తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌ను వదిలి వెళ్లదు!

Tue,March 21, 2017 12:02 AM

muralimohan
రాష్ట్ర విభజన జరిగినా ఈ రెండు రాష్ర్ర్టాల్లోనూ వ్యాపారం చేసుకునే అవకాశం ఒక్క చిత్రపరిశ్రమకే వుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని కన్‌ప్ఫూజన్స్ మొదలయ్యాయి. దీనివల్ల కొత్తగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ రెండు ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు. వీటికి దగ్గరగా వున్న పేర్లతో ఇటీవల కొన్ని సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిల్లో సభ్యత్వం తీసుకుని చాలా మంది నష్టపోతున్నారు. ఏది సరైన సంస్థనో తెలుసుకోమని సభ్యులను కోరుతున్నాం అన్నారు సి.కల్యాణ్. ప్రభుత్వ గుర్తింపులేని కొన్ని సంస్థల ద్వారా ఇటీవల కొంత మంది నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం హైదరాబాద్‌లో సంయుక్తంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సౌతిండియా ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సి. కల్యాణ్ పై విధంగా స్పందించారు. ఆయన మరిన్ని విశేషాలు తెలియజేస్తూ ది హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 1941లో ఏర్పడింది. దీన్ని 2009లో ద తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌గా మార్పు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలంగాణ స్టేట్ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్‌గా మార్చడం జరిగింది.

అప్పటి నుంచి ప్రభుత్వ గుర్తింపుతో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్‌కు అఫిలియేటెడ్ బాడీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అనుబంధ సంస్థగా పనిచేస్తున్నది. 1951లో ఆంధ్రప్రదేశ్ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడింది. దీన్ని 1979లో ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌గా మార్చడం జరిగింది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు ఒకే సంస్థ వుండాలని 2015లో దీన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌గా మార్చాం. ఈ రెండు సంస్థలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన బాడీలుగా పని చేస్తున్నాయి. ఇటీవల మా ఛాంబర్ తరుపున ఆవార్డుల వేడుకను నిర్విహించనున్నామని వార్తలొచ్చాయి. ఇప్పటి వరకు ఫిలింఛాంబర్ తరుపున ఎలాంటి అవార్డుల వేడుకను నిర్వహించలేదు. భవిష్యత్తులో నిర్వహంచే ఆలోచన కూడా లేదు.

ప్రభుత్వం అవార్డుల వేడుకల్ని నిర్వహిస్తే మా సంస్థల తరుపున సహకారం అందిస్తాం. ప్రభుత్వం గుర్తింపు పొందని సంస్థల వల్ల సినిమా టైటిల్స్ విషయంలోనూ గందరగోళం తలెత్తుతున్నది. దాన్ని గుర్తించమని నూతన సభ్యులను కోరుతున్నాం అన్నారు. ఇటీవల బాలకృష్ణ తెలుగు చిత్రపరిశ్రమను ఏపీకి తరలిస్తాం అని ప్రకటించారు కదా? అని అడిగిన ప్రశ్నకు సి.కల్యాణ్ స్పందిస్తూ చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడటానికి యాభైఏళ్లు పట్టింది. అలాంటి పరిశ్రమను తరలించడం అనుకున్నంత సులువు కాదు. హైదరాబాద్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదు. కావాలంటే చిత్రీకరణ సౌలభ్యం కోసం రామానాయుడుగారు వైజాగ్‌లో స్టూడియోలు కట్టినట్టే అక్కడ మరిన్ని వెలిసే అవకాశం వుంది. భవిష్యత్తులో కావాలంటే వరంగల్‌లోనూ కొత్త స్టూడియోల నిర్మాణం జరగొచ్చు.

అంతే కానీ చిత్రపరిశ్రను మాత్రం తరలించే ప్రసక్తి లేదు అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి మురళీమోహన్ మాట్లాడుతూ సినిమా వెల్ఫేర్ అనేది మా బాధ్యత. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆలోచనా అదే. తెలుగు చిత్రపరిశ్రమకు సహకారం అందించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే వున్నారు. చిత్రపరిశ్రమకు సంబంధించిన సమస్యల్ని మా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడానికి మా సహకారం ఎప్పుడూ వుంటుంది. హైదరాబాద్‌లో 200 సినిమాలు, అనేక టీవీ సీరియల్స్ నిర్మాణం జరుగుతున్నది. వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై వున్నది. కేసీఆర్‌గారు రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీని నిర్మించి హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మారుస్తామని ప్రకటించిన దగ్గరి నుంచి కొంత మంది స్థలాలను కొట్టేయాలనే సాకుతో కొత్త కొత్త సంస్థల్ని సృష్టిస్తున్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా వుండి ఏ సంస్థలో చేరితే మంచిదో సభ్యులు గుర్తించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి.రామ్మోహన్‌రావు, మా అధ్యక్షుడు శివాజీరాజా, నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్, శ్రీధర్, ఏడిద శ్రీరామ్, ముత్యాల రాందాస్, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

1509

More News

మరిన్ని వార్తలు...