పౌర సరఫరాల అధికారి కె అక్కడికి రప్పించి ఆ బియ్యం పౌర సరఫరాల బియ్యమా.. లేదా సాధారణా బియ్యమా? అనే అంశంపై పరిశీలన జరిపించారు. లోడ్‌ను విప్పి చూడగా ప్లాస్టిక్ సంచుల్లోంచి పీడీఎస్ బియ్యం బయటపడ్డాయి. దీంతో ఏపీ16 ఎక్స్ 37 నెంబర్ గల ఆ లారీని సీజ్ చేసి డ్రైవర్ నాగరాజు వద్దున్న ఫోన్‌లో నెంబర్ల ఆధారంగా విచారణ చేపట్టారు. అయితే అక్రమ బియ్యం వ్యాపారం చేసే సదరు నిర్వాహకులు లారీ ఖమ్మం చేరుకోగానే ఫోన్ చేయమని డ్రైవర్‌కు చెప్పినట్లు విచారణలో స్పష్టమైంది. ఈ బియ్యాన్ని ఖమ్మం మీదుగా కృష్ణా జిల్లాకు తరలిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. లారీలో 270 నుంచి 300 వరకు బస్తాలు ఉండొచ్చని పంచనామాలో తేటతెల్లమైంది. ఇవి సుమారు 150 క్వింటాళ్లు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అయితే పట్టుబడిన లారీని సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు ఆర్డీవో వాసం పేర్కొన్నారు. అవసరమైతే లారీ యజమానిపై క్రిమినల్ కేసును నమోదు చేయనున్నట్లు చెప్పారు.
Other News