సింగరేణిలో ‘గుర్తింపు’ ఎన్నికలు ప్రశాంతం
- బెల్లంపల్లి రీజియన్‌లో 94.91 శాతం పోలింగ్
- ఓటు హక్కును వినియోగించుకున్న 22,537 మంది కార్మికులు
- పోలింగ్ కేంద్రాల వద్ద వివిధ సంఘాల హంగామా
- భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్ ప్రారంభం
- అర్ధరాత్రి దాటాక తేలనున్న ఫలితం
(టీ మీడియా, కోల్‌బెల్ట్ ప్రతినిధి ):సింగరేణిలో గురువారం ఐదో దఫా జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 94.91 శాతం మంది కార్మికులు బెల్లంపల్లి రీజియన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెల్లంపల్లి రీజియన్‌లో 23 వేల 810 మంది కార్మిక ఓటర్లు ఉండగా 22 వేల 537 మంది ఓటు వేశారు. ఉదయం పదకొండు గంటలకే కార్మికులు 60 శాతం పోలింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. రీజియన్‌లోని బెల్లంపల్లిలో 2550 మంది ఓటర్లుండగా 2437 (97.56 శాతం) మంది ఓటు వేశారు. శ్రీరాంపూర్‌లో 13911 మంది ఓటర్లుండగా 13137 (94.38 శాతం) మంది ఓటేశారు. మందమర్రిలో 7349 మంది కార్మికులుండగా 6967 (94.80 శాతం) మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలోని మూడు రీజియన్‌లలో మొత్తం 34 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఉదయం షిప్టు కార్మికులు ఉదయం ఏడు గంటలకు కొంత మంది విధులు నిర్వహించిన తరువాత మూడు గంటల నుంచి మరికొందరు ఇలా ఐదు గంటలకు పోలింగ్ ముగిసే దాకా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సెకండ్ షిప్టు, రాత్రి బదిలీ కార్మికులు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. బొగ్గు బావుల వద్ద ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ సంఘాల కార్యకర్తలు భారీగా గుమిగూడారు. పోలింగ్‌స్టేషన్లకు వంద మీటర్ల అవతల టెంట్లు వేసుకొని హంగామా చేశారు. తమ గుర్తుకే ఓటు వేయాలని కార్మికులను కోరారు. ఆయా ప్రాంతాల్లో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తి కాగానే ఆయా కౌంటింగ్ కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు బాక్సులను తరలించారు.
అనంతరం కౌంటింగ్ ప్రారంభ మైంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ఏఐటీయూసీకి ఓటు వేయాలని గనుల వద్దకు వచ్చి పోలింగ్ స్టేషన్ల ఆవల ఓటర్లను కోరారు. మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి శ్రీరాంపూర్‌కు, చెన్నూర్ ఎమ్మెల్యే మందమర్రి ఏరియాలోని రామక్రిష్ణాపూర్, మందమర్రి, కాసిపేటకు వెళ్లి టీబీజీకేఎస్‌కు ఓటు వేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. అటు ఐఎన్టీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీ వెంకట్రావు శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి వరకు వెళ్లి ఐఎన్టీయూసీకి ఓటు వేయాలని కోరారు. అన్ని చోట్లా వివిధ యూనియన్ల కార్యకర్తలు జెండాలతో, గుర్తుల ప్లెక్సీలతో ప్రచారం చేశారు. ఆర్కే 1ఏ గనిలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, గోలేటిలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, మందమర్రిలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సంపత్, రాజశేఖర్, జే రవీందర్, శ్రీరాంపూర్‌లో ఏఐటీయూసీ నాయకులు వీరభద్రయ్య, మల్లారెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు పెద్దపల్లి కోటిలింగం, బంటు సారయ్య, ఐఎన్టీయూసీ నాయకులు కాశీరావు, అన్నయ్య, హెచ్‌ఎంఎస్ నాయకులు రహీం, ఓజియార్, ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Other News