సీతారెడ్డి తర్వాత ఎవరు?
లెక్కలేనన్ని అవినీతి ఆరోపణల ఫలితంగా కమలాపూర్ ఎస్‌ఐ సీతారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది..! ఈ కథ ఇక్కడితో ముగుస్తుందా..? ఇంకా కొనసాగుతుందా..? ఒకవేళ కొనసాగితే ఆ తర్వాత ఎవరి వంతు..? ఇది ఎక్కడిదాకా వెళుతుంది..? జిల్లావ్యాప్తంగా పోలీస్‌వర్గాల్లో శనివారమంతా ఇదే చర్చ కొనసాగింది.. కింది స్థాయి అధికారుల నిర్వాకంతో జిల్లా పోలీస్ శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లా మారగా, ప్రక్షాళనకు ఉన్నతాధికారులు నడుం బిగించినట్లు తెలుస్తోంది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అతి త్వరలో పది మంది ఎస్‌ఐలపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది.. వారెవరనేది త్వరలో తేలనుండగా లంచావతారుల్లో గుబులు మొదలైంది..
(టీ మీడియా, పెద్దపల్లి) :జిల్లా పోలీసుశాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుళ్లు మొదలుకొని ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారుల దాకా పలువురు వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి, సామాన్యుల నుంచి లంచాలు పిండుకుంటున్నారనే ఫిర్యాదులు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. దీంతో పోలీస్‌శాఖ ప్రక్షాళన కోసం ఉన్నతాధికారులు నడుం బిగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం కమలాపూర్ ఎస్‌ఐ సీతాడ్డితో పాటు ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అతి త్వరలో మరికొందరిపై వేటు ఖాయమని తెలుస్తుండగా, లంచగొండి ఖాకీల్లో గుబులు మొదలైంది.
సీతయ్య ఎవరి మాట వినడు..
‘ఈ సీతయ్య ఎవరి మాటా వినడు..’ సీతయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నందమురి హరికృష్ట డైలాగ్ ఇది. శుక్రవారం సస్పెన్షన్‌కు గురైన కమలాపూర్ ఎస్‌ఐ సీతాడ్డికి మాత్రం చెయ్యి తడపందే ఏ పనీ చేయడనే పేరుంది. దొంగల వద్ద రికవరీ చేసిన సొమ్మును స్వాహా చేయడం దగ్గర నుంచి, ప్రైవేటు పంచాయితీలు, చివరకు ప్రేమికుల సెటిల్‌మెంట్ల దాకా ఆయన దండుకోని కేసులేదని చెప్పుకుంటున్నారు. పేకాట రాయుళ్లు, నకిలీ మావోయిస్టులు.. ఇలా తన చేతికి చిక్కిన ప్రతి ఒక్కరి నుంచీ లంచాలు పిండుకునేవాడని తెలుస్తోంది. జిల్లాలోని మెట్‌పల్లిలో ప్రోబెషనరీ పూర్తి చేస్తుకున్న సీతాడ్డి, జూలై 14, 2009లో కాల్వశ్రీరాంపూర్ ఎస్‌ఐగా వచ్చారు. ఏప్రిల్ 27, 2011వరకు ఇక్కడే విధులు నిర్వహించాడు. మొదటి పోస్టింగ్‌లోనే సీతాడ్డి అవినీతికి తెరతీశాడు. ఈయనగారి వేధింపులు భరించలేక పలువురు అప్పట్లో మూకుమ్మడిగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు మావోయిస్టుల పేరుతో డబ్బుల కోసం బెదిరించారు. రంగ ప్రవేశం చేసిన సీతాడ్డి, పలువురిని విచారణ పేరిట అదుపులోకి తీసుకొని పెద్ద మొత్తంలో డబ్బు గుంజినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పెగడపల్లి గ్రామంలో ఇద్దరు ప్రేమికుల వ్యవహారం గొడవకు దారితీయగా, తనను ఆశ్రయించిన ఇరువర్గాల నుంచి దండుకొని, పరిష్కారం చూపకపోవడంతో పంచాయితీ కాస్తా అప్పటి ఎస్పీ వద్దకు చేరింది.
ఇదే గ్రామంలో వృద్ధ దంపతుల హత్య కేసు నిందితుల నుంచి పెద్ద మొత్తంలో బంగారం రికవరీ చేసి అరెస్ట్ సమయంలో తక్కువ చూపించాడనే ఆరోపణలు వచ్చాయి. నిర్వాహకుల నుంచి మామూళ్లు పిండుకొని హోటళ్లలో మద్యం అక్రమ సిట్టింగ్‌లకు అనుమతించేవాడనీ, నాటుసారా తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడనీ, బెల్ట్ దుకాణాలను ప్రోత్సహించేవాడని చెబుతుంటారు. బదిలీపై కమలాపూర్ మండలానికి వెళ్లి అక్కడ కూడా అవినీతి అక్రమాలకు తెరతీయడంతో ప్రస్తుత ఎస్పీకి పెద్దసంఖ్యలో ఫిర్యాదులందాయి. ఈ క్రమంలోనే ఎస్సై సీతాడ్డి, ఏఎస్‌ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై శుక్రవారం ఎస్పీ రవీందర్ సస్పెన్షన్ వేటు వేశారు.
త్వరలో మరికొందరిపై వేటు..
కమలాపూర్ ఎస్‌ఐ సస్పెన్షన్‌తో మొదలైన ప్రక్షాళనపర్వం ఇక ఆగబోదనీ, త్వరలో మరింత మందిపై వేటు ఖాయమని తెలుస్తుండగా అవినీతి అధికారుల్లో గుబులు మొదలైయింది. పూర్తిగా అవినీతిలో మునిగితేలుతున్న పది మంది ఎస్‌ఐలపై ఇప్పటికే విచారణ పూర్తికాగా, మరో వారం, పది రోజుల్లో పలువురిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో కొత్తగా ఉద్యోగంలో చేరినవారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రసుత్తం ఉన్న పోస్టింగ్ పోతే ఇప్పుట్లో జిల్లాలో పోస్టింగ్ దొరకడం కష్టమేనని సమాచారం. ఇప్పటికే చాలా మంది సీనియర్ ఎస్‌ఐలు మామూలు ఠాణాల్లో పనిచేస్తుండడం గమనార్హం. మరో కొందరు శిక్షణ పూర్తి చేసుకొని వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో అవినీతి ఆరోపణలతో పోస్టింగ్ కోల్పోతే తమ బతుకు కుక్కలు చింపిన విస్తరే అవుతుందని పలువురు భయపడుతున్నారు.
Other News