Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Adilabad>>  General News
పట్టర పట్టు!

-పరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్, ఎస్పీ జట్లకు ‘టగ్ ఆఫ్ వార్’ పోటీ
- పాల్గొన్న పీఓ, జేసీ, ఇతర ఉన్నతాధికారులు
- విజేత కలెక్టర్ జట్టు
- ముగిసిన జిల్లా స్థాయి పోలీసు క్రీడలు
- ఓవరాల్ చాంపియన్ బెల్లంపల్లి ఏఆర్ జట్టు
- ద్వితీయ స్థానంలో ఆదిలాబాద్ ఏఆర్ జట్టు


ఆదిలాబాద్ టౌన్, జూలై 17 (టీ మీడియా): ఆదిలాబాద్ జిల్లా 46వ పోలీసు క్రీడల ముగింపు కార్యక్రమం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. కలెక్టర్ డాక్టర్ అశోక్, ఎస్పీ సర్వశ్రేష్ట్ త్రిపాఠి, జేసీ సుజాతశర్మ, ఐటీడీఏ పీఓ ముత్యాలరాజు, జిల్లా ప్రిన్సిపల్ జడ్జీ వెంకటప్రసాద్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మూడు రోజులుగా జరుగుతున్న క్రీడల్లో బెల్లంపల్లి ఏఆర్ జట్టు ఓవరాల్ ఛాంపియన్‌గా నిలవగా, ఆదిలాబాద్ ఏఆర్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసులతోనే సమాజంలో శాంతి భద్రతలు సురక్షితంగా ఉన్నాయని అన్నారు. క్రీడలతో శారీరక ధృఢత్వంతోపాటు మానసిక బలం కూడా చేకూరుతుందని అన్నారు. పోలీసులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని, ముఖ్యంగా యువతను సామాజిక సేవలో భాగస్వామ్యులను చేసేందుకు పోలీసులు కృషి చేయాలన్నారు. జిల్లా జడ్జి వెంకటప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన వారు అన్ని విషయాల్లో చురుకైన ఆలోచనలు కలిగి ఉంటారని అన్నారు. పోలీసుల ప్రవర్తనతో ప్రజల్లో మంచి నమ్మకం కలిగించాలన్నారు.

ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మంచి గౌరవముందని, ఈ గౌరవాన్ని నిలబెట్టడానికి సామాజిక స్పృహతో విధులు నిర్వహించాలని సూచించారు. అంకితభావంతో పనిచేసే వారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుందన్నారు. టీం ఈవెంట్‌లో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన బెల్లంపల్లి ఏఆర్ జట్టును, వ్యక్తిగత ఈవెంట్‌లో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన ఏఆర్ బెల్లంపల్లి జట్టు కానిస్టేబుల్ సమ్మయ్యలను అభినందిస్తూ గెలుపొందిన మిగితా జట్లకు, పోలీసు క్రీడాకారులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. వాలీబాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టగ్ ఆఫ్ వార్, జూడో, రెజ్లింగ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్‌లలో క్రీడలు మూడురోజులుగా జరిగాయి. క్రీడల ముగింపు సందర్భంగా కలెక్టర్, ఎస్పీ జట్ల మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ పోటీలో కలెక్టర్ జట్టు విజేతగా నిలిచింది. సీనియర్ సివిల్ జడ్జి మధుసూదన్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ సోమశేఖరరావ్, ఏఎస్పీ అంబర్ కిశోర్‌ఝా, డీఎస్పీలు, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, మంచిర్యాల్, కాగజ్‌నగర్ సబ్ డివిజన్, బెల్లంపల్లి, ఆదిలాబాద్ ఏఆర్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd