గాలి మేడలు..!
- ఆర్భాటపు ప్రచారంతో రూ.10 కోట్లకుపైగా వసూళ్లు
- నిధుల మళ్లింపుతో ముందుకు సాగని నిర్మాణాలు
- ఆందోళనలో బాధితులు
- చోద్యం చూస్తున్న అధికారులు
‘గేటెడ్ కమ్యూనిటీ వసతులతో కూడిన నిర్మాణాలు.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు..’ అంటూ ఆర్భాట ప్రచారంతో గాలిలో మేడలు కట్టిన ‘ప్రవిష్ట ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ నిర్మాణ కంపెనీ బొక్కాబోర్లా పడింది. సంస్థ డైరెక్టర్లలో లుకలుకల కారణంగా జిల్లా కేంద్రంలోని దుర్గమ్మగడ్డలో ‘ప్రవిష్ట హైట్స్’ పేరిట ప్రారంభించిన భవన నిర్మాణ పనులు నత్తలకే నడక నేర్పుతున్నాయి. కంపెనీ యాజమాన్యం కస్టమర్ల నుంచి వసూలు చేసిన రూ.10 కోట్లను ఇతర వెంచర్లకు మళ్లించి, అసలు పనులను గాలికొదిలేయడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు దొరికిన చోటల్లా అప్పులు చేసి, నిర్వాహకుల చేతిలో పోసిన సభ్యులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. - టీ మీడియా, కరీంనగర్ సిటీబ్యూరో
(టీ మీడియా, కరీంనగర్ సిటీబ్యూరో):‘అందరికీ అందుబాటు ధరల్లో అందమైన ఇల్లు నిర్మించి ఇస్తాం.. నిర్మాణ రంగం చాలా ఖరీదైన ఈ రోజుల్లో మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే ఉద్దేశ్యంతో మా సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలను చేపట్టాం.. హైదరాబాద్, వైజాగ్ లాంటి మహానగరాలకే పరిమితమైన గేటెడ్ కమ్యూనిటీ వ్యవస్థను మొదటి సారిగా ఇక్కడ ప్రవేశపెడుతున్నాం.. సగటు మనిషి రోజువారీ అవసరాలకు సరిపడే ఇళ్లను మంచి అహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించి ఇవ్వాలనేదే మా ప్రయత్నం..’
2009లో ఏ దిన పత్రిక తిరగేసినా ఇలాంటి ప్రకటనలే! నగరంలో ఎక్కడ చూసినా ‘ప్రవిష్ట’ ప్రచార బోర్డులే! ఆకర్షణీయమైన కరపవూతాలు.. ఖరీదైన హోటళ్లలో సమావేశాలు.. కార్యక్షికమాల్లో తళుక్కున మెరిసిన రాజకీయ నాయకులు.. ఇలా ఒక కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రవిష్ట ఇన్‌ఫ్రా’ చేయని పనంటూ లేదు.
కళ్లు తిరిగే వసతులు..!
ఏ, బీ, సీ, డీ పేరిట నాలుగు బ్లాకుల్లో 400 ప్లాట్లు నిర్మించేందుకు యాజమాన్యం ప్రణాళికలు తయారుచేసింది. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన ఈ కాలనీ మొత్తానికి ఒకే దగ్గర ఉన్నత స్థాయి సెక్యూరిటీ జోన్ ఏర్పాటు, ఇంటింటికీ వంటగ్యాస్ పైప్‌లైన్, స్విమ్మింగ్ పూల్, రిక్రియేషన్ క్లబ్, మినీఫంక్షన్ హాల్, మెడి సెంటర్, పురుషులు, స్త్రీల కోసం వేర్వేరు జిమ్స్, అలరించే పార్కు, షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ వాటర్ సౌకర్యం, మినరల్ వాటర్ ప్లాంట్, గ్రంథాలయం, వాకింగ్ పాత్, ప్రథమ చికిత్స కేంద్రం, 24 గంటల రక్షణ, పనివారికి, డ్రైవర్లకు వసతి గదులు, వాహనాలు శుభ్రపర్చే స్థలం, ప్రతి అపార్టుమెంట్‌కు మూడు లిఫ్ట్‌లు, రెండు జనరేటర్లు, అతిథుల వాహనాల కోసం స్థలం కేటాయింపు, కంపౌండ్ వాల్‌కు సోలార్ ఫెన్సింగ్, సిమెంట్ రోడ్ల నిర్మాణం, రోడ్డుకిరువైపులా చెట్ల పెంపకం, ఇండోర్ గేమ్స్, ప్రతి అపార్టుమెంట్ పైఅంతస్తులో రూఫ్ గార్డెన్, పదేళ్ల వరకు ఉచిత నిర్వహణ .. ఇలా కళ్లు తిరిగే వసతులు కల్పిస్తామంటూ ప్రవిష్ట యాజమాన్యం కస్టమర్లతో ఒప్పందం చేసుకుంది. 18 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా అందులో పేర్కొంది.
అన్నీ గాలి మేడలే..!
కంపెనీ బుట్టలోపడ్డ వందలాది మంది దొరికిన చోటల్లా అప్పు చేసి ప్రవిష్ట యాజమాన్యం చేతుల్లో పోశారు. కొందరు ట్రైపార్ట్ అగ్రిమెంట్ల ద్వారా ‘దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’తో పాటు వివిధ బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి అప్పగించారు. ఇలా సుమారు 200 మంది కస్టమర్ల నుంచి ఏకంగా రూ.10 కోట్ల దాకా యాజమాన్యం వసూలు చేసింది. ఇందులో 56 మంది కస్టమర్లయితే ఏకంగా ₹8 నుంచి ₹10 లక్షల చొప్పున అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక యాజమాన్యం వాటా కేవలం ₹2.50 కోట్లే కావడం అనుమానాలకు తావిస్తోంది. మొదట్లో నిర్మాణ పనులు జోరుగా సాగాయి. మధ్యలో కంపెనీ ఎండీ నరోత్తమడ్డి ‘ప్రవిష్ట ఇన్‌ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్’ పేరిట కొత్త కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి కరీంనగర్‌లోని ‘ప్రవిష్ట హైట్స్ ప్రాజెక్టు’ నిర్మాణ పనులు మందగించాయి. నిజానికి ‘ప్రవిష్ట ఇన్‌ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్’ పేరిట నరోత్తమడ్డి కరీంనగర్ శివారులోని బొమ్మకల్, తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ, వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేశారు. ఇందుకోసం ‘ప్రవిష్ట హైట్స్’ కంపెనీ నుంచి సుమారు 4.30 కోట్ల దాకా మళ్లించారనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారం ఒకరిద్దరు డైరెక్టర్లకు మాత్రమే తెలిసి జరగడంతో మిగిలిన వారంతా తమ వాటాల కోసం పట్టుబట్టారు. నరోత్తమడ్డి అందుకు అంగీకరించకపోవడంతో యాజమాన్యంలో లుకలుకలు మొదలయ్యాయి. చివరికి మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు నుంచి నరోత్తమడ్డిని తప్పించి, శ్రీకాంత్‌డ్డి అనే వ్యక్తిని ఆ సీట్‌లో కూర్చోబెట్టారు. ఈ మధ్యలో అనేక తతంగం జరిగినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్‌డ్డి వచ్చిన తర్వాతనైనా ప్రవిష్ట హైట్స్ నిర్మాణం ముందుకు సాగుతుందని భావించిన కస్టమర్లకు నిరాశే ఎదురైంది. ఇతను బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకే పరిమితమై నిర్మాణం గురించి పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఈ సమయంలోనే మేనేజ్‌మెంట్ నుంచి కొందరు కస్టమర్లకు బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో కస్టమర్లంతా ఏకమై ‘ప్రవిష్ట హైట్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ’ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళుతూ ప్రవిష్ట మేనేజ్‌మెంట్ అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నారు.
అమ్మకానికి కంపెనీ..
కస్టమర్ల తీరుతో ఖంగుతిన్న యాజమాన్యం, ప్రవిష్ట ఇన్‌ఫ్రా పైవేట్ లిమిటెడ్‌ను నరోత్తమరావు అనే మరో వ్యాపార వేత్తకు అమ్మకానికి పెట్టింది. సుమారు ₹6 కోట్లతో నరోత్తమరావు దీనిని కొనుగోలు చేసినట్లు కస్టమర్లు చెబుతున్నారు. నరోత్తమరావు మంచి పేరున్న వ్యాపార వేత్త కావడంతో ఇకనైనా తమ సొంతింటి కల నెరవేరుతుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. కొత్త యాజమాన్యం కస్టమర్లకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి, ‘మీరు చెల్లించిన మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా తీసుకెళ్లండి..’ అని చెబుతుండడంతో గత్యంతరం లేక రోడ్డెక్కారు.పోలీసు స్టేషన్‌లో కేసుపెట్టినా, రెండు నెలల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైనా బాధ్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ఈ నెల 24న జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Other News