నీరు వచ్చే దారేది..?
సిటీకి తాగునీరందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి వేసవిలో అడుగంటుతున్న జలాలే దీనికి నిదర్శనం. జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న కట్టడాలతోపాటు వ్యవసాయ బోరుబావుల్లో నీటి వాడకం పెరిగింది. దీంతో వర్షం నీరు ఎక్కడికక్కడే ఇంకిపోతోంది. వరద ప్రవాహం చెరువులకు తగ్గుముఖం పట్టింది. ఇలాగే కొనసాగితే మరో రెండు దశాబ్దాల్లో పూర్తిగా ఎండిపోయే ప్రమాదాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిటీబ్యూరో, టీ మీడియా : నిజాంకాలం నాటి నుంచి నేటి వరకు జంట నగరాల ప్రజల దప్పిక తీర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న జంట జలాశయాల (ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్) ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. కాలానికి అతీతంగా నిండుకుండలా ఉండాల్సిన ఈ జలాశయాల్లో ఒక్క వర్షాకాలంలోనే నీటితో కళకళాడుతుందే తప్ప, వేసవి ముగింపు వచ్చే సరికే ఎండిపోయి ఎడారిని తలపించే విధంగా కనిపిస్తున్నది.
ఈ క్రమంలోనే ఆగస్టు, సెప్టెంబరు వరకు వర్షాభావం ఉంటే పరిస్థితి ఇక అంతే సంగతులు. నీటి తరలింపులో జలమండలి చేతుపూత్తేయడం.. ఆ తర్వాత ఈ జలాశయ ప్రాంత పరిధి క్రీడా ప్రాంగణంగా మారిన సందర్భాలూ ఉన్నాయి.. ఈ జలాశయాల పరీవాహక ప్రాంతంలో సహజ సిద్ధ్దంగా ఉండే భారీ అటవీ ప్రాంతం కనుమరుగవడం, మేఘాలను ఆకర్షించలేకపోవడం, పట్టణీకరణ పెరిగిపోవడం, ఆక్రమణలు ఎక్కువవడం వంటి కారణాలకు తోడు భౌగోళిక మార్పులవల్ల వర్షాలు సైతం సరిగ్గా కురవడం లేదు. పరీవాహక ప్రాంతాల్లో పంటల సాగుకు భూగర్భజలాలపైనే రైతులు ఆధారపడుతుండడం.. ఈ క్రమంలోనే రైతులు ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడేస్తున్న ఫలితంగా వర్షాలు కురిసినా ఆ నీరంతా అక్కడికక్కడే భూమిలోకి ఇంకిపోతున్నది. ఆగస్టు, సెప్టెంబరు వచ్చే వరకు వరద ప్రవాహం ఈ జలాశయాలకు చేరడం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఏటా జంట జలాశయాలు సరిగా నిండకపోవడంతో వేసవి కాలం ముగింపు సమయంలోనే జలసిరి ఆవిరైపోతుంది.
ఇప్పటికైనా అటు ప్రభుత్వం, ఇటు ఈ జలాశయాల పరీవాహక ప్రాంత ప్రజలు మేల్కొనకపోతే నగరవాసులకు తాగునీరు దొరకడం కష్టమే అని చెప్పవచ్చు. ఈ జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో భూగర్భ నీటి వాడకం తగ్గించకున్నా వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువైనా మరో రెండు దశాబ్దాల్లో వర్షాకాలం తప్ప ఇతర కాలాల్లో ఈ జల వనరులు రెండూ ఎండిపోతాయని జేఎన్‌టీయూ నీటి వనరుల విభాగం సర్వే తేటతెల్లం చేయడం ఆందోళన కలిగించే అంశం.
బోరు బావుల వాడకాన్ని తగ్గించండి!
ఉస్మాన్‌సాగర్‌కు 73 చదరపు కిలోమీటర్లు (117 గ్రామాలు), హిమాయత్‌సాగర్‌కు 130 చదరపు కిలోమీటర్ల (20 గ్రామాలు) పరీవాహక ప్రాంతం ఉన్నది. ఈ ప్రాంతంలో పడిన వర్షం నీరు వీటిలోకి చేరుతున్నది. ఈ పరీవాహక ప్రాంతాల్లో పంటల సాగుకు రైతులు భూగర్భ జలమే అధారపడి భూగర్భ జలాలన్నీ తోడేస్తున్నారు. అందుకు భూగర్భజల వాడకాన్ని 40 శాతం మేర తగ్గించుకుంటే వచ్చే 20 ఏళ్లలో ఒక్క వర్షాకాలంలో మాత్రం రెండు చెరువుల్లో నీటిని చూస్తామని, మిగతా కాలంలో చుక్క నీరుండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాన్ని తోడకుండా ఉంటే కొంత మొత్త మే ఇంకి మిగతా చెరువుల్లోకి చేరుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్న అభివూపాయం వ్యక్తమవుతున్నది.
వర్షపాతంలో లేదు తేడా!
1971లో ఈ ప్రాంతాల్లో పడిన వర్షంలో 33శాతం ఉస్మాన్‌సాగర్‌లోకి 19.74శాతం హిమాయత్‌సాగర్‌లోకి వచ్చేది. నేడు ఉస్మాన్‌సాగర్‌లోకి 11.73శాతం, హిమాయత్‌సాగర్‌లోకి 5.7శాతం వర్షం నీరు (వరద) చేరుతున్నది. అందుకే ఆగస్టు, సెప్టెంబరు వచ్చే వరకు వరద ప్రవాహం రావడంలేదు.
ఆస్ట్రేలియా తరహా విధానం అమలైతేనే మనుగడ!
నగరంలో సాధారణ వర్షపాతం సుమారు 00 మిల్లీ మీటర్లు. అదే అస్ట్రేలియాలో అయితే 400 మాత్రమే. అందుకే తాగునీటి వనరుల పరీవాహక ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు, భూగర్భజల వాడకం, పంటలు సైతం నిషేధిస్తారు. జంట జలాశయాల పరిరక్షణకు 111జీఓ ఉన్నా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇచ్చేస్తున్నారు. జలాశయాల్లోకి మురుగునీరు చేరి కలుషితమవడానికి కారణమవుతున్నది. వాణిజ్య భవనాలకు అనుమతి ఇవ్వవద్దని, తక్షణమే ఆస్ట్రేలియా తరహా విదానాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్న అభివూపాయం వ్యక్తమవుతున్నది.
నిపుణుల సూచనలు బుట్టదాఖలు
జలాశయాల పరీవాహక ప్రాంతంలో సహజంగా ఏర్పడిన ఆటవీ ప్రాంతాలను తిరిగి పునరుద్ధ్దరించడం, పెరిగిపోతున్న పట్టణీకరణ కనీస స్థాయికి తగ్గించడం, ఆక్రమణలను తగ్గించడం, కార్పొరేటీకరణను నివారించడంపై చర్యలు తీసుకోవాలని జలాశయాల మనుగడపై పరిశోధన చేసిన నిపుణులు గతంలో పలుమార్లు సూచనలు జారీచేశారు. కానీ పాలకులు ఈ దిశగా అమలు చేయకపోవడం గమనార్హం.
వర్షాల కోసం ఎదురుచూపులు
ఉస్మాన్‌సాగర్, హియాయత్‌సాగర్ నీటి నిల్వలు ప్రమాదకరస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే అధికారులు పంపింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న నీరు ఆగస్టు వరకైనా వస్తాయో లేదోనని అధికారులు అందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురుస్తాయో..లేదోనని జలమండలి అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా, హిమాయత్‌సాగర్‌లోకి పరీవాహక ప్రాంతాల్లో చెరువులకు నీరు రావాలంటే రంగాడ్డి, మహబూబ్‌నగర్‌లో భారీగా వర్షాలు, గండిపేట నిండాలంటే వికారాబాద్, తాండూరులలో వర్షాలు భారీగా పడితేనే నీరు వచ్చే పరిస్థితి ఉంది. ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు తీవ్రస్థాయిలో పడిపోవడం.. ఈ పరిస్థితుల్లో అనేక రకాల అస్తవ్యస్త పరిస్థితుల మధ్య జంట జలాశయాలకు వరద నీరు ఎక్కడి నుంచి వస్తుందో సర్కారే తెలపాలి.
Other News