Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Adilabad>>  Crime
జిల్లావాసుల దిగ్భ్రాంతి

- అనారోగ్యంతో మాజీ కలెక్టర్ వెంకటేశ్వర్లు మృతి
- జిల్లాతో విడదీయలేని అనుబంధం

(టీ న్యూస్, ఆదిలాబాద్ టౌన్)జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన గిరిజన ఐఏఎస్ పాలపర్తి వెంక శనివారం హైదరాబాద్‌లో మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతిచెందారు. మార్చి 29 నుంచి మెదడులో రక్తం గడ్డకట్టుకోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తనువు చాలించారు. 2010 ఏప్రిల్ 5న బాధ్యతలు స్వీకరించిన ఆయన 2011 ఏప్రిల్ 13 వరకు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. గిరిజనుడైన వెంక ఆదివాసీ జిల్లాకు కలెక్టర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రతీసారి చెప్పుకునేవారు. ఆయన హయాంలో తిర్యాణి మండలం కుర్రెఘాట్ గిరిజనులు తాగునీరు, రహదారి లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి మైదాన ప్రాంతానికి తరలివచ్చేలా కృషి చేశారు.

ఉప ఎన్నికల సమయంలో పోలింగ్ సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను తెలుసుకునేందుకు సిర్పూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ‘నేనున్నాను.. మీ కోసం’ పేరిట బాక్సులను ఏర్పాటు చేసి, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏడాది తిరక్కుండానే బదిలీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకున్నాయి. అఖిల భారత ఆదివాసీ పరిషత్ నాయకుడు సిడాం రాంకిషన్ ఏకంగా ట్యాంకుపై ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. కలెక్టర్ అశోక్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అధికారులు, ఉద్యోగులు సంతాపాన్ని వెలిబుచ్చారు. కలెక్టర్ వెంక మృతిపై అఖిల భారత ఆదివాసి పరిషత్ నాయకుడు సిడాం రాంకిషన్, గిరిజన ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి గెడాం మనోహర్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు.

Other News
    Most Viewed galleries


    Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd