కరుణించి కాపాడు.. నాగరాజా!
- నేడు నాగుల పంచమి
(టీ మీడియా, ఆదిలాబాద్ టౌన్) :‘కరుణించి కాపాడు నాగరాజా..’ అంటూ మహిళలు భక్తి శ్రద్ధలతో నేడు నాగుల పంచమి జరుపుకోనున్నారు. 23నే పండుగ చేసుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. శ్రావణ మాసం శుక్ల పంచమి రోజున ‘నాగారాధన’ మహిళలకు శ్రేష్ఠమని పురాణాలు ప్రవచిస్తున్నాయి. చతుర్థిన ఉపవాసం ఆచరించి, పంచమి రోజున తమ శక్తి మేరకు బంగారు, వెండితో ఐదు పడగల నాగు పామును తయారు చేయించుకోవాలి. అలా వీలు కాని వారు మట్టి, పసుపు, చందనంతో తయారు చేసుకోవాలి. ఈ రూపానికి పంచామృతంతో మంత్రోపచారం చేయాలి. జాజి, సంపెంగ, గన్నేరు పూలతో పూజించాలి. సృష్టికి మూలకారకుడైన పరమేశ్వరుడు, నాగుల పంచమి రోజు భక్తులు ఆచరించాల్సిన నియమాల గురించి తన సతీమణి పార్వతీ దేవికి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. పవిత్ర శ్రావణ మాసారంభంలో వచ్చే ‘నాగుల పంచమి’ రోజున ఇంటిల్లి పాదీ పుట్టలో పాలు పోసి నాగదేవతను వేడుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం.
ధారగా పాలు పోయకూడదు..
పల్లెలు, పట్టణాల్లోని పడుచులు, మహిళలు పాటలు పాడుతూ పుట్టల వద్ద పూజలు చేస్తారు. పుట్టలో ఆవుపాలు, జొన్న ప్యాలాలు, తెల్ల గన్నేరు పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమలు వేస్తారు. ఆగరొత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొడతారు. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని పాము తింటే, నెల వంక దోషం తొలగిపోతుందనే అపోహ ఉంది. ఇది నిజమో కాదో కానీ, పుట్టలో పోసిన పాలను పాము తాగదు సరికదా.. ఊపిరాడక చనిపోతుంది. ఇలా ఒక్క నాగపంచమి రోజే జిల్లా వ్యాప్తంగా వందలాది పాములు మరణిస్తున్నా యని సమాచారం. కనుక పుట్టలో పాలు పోసే కంటే, పుట్ట వద్ద మొక్కి రావడం మేలని జంతు ప్రేమికులు సూచిస్తు న్నారు. తప్పని సరి అనుకుంటే పుట్ట వద్ద ఒక కుండ ఏర్పాటు చేసి అందులో పాలు పోయడం మంచిదని, లేదా రెండు మూడు చెంచాల పాలనే పుట్టలో పోయాలని, ధారగా పోయకూడదని సూచిస్తున్నారు.
నారారాధన ఎందుకు ?
నాగుల పంచమి సందర్భంగా పూజలు చేస్తే, స్త్రీలకు గర్భదోషాలు, లైంగిక అసంతృప్తులు తొలగడంతో పాటు కళ్లు, చెవులు, చర్మ వ్యాధులు నయమవుతాయని నమ్మకం. వంశాభివృద్ధి కూడా జరుగుతుందని పురాణంలో ఉన్నట్లు వేద పండితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ తెలిపారు.
Other News